Russia Ukraine War:
న్యూ ఇయర్ స్పీచ్‌లు..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం 11 నెలలుగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఏడాది పూర్తవుతుంది. అయినా...ఇప్పటికీ ఈ యుద్ధం కొలిక్కి రాలేదు. కొత్త ఏడాది వచ్చే ముందు కూడా రష్యా ఉక్రెయిన్‌పై మిసైల్స్ వర్షం కురిపించింది. రాజధాని కీవ్‌లోనూ క్షిపణుల దాడులు కొనసాగాయి. అయితే...ఇరు దేశాల అధ్యక్షులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. "విజయం మాదే" అని ఇద్దరూ గట్టిగా చెబుతున్నారు. న్యూ ఇయర్ స్పీచ్‌లలో ఇద్దరి మాటల్లోనూ ఇదే వినిపించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ దేశ సైనికుల ప్రాణత్యాగం గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ సైనికుల ధైర్యసాహసాల్ని మెచ్చుకున్నారు. "ఉనికి కాపాడుకునేందుకే ఈ యుద్ధం" అని ఇద్దరు దేశాధ్యక్షులు చాలా గట్టిగా చెప్పారు. త్వరలోనే ఆశించిన ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు 17 నిముషాల పాటు ప్రసంగించిన జెలెన్‌స్కీ చాలా సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత కష్టకాలంలోనూ ధైర్యంగా ఉంటున్న ఉక్రెయిన్ ప్రజల్ని చూసి గర్వపడుతున్నాని అన్నారు. "ఉక్రెయిన్ ప్రజలు పోరాడతారు. తప్పకుండా గెలుస్తారు" అని తేల్చి చెప్పారు. దేశమంతా కలిసికట్టుగా రష్యాపై పోరాడుతోందని అన్నారు. "ఈ యుద్ధంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒకరికి ధన్యవాదాలు. సరెండర్ అవడం తప్ప వేరే ఆప్షన్ లేదని బెదిరించారు. కానీ...నేను ఒకటే చెబుతున్నా. మనకు గెలవడం తప్ప మరో ఆప్షన్ లేదు" అని చాలా ధీమాగా చెప్పారు జెలెన్‌స్కీ. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తగ్గేదేలేదు అన్న స్థాయిలో మాట్లాడారు. "మన దేశం కోసం సైన్యం పోరాడుతోంది. న్యాయం కోసం పోరాడుతోంది. మన కుటుంబాల కోసం, మన రష్యా కోసం మన యుద్ధం గెలిచి తీరాలి" అని స్పష్టం చేశారు.
మిసైల్స్ అటాక్..
ఉక్రెయిన్‌పై అంతకంతకూ దాడుల తీవ్రత పెంచుతూ పోతోంది రష్యా. ఇప్పటికే కీలక ప్రాంతాలపై క్షిపణుల దాడులు చేసి ఎన్నో భవంతులను నేలమట్టం చేసింది. ఇప్పుడు ఏకంగా 120 మిసైల్స్‌తో విరుచుకు పడింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో చాలా సేపటి వరకూ గాల్లో సైరన్‌లు మోగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌తో సహా చాలా ప్రాంతాల్లో ఈ దాడుల శబ్దాలు భయంకరంగా వినిపించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మొత్తం 120 మిసైల్స్‌ను లాంచ్ చేశామని పుతిన్ సలహాదారు ఒకరు స్పష్టం చేశారు. మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు స్పష్టం చేశారు. ఓ 14 ఏళ్ల బాలికతో పాటు మొత్తం ముగ్గురు ఈ దాడుల్లో తీవ్రంగా
గాయపడ్డారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖార్కివ్, ఒడెశా, ల్వివ్, జైటోమిర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. రష్యా అన్ని దిక్కుల నుంచి దాడులు మొదలు పెట్టిందని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. క్రూజ్ మిజైల్స్‌తో దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. సెల్ఫ్ ఎక్స్‌ప్లోడింగ్ డ్రోన్స్‌తో ఇప్పటికే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసింది రష్యా. ఒక్క ఒడెశా ప్రాంతంపైనే 21 మిసైల్స్‌తో దాడి చేసింది. అత్యంత కీలకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు చేసింది రష్యా సైన్యం.
Also Read: Sandeep Singh Resigns: హరియాణా క్రీడా మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, తక్షణమే రాజీనామా