సినిమా రివ్యూ : టాప్ గేర్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఆది సాయికుమార్, రియా సుమన్, మైమ్ గోపి, శత్రు, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు
కథ, మాటలు, దర్శకత్వం : ఎన్.శశికాంత్
కూర్పు : ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్
నిర్మాత : కె.శ్రీధర్ రెడ్డి
విడుదల తేదీ: డిసెంబర్ 30, 2022


జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో ఆది సాయికుమార్. 2022 మొదటి వారంలో ‘అతిథి దేవోభవ’ సినిమాతో తెలుగు సినిమా సంవత్సరాన్ని ప్రారంభించిన ఆది సాయికుమార్... చివరి వారంలో ‘టాప్ గేర్’ అనే థ్రిల్లర్ సినిమాతో సంవత్సరాన్ని ముగించడానికి కూడా వచ్చాడు. ఇదొక థ్రిల్లర్ సినిమా అని టీజర్, ట్రైలర్లు చూస్తేనే అర్థం అవుతుంది. మరి 2022కి ఆది హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడా? టాప్ గేర్‌తో హిట్ కొట్టాడా?


కథ: అర్జున్ (ఆది సాయికుమార్) ఒక క్యాబ్ డ్రైవర్. భార్య ఆద్య (రియా సుమన్)తో సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటాడు. మరోవైపు సిద్ధార్థ్ (మైమ్ గోపి) అనే క్రిమినల్ కోసం హైదరాబాద్ పోలీసులు వెతుకుతూ ఉంటారు. దీంతో రూ.వందల కోట్ల విలువైన డ్రగ్స్‌తో దేశం వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు సిద్ధార్థ్. అనుకోకుండా అర్జున్ క్యాబ్ నుంచి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ మిస్ అవుతుంది. బ్యాగ్ ఇవ్వకపోతే ఆద్యను చంపేస్తానని అర్జున్‌ను గోపి బెదిరిస్తాడు. మరి చివరికి ఏం అయింది? అర్జున్ తన భార్యను కాపాడుకున్నాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: ఒక సామాన్యుడు తన కుటుంబం కోసమో, ప్రేమించిన వాళ్ల కోసమో అసామాన్యుడిగా మారడం అనేది కొత్త పాయింటేమీ కాదు. ఈ లైన్ మీద కొన్ని వందల సినిమాలు ఇప్పటికే వచ్చి ఉంటాయి. కానీ ఎలా డీల్ చేశామనే దాని మీదనే సినిమా సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు శశికాంత్ సగం వరకే సక్సెస్ అయ్యారు. సినిమా ప్రారంభం చాలా రొటీన్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, పాట, విలన్ సిద్ధార్థ్‌ను పట్టుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాల నేపథ్యంలో సినిమా మొదలవుతుంది.


డ్రగ్స్ ఉన్న బ్యాగ్ అర్జున్ క్యాబ్‌లోకి వచ్చినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుంచి స్క్రీన్‌ప్లే వేగంగా సాగుతుంది. సెకండాఫ్‌లో హైవే మీద జరిగే ఛేజ్ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని ట్విస్టులను ముందే ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. సినిమా నిడివి కేవలం రెండు గంటలు మాత్రమే కావడం పెద్ద ప్లస్ పాయింట్. హీరో కంటే విలన్‌ను పవర్‌ఫుల్‌గా చూపించడం సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది.


థ్రిల్లర్ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. హర్షవర్థన్ రామేశ్వర్ తన మ్యూజిక్‌తో సినిమాను నిలబెట్టాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను రిచ్‌గా చూపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఇక నటీనటుల విషయానికి వస్తే... ఆది సాయికుమార్‌కు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ఎప్పటిలాగానే అర్జున్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక రియా సుమన్ పాత్ర ఒక పాటకే పరిమితం. ఆ తర్వాత తన స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుంది. ఉన్నంతలో సినిమాకు గ్లామర్‌ను అందించింది. విలన్ సిద్ధార్థ్ పాత్రలో కనిపించిన మైమ్ గోపి కూడా గతంలో ఇలాంటి పాత్రలు చేశాడు. కాబట్టి నటీనటుల విషయంలో వైవిధ్యం పెద్దగా కనిపించదు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ సంవత్సరం ఆది సాయికుమార్ నటించిన సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. థ్రిల్లర్ లవర్స్‌కు నచ్చే అవకాశం ఉంటుంది.


Also Read : ధమాకా రివ్యూ: 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?


Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?