Indian Man Awarded:


2019లో ప్రమాదం..


2019లో దుబాయ్‌లో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడికి అక్కడి ప్రభుత్వం 11 కోట్ల రూపాయల పరిహారం అందించింది. 2019లో ఓ బస్సు మెట్రో స్టేషన్ వద్ద బ్యారియెర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జైంది. 17 మంది ప్రాణాలు కోల్పోగా...వీరిలో 12 మంది భారతీయులే. నిర్లక్ష్యంగా బస్సుని నడిపిన డ్రైవర్‌కు దుబాయ్ ప్రభుత్వం 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హాంలు చెల్లించాలని జరిమానా కూడా విధించింది. భారత్‌కు చెందిన 20 ఏళ్ల మహమ్మద్ బైగ్ మిర్జా ప్రమాదం జరిగిన సమయంలో ఒమన్ నుంచి యూఏఈకి ప్రయాణిస్తున్నాడు. తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనిపై కోర్టుకు వెళ్లింది బాధిత కుటుంబం. మిర్జా తరపున వాదించిన న్యాయవాది...కేసు బలంగా ఉండేలా చూసుకున్నారు. భారీ మొత్తంలో పరిహారం వచ్చేలా వాదించారు. అప్పటికే UAE Insurance Authority 1 మిలియన్ దిర్హాంలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ తరవాత దుబాయ్ కోర్టుకు వెళ్లాడు బాధితుడు. ఆ మొత్తం సరిపోదు అని న్యాయపోరాటం చేశాడు. చివరకు 5 మిలియన్ దిర్హాంలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. ఈ మేరకు అధికారిక తీర్పుని కూడా ఇచ్చింది. 


కోమాలోకి వెళ్లి...


ప్రమాదం జరిగే సమయానికి మిర్జా...మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్స్ చేస్తున్నాడు. ప్రమాదం జరిగాక దాదాపు 14 రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు. దాదాపు రెండు నెలల పాటు వైద్యం చేస్తేకానీ...మళ్లీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తరవాత రిహాబిలిటేషన్ సెంటర్‌కి పంపించారు. ఈ యాక్సిడెంట్‌లో మెదడుకి బలంగా గాయమైనట్టు వైద్యులు వెల్లడించారు. మళ్లీ సాధారణ జీవితం గడపడానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు. చెవులు, నోరు, భుజాలు..ఇలా అన్ని అవయవాలకూ తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. 


అమెరికాలో ఇలా...


వడదెబ్బ తగిలి మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అమెరికాలో ఒక‌ యూనివర్సిటీ భారీ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. తమ కుమారుడి మృతికి అమెరికాలోని యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో సదరు యూనివర్సిటీ 14 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 110 కోట్లు) పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించింది. కుప్పకూలి మరణించాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో ఆగస్ట్ 31 2020న రెజ్లింగ్‌కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గ్రాంట్‌ బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. అయితే, శిక్షణ స‌మ‌యంలో నార్కోలెప్సీ, ADHDతో బాధపడుతున్న బ్రేస్ కొండపైకి, కిందికి చాలాసార్లు పరుగెత్త‌డంలో బాగా అల‌సిపోయాడు. విప‌రీత‌మైన దాహంతో బాధ‌ప‌డుతూ మంచినీరు కావాల‌ని వేడుకుంటున్నప్పటికీ కోచ్‌లు అత‌ను నీరు తాగడానికి నిరాక‌రించారు. త‌న శారీర‌క ప‌రిస్థితిని వివ‌రించినా వైద్య స‌హాయాన్ని అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. శిక్షణలో భాగమని పేర్కొంటూ ఇత‌రులెవ‌రూ అతనికి నీరు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఫ‌లితంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతూ బ్రేస్ కొద్దిసేపటికే మరణించాడు. తమ కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బ్రేస్ కుటుంబం కోర్టును ఆశ్ర‌యించింది. త‌మ‌ కుమారుడి పట్ల కఠినంగా వ్యవహరించడం వల్లే అతడు మృతి చెందాడ‌ని న్యాయ‌స్థానానికి బాధిత త‌ల్లిదండ్రులు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో బాధిత కుటుంబానికి విశ్వవిద్యాలయం 14 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. 


Also Read: Manish Sisodia's Letter: మోదీకి సైన్స్‌పై అవగాహన లేదు,చదువుకోని ప్రధాని దేశానికే ప్రమాదకరం - సిసోడియా లేఖ