ABP News C-Voter Survey Gujarat:
గుజరాత్ ఎన్నికలు
ఈ నెలాఖర్లో గుజరాత్ ఎన్నికల (Gujarat Election 2022) తేదీలు వెలువడే అవకాశాలున్నాయి. తేదీలు ప్రకటించకున్నా...ఆప్, భాజపా, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం మొదలు పెట్టాయి. ఆప్ నెల రోజుల ముందే క్యాంపెయినింగ్ షురూ చేసింది. తరవాత భాజపా గౌరవ్ యాత్ర పేరిట పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల తేదీలు ఎప్పుడైనా వెలువడుతాయి. అయితే...మూడు పార్టీలు శక్తిమేర ప్రయత్నిస్తున్నా ఈ సారి గుజరాత్ ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నదే ఉత్కంఠగా మారింది. దీనిపైనే ABP News కోసం C-Voter (ABP News C-Voter Survey)ఓ సర్వే చేపట్టింది.
సర్వేలో ఏం తేలిందంటే..?
ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రచార జోరు మామూలుగా లేదు. అటు భాజపా బయటకు చెప్పకపోయినా..కాస్తో కూస్తో ఆప్ వేగానికి కలవరపడుతోంది. తప్పకుండా గెలుస్తామన్న ధీమా కాషాయ పార్టీకి ఉన్నప్పటికీ..ఆప్ జోరుతో కాస్త అప్రమత్తంగా ఉంటోంది. నిజానికి..ఆప్ బలపడితే ఆ దెబ్బ భాజపా కంటే ఎక్కువగా కాంగ్రెస్‌పైనే పడుతుంది. కానీ...ఆ ప్రభావం ఎంత మేర ఉంటుందన్నదే ప్రశ్న. అదే సమయంలో ఆప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటికే హామీల వర్షం కురిపించింది. ఢిల్లీ మోడల్‌నే గుజరాత్‌లోనూ అమలు పరుస్తామని భరోసా ఇస్తోంది. అయితే...ఈ ప్రకటనలు, విమర్శలతో ఆ పార్టీకి ఎంత ప్రయోజనం కలుగుతుందన్నది చూడాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఒక్కటే. కాంగ్రెస్‌ను పూర్తిగా సైడ్‌కి నెట్టేసి భాజపా వర్సెస్ ఆప్‌గా ఎన్నికలను మార్చేయాలని కేజ్రీవాల్ వ్యూహం అమలు చేస్తున్నారు. అంటే...గుజరాత్‌లో ఓటమి పాలైనప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఆప్ ఉండాలన్నది ఆ పార్టీ ఆలోచన అయి ఉండొచ్చు. అందుకే...కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లాంటి సీనియర్ నేతలంతా గుజరాత్‌లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ వేగమే కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బ తీస్తుందాన్న అన్న ప్రశ్నతో సర్వే నిర్వహించింది C- Voter.
గుజరాత్ ప్రజలు ఏం చెప్పారు..?
గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ బలం పుంజుకుంటే కాంగ్రెస్ బలహీన పడుతుందా అన్న ప్రశ్నకు 44% మంది అవుననే సమాధానమిచ్చారు. 33% మంది ఆ ప్రభావం తక్కువే అని తేల్చి చెప్పారు. ఇక 23% మంది ఆప్‌తో కాంగ్రెస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని వెల్లడించారు.
2 విడతల్లో ఎన్నికలు..?
మొత్తం రెండు విడతలుగా గుజరాత్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో భాగంగా నవంబర్ చివరలో ఎన్నికలు నిర్వహించి...డిసెంబర్ 4-5 తేదీల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకేసారి జరగనున్నట్టు సమాచారం. గుజరాత్ అసెంబ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న
ముగుస్తుంది. 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో చివరిసారి 2017లో ఎన్నికలు జరిగాయి. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
Also Read: Amaravati : అమరావతిదే అంతిమ గెలుపు - శంకుస్థాపనకు ఏడేళ్లు ! చంద్రబాబు స్పందన ఇదే