Afghan Woman Protest:
ప్లకార్డ్ పట్టుకుని నిరసన..
అప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలై ఏడాది దాటింది. అధికారం చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి మహిళా విద్యపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ మధ్యే మహిళలకు యూనివర్సిటీ విద్య అవసరం లేదంటూ నిషేధం విధించారు. దీనిపై మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నా..అణిచివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 18 ఏళ్ల యువతి ఒంటరిగా పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఖురాన్‌లోని పదాలను కోట్ చేస్తూ ఓ ప్లకార్డ్‌ను పట్టుకుని యూనివర్సిటీ ముందు నిలుచుంది. డిసెంబర్ 25న కాబూల్ యూనివర్సిటీ ముందు ప్లకార్డ్ పట్టుకుని తాలిబన్లపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆ ప్లకార్డ్‌పై అరబిక్ పదం "Iqra" అని రాసి ఉంది. అంటే దానర్థం "చదువు" అని. మహమ్మద్ ప్రవక్తకు అల్లా ప్రవచించిన మొదటి పదం ఇదేనని ముస్లింలు విశ్వసిస్తారు. "దేవుడు మాకు చదువుకునే హక్కు ఇచ్చాడు. మేం భయ పడాల్సింది దేవుడికి మాత్రమే. మా హక్కులను అణిచివేస్తున్న తాలిబన్లకు కాదు" అని చాలా గట్టిగా చెబుతోంది ఆ యువతి. "మేం నిరసన వ్యక్తం చేసిన ప్రతిసారీ దారుణంగా బెదిరిస్తున్నారు. కొడుతున్నారు. తిడుతున్నారు. ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. అయినా సరే వాళ్ల ముందు ఇలా ధైర్యంగానే నిలబడతా. మొదట్లో వాళ్లు నన్ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఓ గన్‌మేన్ వచ్చి నన్ను వెళ్లిపోమన్నాడు" అని వివరించింది.
నిజానికి...మొదట్లో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ...ఆమె చేతిలో ఉన్న పేపర్‌లో రాసి ఉన్న పదం అందరి దృష్టిని మరల్చింది. "ఈ ప్లకార్డ్‌పై ఏం రాసుందో తెలియదా అని అడిగాను. ఆ గన్‌మేన్ ఏ సమాధానమూ ఇవ్వలేదు. దేవుడి చెప్పిన పదం కూడా చదవలేవా అని మళ్లీ ప్రశ్నించాను. వెంటనే అతడికి కోపం వచ్చింది. నన్ను బెదిరించాడు" అని తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పింది ఆ 18 ఏళ్ల యువతి. దాదాపు పావుగంట పాటు అలా వాగ్వాదం జరిగాక...వెనక్కి వచ్చేసింది. ఇదంతా జరుగుతుంటో...ఆమె చెల్లెలు దూరంగా ట్యాక్సీలో కూర్చుని కెమెరాలో రికార్డ్ చేసింది. ఈ సమయంలో కార్ డ్రైవర్ ఎంతో భయపడిపోయాడని, తాలిబన్లకు తెలిస్తే చంపేస్తారని హెచ్చరించాడని చెప్పింది ఆ యువతి సోదరి. అఫ్ఘనిస్థాన్‌లో ఇప్పుడీ అమ్మాయి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
యూనివర్సిటీ విద్యపై ఆంక్షలు..
మహిళలనే లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు విపరీత ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే...వాళ్ల చదువులపైనా తుపాకీ గురి పెడుతున్నారు. మహిళలు యూనివర్సిటీ విద్య అభ్యసించడంపై నిషేధం విధించారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ అమెరికా సహా ఐక్యరాజ్య సమితి దేశాలు మండి పడుతున్నా...తాలిబన్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. "మేమేమీ అంత అరాచకవాదులం కాదు. ఎలా పాలించాలో తెలుసు" అంటూనే అప్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు...అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళల వస్త్రధారణపై ఇప్పటికే ఆంక్షలు విధించగా...ఇప్పుడు వాళ్ల చదువులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు.