Crime Comedy Movie Parijatha Parvam Review In Telugu: చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, హర్ష చెముడు (వైవా హర్ష) ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పారిజాత పర్వం'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. మరి, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


కథ (Parijatha Parvam Movie Story): ఇంద్ర విడుదలైన రోజుల్లో... హీరో కావాలని భీమవరం నుంచి హైదరాబాద్ వస్తాడు శ్రీను (సునీల్). స్టూడియో గేట్స్ చుట్టూ ఎంత తిరిగినా అవకాశాలు రావు. కృష్ణా నగర్ ఓంకార్ బారుకు అసిస్టెంట్ డైరెక్టర్లు వస్తారని, అక్కడికి వెళ్లి ట్రై చేయమని సెక్యూరిటీ చెప్పడంతో బారులో వెయిటర్‌గా జాయిన్ అవుతాడు. కొరియోగ్రాఫర్ కావాలని వచ్చి అదే బారులో డ్యాన్సర్‌గా చేస్తోంది పారు (శ్రద్ధా దాస్). పారును ఓ సమస్య నుంచి కాపాడబోయి బార్ ఓనర్, సెటిల్మెంట్స్, దందాలు చేసే రౌడీని చంపేస్తాడు శ్రీను. తర్వాత బార్ శ్రీనుగా మారి దందాలు చేయడం మొదలు పెడతాడు.


బార్ శ్రీను కథ రాసుకుని దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువకుడు చైతు (చైతన్య రావు). నిర్మాతలకు కథ నచ్చుతుంది. అయితే, తన స్నేహితుడు (హర్ష చెముడు) హీరో అని చెప్పడంతో వెనకడుగు వేస్తారు. నిర్మాత శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) అయితే అవమానిస్తాడు. అవకాశాల కోసం తిరిగి తిరిగి విసుగు వచ్చిన చైతు, శెట్టి భార్యను కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో సినిమా తీయాలని డిసైడ్ అవుతారు. వాళ్లు కిడ్నాప్ చేయడానికి వచ్చినప్పుడే శ్రీను మనుషులు పారు & కో సైతం కిడ్నాప్ చేయాలని వస్తారు. ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు? ఎవరు ఎవరి దగ్గర ఎంత అమౌంట్ డిమాండ్ చేశారు? బార్ శ్రీను, చైతు ఎలా కలిశారు? చైతు గాళ్ ఫ్రెండ్ (మాళవికా సతీశన్) పాత్ర ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Parijatha Parvam Review): మెజారిటీ క్రైమ్ కామెడీ సినిమాల్లో ఓ డాన్, ఇన్నోసెంట్ మ్యాన్, డబ్బు కోసం తప్పక చేసే క్రైమ్... కామన్ ఫ్యాక్టర్స్. అయితే ఈ జానర్ సినిమాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... సిట్యువేషనల్ ఫన్, అందుకు మంచి స్టోరీ సెటప్ సెట్ అయితే చాలు! సినిమా బ్యాక్‌డ్రాప్ తీసుకోవడంతో క్రైమ్ కామెడీకి మాంచి బేస్ సెట్ అయ్యింది. మధ్య మధ్యలో హర్ష చెముడు నవ్వులతో ఫస్టాఫ్ నడిచింది. అసలు కథ (సమస్య) ఇంటర్వెల్ తర్వాత మొదలైంది.


ప్రేక్షకులకు సినిమా ఓ ఆటవిడుపు. అయితే, ఆ సినిమాలు తీసే వాళ్లకు జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు మాత్రం ఎప్పుడూ నవ్విస్తాయి. అందులోనూ వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు (ఎక్స్‌ప్రెషన్స్) నవ్విస్తాయి. హర్ష తనదైన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా బాగా చేశారు. దాంతో నవ్వులు పండాయి. అయితే, కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. దాంతో పాటు కథలో క్యూరియాసిటీ కూడా తగ్గింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా కనిపించిన 'పారిజాత పర్వం', ఒక్కసారిగా రొటీన్ రూటులోకి వచ్చింది.


బార్ శీను కథ రాసుకుని సినిమా తీద్దామని ప్రయత్నాలు చేస్తున్న చైతూకి, ఆ బార్ శీను ప్రేమించిన (అనుకోవచ్చు!) పారు ఎలా ఉంటుందో తెలియకపోవడం కథలో పెద్ద కామెడీ (ట్విస్ట్). అది సినిమాను రెండు మూడు మెట్లు కిందకు దించింది. ఆ డౌట్ వచ్చిన ప్రేక్షకుడికి ఇంటర్వెల్ తర్వాత సినిమా బోరింగ్. దర్శకుడు సంతోష్ కంభంపాటి ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో? అది పక్కన పెడితే ఆయనలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. సునీల్, హర్షకు కొన్ని సీన్లు బాగా రాశారు. హర్ష - శ్రద్ధా దాస్‌ సీన్స్‌ కూడా! కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రి' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది.


Also Read: డియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?



'పారిజాత పర్వం'లో హర్ష చెముడు కామెడీ మెయిన్ హైలైట్. సునీల్ నుంచి ఫ్యాన్స్ ఆశించే వింటేజ్ కామెడీనీ కొంత చూడొచ్చు. ఇద్దరూ తమ పాత్రల్లో ఇరగదీశారు. చైతన్య రావు హ్యాండ్సమ్ లుక్స్, చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. కథలో వెయిటేజ్ ఉన్న రోల్ చేశారు శ్రద్ధా దాస్. బార్ డ్యాన్సర్ సన్నివేశాల్లో, ఆ తర్వాత డాన్ పక్కన లేడీ అయ్యాక... లుక్స్ పరంగా వేరియేషన్ చూపించారు. పెర్ఫార్మన్స్ డీసెంట్‌గా ఉంది. చైతన్య రావు ప్రేమించే అమ్మాయిగా మాళవికా సతీశన్ కనిపించారు. ఆవిడకు, హర్షకు మధ్య మంచి సన్నివేశాలు పడ్డాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ పాత్రల పరిధి మేరకు నటించారు. సురేఖా వాణి చాలా రోజుల తర్వాత కీలకమైన పాత్రలో కనిపించారు.


పారిజాత పర్వం... బావుంటుందని అనిపించేలా మొదలై, ఇంటర్వెల్ వచ్చేసరికి బాగానే ఉందనిపించి, చివరకు రొటీన్ పంథాలో ముగిసిన సినిమా. దర్శకుడు సంతోష్ రచనలో కొన్ని నవ్వులు ఉన్నాయి. హర్ష, సునీల్, చైతన్య రావు కామెడీ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తుంది. అయితే, రెండు గంటలు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో సక్సెస్ కాలేదు.


Also Readశ్రీరంగనీతులు రివ్యూ: నీతులు చెప్పేటందుకు మాత్రమే బావున్నాయా? లేదంటే సినిమా చూసేందుకూ బావుందా?