Delhi Earthquake:


అర్ధరాత్రి భూకంపం..


కొత్త ఏడాది మొదటి రోజే దేశ రాజధాని ప్రజలను తెల్లవారుజామునే భూకంపం భయపెట్టింది. National Center for Seismology (NCS) వివరాల ప్రకారం..ఢిల్లీ NCR ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8గా నమోదైందని అధికారులు తెలిపారు. హరియాణాలోని ఝజ్జర్‌ ప్రాంతంలో భూమి కాసేపు కంపించినట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 1.19 గంటలకు ఈ భూకంపం వచ్చినట్టు వెల్లడించారు. 5 కిలోమీటర్ల లోతు మేర భూకంప తీవ్రత కనిపించిందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు ఈ అలజడి నుంచి కోలుకుంటుండగానే... బెంగాల్‌లోనూ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అయితే...ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఉదయం 11 గంటలకు ఉన్నట్టుండి భూమి కంపించింది. కోల్‌కత్తాకు 409 కిలోమీటర్ల దూరంలో ఉన్న బే ఆఫ్ బెంగాల్‌లో 10 కిలోమీటర్ల లోతు మేర భూకంప తీవ్రత కనిపించింది. అంతకు ముందు గతేడాది నవంబర్ 12న కూడా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 5.4గా తీవ్రత నమోదైంది. అక్టోబర్ 19న ఖాట్మండులోనూ ఇదే విధంగా కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. 






గతేడాదిలోనూ..


ఉత్తర భారతదేశం భూ ప్రకంపనలతో తరచూ వణికిపోతోంది. పంజాబ్ లో గతేడాది నవంబర్ 13న వేకువజామున కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1 గా నమోదైందని సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అమృత్ సర్ సమీపంలో తెల్లవారు జామున సుమారు 120 కిలోమీటర్ల మేర భూమి కంపించిందని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో జనం భయంతో బయటకు వచ్చి రాత్రంతా జాగారం చేశారు. ఆ నెలలో వారం రోజుల్లో ఉత్తర భారతంలో మూడు సార్లు భూకంపం సంభవించింది. నవంబర్ 9న దిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో, నవంబర్ 10న ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అయితే తక్కువ తీవ్రతతో వస్తున్న ప్రకంపనల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. 
భూకంపం సంభవించినప్పుడు మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉండటం చాలా ముఖ్యం. భూకంపం కారణంగా భవనాలు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. భూకంపాల వల్ల సంభవించిన మరణాలన్నీ భవన శిథిలాల కింద సమాధి కావడం వల్లనే అవుతుంటాయి. అటువంటి పరిస్థితిలో, భూకంపం సమయంలో మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉండటం ముఖ్యం.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి..


భూకంపం సమయంలో మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు భూకంపం సమయంలో ఇంటి లోపల ఉంటే ఒక దృఢమైన టేబుల్ లేదా ఏదైనా ఫర్నిచర్ కింద వెళ్లి కూర్చోవాలి. ఇంట్లో టేబుల్ లేదా డెస్క్ లేకపోతే, మీ ముఖం, తలపై మీ చేతులతో కప్పి, భవనంలో ఒక మూలలో కూర్చోండి. ఒక టేబుల్ లేదా బెడ్ కింద, గది మూలలో ఉండొచ్చు. భూకంపం సమయంలో గాజులు, కిటికీలు, తలుపులు, గోడలకు దూరంగా ఉండండి. పడే వస్తువుల చుట్టూ ఉండకండి.


Also Read: Covid 19 Canada: కెనడాలోనూ కరోనా అలెర్ట్, నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే దేశంలోకి అనుమతి