Manish Sisodia's Letter:


జైల్లో నుంచే లేఖ రాసిన సిసోడియా..


ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రస్తుతం లిక్కర్ స్కామ్‌ కేసులో తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కస్టడీని పొడిగిస్తూ వస్తోంది ఢిల్లీ కోర్టు. బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా దాన్ని తిరస్కరించింది. జైల్లో ఉన్నా...బీజేపీపై విమర్శలు ఆపడం లేదు సిసోడియా. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ విద్యార్హతలపై చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసిన తరవాత ప్రతిపక్షాలన్నీ కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిసోడియా జైల్లో నుంచే ఈ వివాదంపై స్పందించారు. దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశారు. ప్రధాని స్థాయిలో ఉన్న మోదీ విద్యార్హతలు సరిగ్గా లేకపోతే అది దేశానికి ఎంతో ప్రమాదం అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ లెటర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 


"ప్రధాని స్థాయి వ్యక్తి సరిగ్గా చదువుకోకపోతే అది దేశానికే ప్రమాదం. మోదీకి సైన్స్‌పై అవగాహన లేదు. విద్యకున్న ప్రాధాన్యత ఏంటో ఆయనకు తెలియదు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా 60 వేల స్కూళ్లు మూసేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే... బాగా చదువుకున్న వ్యక్తి ప్రధాని పదవిలో ఉండటం అత్యవసరం" 


- మనీశ్ సిసోడియా 






గతంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి అసహనం వ్యక్తం చేశారు. 


"ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కొన్ని దేశ ప్రజల్ని షాకింగ్‌కు గురి చేశాయి. టీ తయారు చేసే విధానం గురించి పిల్లలకు చెబుతూ వింత వ్యాఖ్యలు చేశారు. మేఘాల వెనక్క దాక్కుని ఉంటే రేడార్ ద్వారా విమానాన్ని గుర్తించొచ్చని మరోసారి అన్నారు. కెనడాలో ఓ మ్యాథ్స్ ఫార్ములాను సరైన విధంగా చెప్పలేకపోయారు. భారత ప్రజలు ఇది విని చాలా అసహనానికి లోనయ్యారు. అంతే కాదు. వాతావరణ మార్పుల గురించీ సరిగ్గా మాట్లాడలేకపోయారు. అలాంటప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించగలరు..? ఆయన చేసిన వ్యాఖ్యలకు పిల్లలందరూ నవ్వుకున్నారు"


- అరవింద్ కేజ్రీవాల్