Vishal Rathnam Movie Review in Telugu: విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రత్నం'. దీనికి హరి దర్శకత్వం వహించారు. 'భరణి', 'పూజ' చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన మూడో చిత్రమిది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.


కథ (Rathnam Movie Story): చిత్తూరులో రత్నం (విశాల్)కి ఎదురులేదు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక్క నిమిషం ఆలస్యం చేయడు. రంగంలోకి దిగుతాడు. హత్య చేయడానికి వెనుకాడడు. ఎమ్మెల్యే పన్నీర్ స్వామి (సముద్రఖని) అండ ఉండటంతో పోలీసులు రత్నాన్ని ఏమీ చేయరు. ఓ రోజు మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను చూస్తాడు రత్నం. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందని చెబుతాడు. ఆమెపై హత్యాయత్నం జరిగితే ప్రాణాలకు తెగించి కాపాడతాడు. ఆ తర్వాత ఆమెకు తమిళనాడులోని లింగం (మురళీ శర్మ) బ్రదర్స్ నుంచి ముప్పు ఉందని తెలుసుకుంటాడు. 


లింగం బ్రదర్స్ ఎవరు?  వాళ్లకు, మల్లికకు గొడవ ఏమిటి? రత్నం తల్లి రంగనాయకి ఎవరు? ఆమె ఎలా మరణించింది? లింగం బ్రదర్స్ మీద రత్నం పగకు, వాళ్లను చంపడానికి రంగనాయకి ఎలా కారణం అయ్యింది? చివరకు ఏమైంది? అనేది సినిమా. 


విశ్లేషణ (Vishal Rathnam Review): తమిళనాట రూరల్ బ్యాక్ డ్రాప్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హరి. కథతో సంబంధం లేకుండా పరుగులు పెట్టించే కథనంతో సినిమాలు తీయడం ఆయన స్టైల్. యాక్షన్ ఎపిసోడ్స్, ముఖ్యంగా ఛేజింగ్ సీక్వెన్సులు తీయడంలో హరికి సపరేట్ స్టైల్ ఉంది. తెలుగు ప్రేక్షకులు సింగమ్ సిరీస్ ఆదరించడానికి కారణం కూడా ఆ స్పీడ్. అయితే... కొన్నాళ్లుగా హరి తీసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. మరి, రత్నం ఎలా ఉంది? అనే విషయానికి వస్తే...


దర్శకుడు హరి మార్క్ టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న మాస్ యాక్షన్ సినిమా 'రత్నం'. అయితే, అసలు సమస్య అంతా కథతోనే! సినిమా ప్రారంభం రొటీన్‌గా ఉంటుంది. ఎమ్మెల్యేను మావయ్య అని పిలిచే హీరో, అతడు ఏం చేసినా చేతులు కట్టుకుని చూసే పోలీసులు, హీరోయిన్ ఎంట్రీ, ఆమె కోసం ఫైట్... కొంచెం కూడా కొత్తదనం లేని కథ, కథనాలతో సినిమా ముందుకు వెళుతూ ఉంటుంది. మధ్య మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొంత ఉపశమనం కలిగిస్తుంది. డిఎస్పీ ట్యూన్స్ బావున్నాయి. తెలుగు సాహిత్యం కాస్త బావుంటే పాటలు ప్రేక్షకుల్లోకి వెళ్లేవి.


హరి మీద ప్రేమతో ఆయన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు కూడా హీరోయిన్ ట్విస్ట్ షాక్ ఇస్తుంది. మల్లిక (ప్రియా భవానీ శంకర్)లో తన తల్లిని చూసుకున్నానని, ఆమె రూపు రేఖలతో ఉండటం వల్ల సాయం చేశానని రత్నం చెబుతాడు. హీరోయిన్ ప్రేమను హీరో సున్నితంగా తిరస్కరిస్తాడు. అక్కడి నుంచి ఊహలకు అందని విధంగా హరి సినిమాను తీశారు. పోనీ, హీరో తల్లికి హీరోయిన్ మేనకోడలు అవుతుందని అనుకుంటే ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. బహుశా... ఈ ట్విస్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందని, థియేటర్లలో వాళ్లకు షాకింగ్ సర్‌ప్రైజ్ అవుతుందని భావించారు ఏమో! బ్యాక్ ఫైర్ అయ్యింది. హీరో హీరోయిన్ రిలేషన్షిప్, ఆ సీన్స్ కన్వీనింగ్‌గా తీయలేదు. దాంతో సెకాండాఫ్ భరించడం కష్టంగా మారింది. దానికి తోడు హరి మేకింగ్ అప్పటికే బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్‌ కోసం ఎదురు చూసేలా సినిమా తీశారు. ఎండ్‌ అయిపోయిందనుకున్న ప్రతిసారి కథలో కొత్త రిలేషన్‌ ఓపెన్‌ చేసి సాగదీశారు.


Also Read: మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?



కెమెరా వర్క్, ఎడిటింగ్, యాక్షన్ ఎపిసోడ్స్... అన్నిటిలో హరి రెగ్యులర్ సినిమాల స్టైల్ కనిపించింది. డీఎస్పీ సంగీతంలో 'ప్రాణం...', 'చెబుతావా...' ట్యూన్స్ బావున్నాయి. నేపథ్య సంగీతంలో హరి స్టైల్ తప్ప డీఎస్పీ మార్క్ కనిపించలేదు. 


రత్నం పాత్రలో విశాల్ కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇంతకు ముందు సినిమాల్లో ఎలా ఉన్నారో... ఈ సినిమాలోనూ సేమ్ స్టైల్, యాక్టింగ్. ఆయన కొత్తగా చేసింది లేదు. ఆయనతో హరి కూడా కొత్తగా చేయించలేదు. ప్రియా భవానీ శంకర్ కొన్ని సన్నివేశాల్లో బాగా చేశారు. ఎమోషన్స్ చక్కగా చూపించారు. సముద్రఖని, మురళీ శర్మ నుంచి హరీష్ పేరడీ, జయప్రకాశ్ వరకు టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా సరే వాళ్లతో లౌడ్ యాక్టింగ్ చేయించారు హరి. యోగిబాబు, మొట్ట రాజేంద్రన్ కామెడీకి కితకితలు పెట్టుకున్నా నవ్వు రాదు. 


'రత్నం' సినిమాలో సూపర్ హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. పది పదిహేనేళ్ల క్రితం వస్తే గ్యారంటీ హిట్. ఇప్పుడు అయితే... ఈ జనరేషన్ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం కష్టమే. 'రత్నం'లో ప్రధాన సమస్య... కాలంతో పాటు వస్తున్న మార్పులకు అనుగుణంగా హరి అప్డేట్ కాకపోవడమే. ఆయన స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ వాటి కోసం వెళితే వెళ్లవచ్చు. సగటు ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేయడం చాలా అంటే చాలా కష్టం.


Also Read: డియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?