Amaravati :     ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంఖుస్ధాపన చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 2015లో ఇదే రోజు అమరావతిని రాజధానిగా సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో కలిసి శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇవాళ వరుస ట్వీట్లు చేశారు. వీటిలో చంద్రబాబు అమరావతి రాజధాని ఎలా ప్రారంభమై, ఎలా ఆగిపోయిందో గుర్తుచేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని, పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమరావతి నిలుస్తుందని..గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. 





రాష్ట్ర విభజన తర్వాత 2014  సెప్టెంబరు 3న  రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం  చేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మా ప్రాంతానికి రాజీనామా కావాలని ఏ ప్రాంతం వారూ ఆందోళన చేయలేదు. ట్టంలో పేర్కొన్నట్లే సీఆర్డీఏను ఏర్పాటు చేసి.. 7317 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేపిటల్ రీజియన్ ను.. 217.23 చదరపుకిలోమీటర్లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఎంపిక చేయటం.. దానిని రైతుల వద్ద నుంచి తీసుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాజధాని పరిధిలోని రైతులు స్పందించారు. అమరావతి భావనకు ఒక దారి ఏర్పడింది. రెండు నెలల వ్యవధిలో అమరావతి ప్రాంతానికి చెందిన 20510మంది రైతులు 32469 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. ఏడేళ్ల క్రితం అక్టోబరు 22న ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.   


   
అయితే 2019లో  జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాజధాని నిర్మాణం ఆగిపోయింది.  అదే ఏడాది డిసెంబరు 17న అమరావతికి బదులుగా మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో సీఎం జగన్ చేశారు   ఏపీ రాజధానిగా నిర్ణయించిన అమరావతి కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్నారు. మూడు ప్రాంతాల్ని సమంగా చూడాలన్న పేరుతో మొదలైన మూడు రాజధానుల కాన్సెప్టు కొత్త గందరగోళానికి తెర తీసింది. రైతులు ఉద్యమబాట పట్టారు. ఇప్పుడు ఏపీ అధికారికంగా అమరావతే రాజధాని. కానీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. అందుకే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.