Pakistan Terror Attack:
చుట్టుముట్టిన ఉగ్రవాదులు..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వాలో పాక్ సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జెనీ ఖేల్ ఏరియాలో నిఘా వర్గాల ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు Dawn వార్తాపత్రిక వెల్లడించింది. వీరితో పాటు ఓ పాక్ సైనికుడు కూడా చనిపోయినట్టు తెలిపింది. ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ సైనికులపై ఉగ్రవాదులు దాడులు చేస్తూ చంపుతున్నారు. సామాన్య పౌరులనూ బలి తీసుకుంటున్నారు. దీనికి బదులు తీర్చుకోవాలనుకున్న పాక్ సైన్యం...సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి నలుగురు ముష్కరులను హతమార్చింది. ఉన్నట్టుండిసైనికులను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఆ సమయంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ సైనికుడు ఒకరు నేలకొరిగారు. ఆ తరవాత పోలీసులు ఎదురు దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్ గ్రెనేడ్స్, రాకెట్స్‌ను వినియోగిస్తూ స్థానిక పౌరులను, సైనికుల ప్రాణాలు తీస్తున్నారు ఉగ్రవాదులు. డిసెంబర్ 25 పోలీసుల వ్యాన్‌పై ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ముందుగానే గుర్తించి ప్రమాదాన్ని తప్పించారు. డిసెంబర్ 29న తక్వారా ఏరియాలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 6గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ పిస్టల్‌ని, 20 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
గత వారం ఆత్మాహుతి దాడి..
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీస్ ప్రాణాలు కోల్పోగా...ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామా బాద్‌లోని I-10 సిటీలో ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. వాహనాల తనిఖీ చేస్తుండగా...ఓ కార్ పోలీసులకు అనుమానా స్పదంగా కనిపించింది. వెంటనే ఆ కార్‌ను ఆపి చెక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో అందులోని డ్రైవర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ ఆరుగురిలో నలుగురు పోలీసులు కాగా...ఇద్దరు సాధారణ పౌరులున్నారు. ట్విటర్ ద్వారా ఇస్లామాబాద్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. "మేం చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ కార్ అనుమానాస్పదంగా కనిపించింది. ఆఫీసర్స్ ఆ కార్‌ను ఆపిన మరుక్షణమే డ్రైవర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఓ పోలీస్ మృతి చెందాడు" అని ఇస్లామాబాద్ పోలీస్ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. "కార్‌లో ఓ జంట ఉంది. అనుమానం వచ్చి మేం తనిఖీ చేసేందుకు ఆపాం. ముందు ఇద్దరూ కిందకు దిగారు. చెకింగ్ చేస్తుండగా డ్రైవర్ ఏదో కారణం చెప్పి మళ్లీ కార్‌లోకి వెళ్లాడు. అప్పుడే సూసైడ్ బాంబుతో తనను తాను పేల్చుకున్నాడు" అని డీజీపీ స్పష్టం చేశారు.
Also Read: LPG Price Hike: భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ కాంగ్రెస్ సెటైర్