Arunachal Helicopter Crash:


ఏటీసీకి మేడే కాల్‌ చేసిన పైలట్..
 
అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ సైనిక హెలికాప్టర్ క్రాష్ అయింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగింగ్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డు మార్గం లేదని, రెస్క్యూ టీమ్‌ను వెంటనే పంపినట్లు రక్షణ శాఖ పేర్కొంది. అయితే...ఈ ప్రమాదానికి సంబంధించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హెలికాప్టర్ కూలే ముందు పైలట్ "Mayday" కాల్ ఇచ్చినట్టు తేలింది. మేడే కాల్ అంటే...ఏదైనా ప్రమాదం జరిగే సూచన ఉన్నప్పుడు రేడియో ద్వారా పైలట్ సమాచారం అందించటం. ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా..వెంటనే ఆ రేడియో ద్వారా పైలట్ అలర్ట్ చేస్తాడు. ఈ ప్రమాదం జరిగే ముందు Air Traffic Control (ATC)కి కాల్ చేశాడు పైలట్. టెక్నికల్ లేదా మెకానికల్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చని చెప్పాడు. అంతలోనే హెలికాప్టర్ కుప్ప కూలింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. నిజానికి వాతావరణ పరిస్థితులు హెలికాప్టర్ఎగరటానికి అనకూలంగానే ఉంది. పైగా...ఆ పైలట్‌కు ఎంతో అనుభవం కూడా ఉంది. అయినా...ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్నది విచారణ తరవాతే తేలనుంది. శుక్రవారం ఉదయం 10.45 నిముషాలకు ఈ సంఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 5గురు ఉండగా...నలుగురి మృత దేహాలు లభించాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






ఉత్తరాఖండ్‌లోనూ..


ఇటీవల హెలికాప్టర్‌ కూలిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.


" ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఉదయం 11:40 గంటలకు ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ కేదార్‌నాథ్ నుంచి గుప్తకాశీ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం విచారణ తర్వాత తెలుస్తుంది.                         "
- సీ రవిశంకర్, ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ 


Also Read: Jharkhand Shocker: ఐటీ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం, బాయ్‌ఫ్రెండ్‌తో బైక్‌పై వెళ్తుండగా అడ్డగించిన దుండగులు