Abhinav Gomatam, Shalini Kondepudi and Divya Sripada's My Dear Donga movie review in Telugu: కథ ఎలాగున్నా, క్యారెక్టర్ ఏదైనా తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు అభినవ్ గోమఠం. ఓటీటీలోనూ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 'సేవ్ ద టైగర్స్'తో హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'మై డియర్ దొంగ'. శాలినీ కొండెపూడి హీరోయిన్. అన్నట్టు... ఆవిడే రైటర్ కూడా! ఆహా ఓటీటీ ఒరిజినల్ చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.


కథ (My Dear Donga Movie Story): రెండేళ్ల నుంచి విశాల్ (నిఖిల్ గాజుల)తో రిలేషన్షిప్‌లో ఉంది సుజాత (శాలినీ కొండెపూడి). అతను ఓ డాక్టర్. ఐసీయూలో ఉన్నానని చెప్పి స్నేహితుడితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాడు. అదొక్కటే కాదు... ఏదో ఒకటి చెప్పి తరచూ ఆమెను ఇగ్నోర్ చేస్తుంటాడు. అది అర్థమైన బాధలో ఇంటికి వస్తుంది సుజాత. అప్పటికే ఇంట్లో దొంగ పడ్డాడు. అతడి పేరు సురేష్ (అభినవ్ గోమఠం). అతడిని చూసి ముందు షాక్ అయినా... ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ సిమిలర్‌గా ఉండటంతో మెల్లగా మాటల్లో పడుతుంది. అంతలో టైమ్ రాత్రి 12 కావొస్తుంది. సుజాత బర్త్ డే కావడంతో విశాల్, ఆమె బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి (దివ్య శ్రీపాద), ఆమె బాయ్ ఫ్రెండ్ వరుణ్ (శశాంక్ మండూరి) ఇంటికి వస్తారు. దాంతో సురేష్ వెళ్ళిపోతానంటే ఉండమని చెబుతుంది.


బర్త్ డే పార్టీలో ఏం జరిగింది? ఇంటికి వచ్చిన దొంగ సురేష్ మీద సుజాతలో ఫీలింగ్స్ ఎందుకు కలిగాయి? ఆమె సంతోషాలకు అతడు ఎలా కారణం అయ్యాడు? సురేష్ దొంగ అని సుజాత బాయ్ ఫ్రెండ్, స్నేహితులకు ఎలా తెలిసింది? తెలిశాక ఎవరెలా రియాక్ట్ అయ్యారు? చివరకు ఏమైంది? అనేది ఆహా ఓటీటీలో సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (My Dear Donga Review): జీవితంలో చిన్న చిన్న పనులు ఒక్కోసారి పెద్ద పెద్ద సంతోషాలు ఇస్తాయి. చెబితే చిన్నవిగా అనిపిస్తాయి కానీ బర్త్ డేకి సర్‌ప్రైజ్ పార్టీ పాపర్స్, మ్యాజిక్ క్యాండిల్స్ ఎరేంజ్ చేయడం... తిన్న ప్లేట్ కడగటం... టైమ్ స్పెండ్ చేయడం... ప్రేమించిన అమ్మాయితో డ్యాన్స్, యోగ క్లాసులు అటెండ్ కావడం వంటివి సంతోషాన్ని ఇస్తాయి. అటువంటి సెన్సిబుల్ విషయాలతో రూపొందిన చిత్రమిది. ఈతరం యువతకు సందేశం ఇచ్చీ ఇవ్వనట్లు వినోదం అందించే సినిమా 'మై డియర్ దొంగ'.


హీరోయిన్ శాలినీ కొండెపూడి సింపుల్ స్టోరీ రాశారు. అందులో సిట్యువేషనల్ ఫన్ బాగా రాశారు. ముఖ్యంగా హీరోయిన్ (తన) క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానం బావుంది. సినిమాకు అది బలంగా నిలిచింది. 'తిన్నారా?' అని అడిగినందుకు ఇంటికొచ్చిన దొంగకు షేక్ హ్యాండ్ ఇస్తుంది సుజాత. ఆమెలో అమాయకత్వం చూసి నవ్వొస్తుంది. ఆ పాత్రలో శాలినీ కొండెపూడి నటన సైతం నవ్విస్తుంది.


ఈతరం అబ్బాయి, అమ్మాయిలు ఎలా ఉన్నారు? న్యూ ఏజ్ రిలేషన్షిప్‌లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? వంటివి శాలిని కొండెపూడి చక్కగా చూపించారు. అందులో కొత్త ఏముందని కొందరికి అనిపించవచ్చు కానీ కనెక్ట్ అయ్యే కామన్ సిట్యువేషన్స్ అవి. అయితే, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ రొటీన్‌గా రాశారు. ఎమోషనల్ సీన్స్ రాసే స్కోప్ వచ్చినప్పుడు బలంగా రాస్తే బావుండేది. బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్, హీరో హెల్మెట్ పెట్టుకునే సీన్లలో కామెడీ వర్కవుట్ కాలేదు. శాలిని కథను దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ చక్కగా తెరకెక్కించారు. కెమెరా వర్క్ బావుంది. పాటల్లో గుర్తుంచుకునేవి లేవు. ఫ్లోలో అలా వెళ్లిపోయాయి. ఇటువంటి సినిమాలకు ఛార్ట్ బస్టర్ సాంగ్స్ చాలా అవసరం. నిర్మాణ పరంగా బడ్జెట్ పరిమితులు కనిపించాయి. కొన్ని సీన్స్ పైపైన తీసుకువెళ్లారు.


Also Read: పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?



అభినవ్ గోమఠం ఎప్పటిలా తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో నవ్వించారు. ఆయన కనిపించిన మ్యాగ్జిమమ్ సన్నివేశాల్లో నవ్వించారు. ముందుగా చెప్పినట్లు శాలినీ కొండెపూడి నటన నవ్విస్తుంది. దివ్య శ్రీపాదకు తన యాక్టింగ్ టాలెంట్ చూపించే అవకాశం తక్కువ లభించింది. ఆ పాత్రకు అనుగుణంగా నటించారు. అభినవ్ గోమఠంతో శాలిని మాట్లాడుతుంటే... తట్టుకోలేని బాయ్ ఫ్రెండ్‌గా నిఖిల్ గాజుల నటన ఓకే.


మై డియర్ దొంగ... ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. రిలేషన్షిప్స్ మీద సింపుల్ కథతో తీసిన చిత్రమిది. ఈ జనరేషన్ యూత్ కనెక్ట్ అయ్యే, నవ్వుకునే మూమెంట్స్ ఉన్నాయి. అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి డిజప్పాయింట్ మిమ్మల్ని చెయ్యరు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. వీకెండ్ టైమ్ పాస్ (My Dear Donga Review Telugu)కు మంచి ఆప్షన్.


Also Readడియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?