Komatireddy Venkat Reddy Comments: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇదివరకే రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలని, మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతలకు వెంకటరెడ్డి ఫోన్ చేసి మాట్లాడారని ఆడియో టేపు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. తాజాగా ఆస్ట్రేలియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల్లో పార్టీకి దూరంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ గుబులు !
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సమయంలో ఇక్కడ ఉండకుండా ఆయన ప్లాన్ చేసుకున్నారని పార్టీలోనూ ప్రచారం జరుగుతోంది. అయితే మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అక్కడ ఉండి మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా ఉపయోగం లేదన్నారు. ప్రచారం చేసినా వస్తే 10 వేల ఓట్ల వరకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుందని తెలిసి, ప్రచారం చేయడంలో అర్థం లేదని వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాలో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మొన్న ఆడియో కలకలం..
మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు రెండు రోజుల కిందట ఓ ఆడియో వెలుగుచూసింది. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఫోన్ కాల్ సంభాషణలో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నట్లు ఉంది. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా అధికారంలోకి తీసుకొస్తానన్నారు. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలని వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా... చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారన్నారు.
రేవంత్ ఇచ్చిన లీకులు ఇవేనా!
తమ పార్టీ నేతల కుట్ర చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదివరకే కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని, కొందరు నేతలు సీఎం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా వ్యాఖ్యలు చేశారు. తనను పీసీసీ పదవి నుంచి దించేందుకు, మునుగోడులో కాంగ్రెస్ ఓటమి కోసం పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీ, టీఆర్ఎస్ లతో చేతులు కలిపారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేసిన తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీకులు వెలుగుచూశాయి. అంతలోనే కాంగ్రెస్ గెలిచే ప్రసక్తేలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.