RBI on Loan Apps: లోన్ యాప్‌ల ఆగడాలు, అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతోమందిని ఆత్మహత్య చేసుకునేలా వేధిస్తోన్న ఈ లోన్‌ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.


కీలక సమావేశం


చట్ట విరుద్దమైన లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్ అయింది. వీటిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అక్రమ లోన్ యాప్‌లపై కఠిన చర్యలకు ప్రణాళిక రచించింది.


వైట్ లిస్ట్


చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్రం ఆదేశించింది. వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.


దారుణంగా


ఆన్లైన్ లోన్ యాప్ ల ఆగడాలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది బలైపోయారు. లోన్ యాప్‌లో రుణం తీసుకుంటే ఇక చావే శరణ్యం అన్నంతగా వేధిస్తున్నారు రికవరీ ఏజెంట్లు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ఉసురు తీశాయి లోన్ యాప్‌లు. ఇటీవల రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు కారణమయ్యాయి.


అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్‌ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్‌ కుట్టుకుంటూ జీవిస్తున్నారు.  


అప్పు తీసుకొని 


ఇటీవల ఇంటి అవసరాల కోసం ఆన్ లైన్‌ లోన్ యాప్‌లో కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు సకాలంలో తీర్చకపోవడంతో  లోన్‌ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ ఫోన్ కాల్స్ చేసి వేధింపులు మొదలుపెట్టారు. అప్పు చెల్లించకపోతే భార్యాభర్తల నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పెడతామని బెదిరించారు. దుర్గాప్రసాద్‌ బంధువులకు, స్నేహితులకు కాల్స్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పేవారు. ఈ ఘటనలతో పరువు పోయిందని భావించిన దంపతులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.


మరో ఘటన


తెలంగాణ కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన భరత్ కుమార్ అనే వ్యక్తికి కూడా లోన్‌ యాప్‌ నిర్వాహకులు చుక్కలు చూపించారు. ఓ కాంటాక్ట్ ద్వారా భరత్‌కు యాప్ వచ్చింది. ఆ యాప్‌ను భరత్ కుమార్ ఓపెన్ చేసి వివరాలు ఫిల్ చేస్తే మూడు వేల రూపాయలు అకౌంట్లో వేశారు. 


ఆరు రోజుల తర్వాత భరత్‌ 3000లకు 6000 రూపాయలను రెట్టింపు చెల్లించాడు. ఇలా సుమారు రెండు లక్షల వరకు భరత్ కుమార్ లోన్ తీసుకొని పూర్తిగా చెల్లించగా మరో లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని మెసేజ్ పెట్టి వేధించారు. అంతేకాకుండా ఇష్టం వచ్చిన విధంగా ఆ యాప్ కు సంబంధించిన మహిళలు బూతులు తిడుతూ భరత్ కుమార్‌ను వేధించారు. 


తిట్లతోపాటు భరత్ కుమార్ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆయనకు సంబంధించిన కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వారందరికీ వాట్సాప్‌ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భరత్ కుమార్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 


Also Read: Kim Jong-un: ఇక ఆటోమెటిక్‌గా అణుదాడి- తగ్గేదేలే, కిమ్‌ కొత్త చట్టం!


Also Read: SC On Hijab: నమాజ్ తప్పనిసరి కానప్పుడు, హిజాబ్ ఎలా?: సుప్రీం సూటి ప్రశ్న