Sandeep Singh Resigns:
మహిళా కోచ్ ఆరోపణలు..
హరియాణా క్రీడాశాఖ మంత్రి, ఇండియన్ హాకీ టీమ్ మాజీ కేప్టెన్ సందీప్ సింగ్ రాజీనామా చేశారు. ఓ ఫిమేల్ కోచ్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు రాజీనామా సమర్పించారు. ఈ కేసు విచారణకు డీజీపీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రి సందీప్ సింగ్ మాత్రం.. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అంటున్నారు. కావాలనే తన ఇమేజ్‌కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడుతున్నారు. "ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. నాపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని విచారణలో తేలుతుందని విశ్వసిస్తున్నాను. ఇందుకు సంబంధించిన నివేదిక వచ్చేంత వరకూ నా పదవిలో నేను ఉండొద్దని అనుకున్నాను. అందుకే..వెంటనే రాజీనామా చేసి సీఎంకి ఇచ్చేశాను" అని వెల్లడించారు సందీప్ సింగ్. ఆరోపణలు చేసిన మహిళా కోచ్ హోం మంత్రి అనిల్ విజ్‌ను కలిశారు. పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు. తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ హోం మంత్రికి వివరించారు. చంఢీగఢ్ పోలీసులు సందీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ ఇచ్చేందుకూ ఇబ్బందులు పెట్టారని మహిళా కోచ్ ఆరోపించారు.
ఏంటి వివాదం..?
మహిళా కోచ్ చెబుతున్న వివరాల ప్రకారం..2016 రియో ఒలిపింక్స్ తరవాత సందీప్ సింగ్ మహిళా కోచ్‌కు స్నాప్‌చాట్‌లో మెసేజ్ చేశారు. "ఓ సారి ఆయన నాకు కాల్ చేశారు. నన్ను హ్యాపీగా ఉంచు. నిన్ను హ్యాపీగా ఉంచుతాను అంటూ ఏదేదో మాట్లాడారు. కొన్ని సార్లు వేధించారు కూడా. ఏదో విధంగా ఆ ఉచ్చు నుంచి బయట పడి ప్రాణాలు రక్షించుకున్నాను. ఇలా చేసినందుకే నన్ను ట్రాన్స్‌ఫర్ చేశారు. వేధించడం మొదలు పెట్టారు" అని ఆరోపించారు మహిళా కోచ్.