Banks, Stock Market Holiday: స్టాక్ మార్కెట్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం, ఇవాళ (శుక్రవారం, 07 ఏప్రిల్ 2023) గుడ్ ఫ్రైడే (Good Friday) సందర్భంగా ట్రేడింగ్‌కు సెలవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE) ట్రేడింగ్ జరగదు. చాలా నగరాల్లో బ్యాంకులు కూడా మూసివేసి ఉంటాయి.
BSE వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈక్విటీ విభాగంలో ఈ రోజు ఎలాంటి యాక్షన్స్ కనిపించవు. దీంతో పాటు, డెరివేటివ్స్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్ సహా అన్ని విభాగాలు ఇవాళ పని చేయవు. నిన్న మార్కెట్ ముగిసిన తర్వాత ఎవరైనా ఈక్విటీని విక్రయించినా లేదా కొనుగోలు చేసినా, పోర్ట్‌ఫోలియోలో రేపు యాడ్ అవుతుంది.
MCXలోనూ లావాదేవీలు జరగవు
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా శుక్రవారం రోజు మొత్తం పని చేయదు. గత సెలవుల్లో ఉదయం సెషన్ మూసేసి, సాయంత్ర సెషన్ ఓపెన్ చేసేవాళ్లు. ఇవాళ సాయంత్రం సెషన్‌లోనూ ట్రేడింగ్ జరగదు. మల్టీ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో (Gold Price, Silver Price) ఎలాంటి మార్పు ఉండదు.
స్టాక్ మార్కెట్‌కి ఏప్రిల్‌లో మూడు సెలవులు
ఈ నెలలో స్టాక్ మార్కెట్లకు మొత్తం మూడు రోజులు ప్రత్యేక సెలవులు (శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులు కాకుండా) వచ్చాయి. ఏప్రిల్ 4 న మహావీరుడి జయంతి కారణంగా స్టాక్ మార్కెట్లు మూతబడ్డాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇవాళ రెండో ప్రత్యేక సెలవు దినం. ఏప్రిల్ 14న (శుక్రవారం) బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆ రోజున కూడా స్టాక్ మార్కెట్లు పని చేయవు. 2023 మొత్తం క్యాలెండర్ సంవత్సరంలో, మార్కెట్‌లకు 15 ప్రత్యేక సెలవులు ఉన్నాయి, గత సంవత్సరం కంటే రెండు సెలవులు ఎక్కువగా వచ్చాయి.
గురువారం (06 ఏప్రిల్ 2023) నాడు సెన్సెక్స్ & నిఫ్టీ రెండూ గ్రీన్‌లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రేట్ల పెంపును నిలిపివేస్తూ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకోవడంతో ఈక్విటీ మార్కెట్లు ఉత్సాహంగా ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఆరు వరుస రేట్ల పెంపుల తర్వాత, ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) జరిగిన తొలి సమావేశంలో RBI రేట్ సెట్టింగ్ ప్యానెల్ వడ్డీ రేట్ల 'పాజ్ బటన్'ను నొక్కింది. చాలా మంది విశ్లేషకులు మరో 25 బేసిస్ పాయింట్ల పెంపును ఆశించారు. అయితే, వడ్డీ రేట్ల పెంపునకు ఆర్‌బీఐ విరామం ప్రకటించడంతో మార్కెట్‌లో ఉత్సాహం కనిపించింది.
FMCG, IT, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా, అన్ని రంగాలు గురువారం నాడు గ్రీన్ జోన్‌లో ముగిశాయి. మార్కెట్లలో భయాన్ని సూచించే అస్థిరత సూచీ 11.8కి పడిపోయి ట్రేడర్లకు కొంత ఊరటనిచ్చింది.
ఇవాళ బ్యాంకులకు కూడా సెలవు
తెలుగు రాష్ట్రాలు సహా ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, ఉత్తరప్రదేశ్, ముంబై, నాగ్‌పుర్, న్యూదిల్లీ, పనాజీ, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే సందర్బంగా బ్యాంకులకు సెలవు.