సినిమా రివ్యూ : ధమాకా
రేటింగ్ : 2.5/5
నటీనటులు : రవితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, హైపర్ ఆది తదితరులు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే : ప్రసన్న కుమార్ బెజవాడ
కూర్పు : ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
సంగీతం : భీమ్స్ సెసిరోలియో
నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
విడుదల తేదీ: డిసెంబర్ 23, 2022


రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ధమాకా’. 2021 సంక్రాంతికి ‘క్రాక్’తో హిట్ కొట్టాక రవితేజకు టైమ్ కలిసిరాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఖిలాడీ’, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు త్రినాథరావు నక్కినతో రవితేజ జోడి కట్టారు. ‘ధమాకా’ టీజర్, ట్రైలర్లు, సాంగ్స్ చూస్తే ఒకప్పటి వింటేజ్ రవితేజ కనిపించాడు. దీంతో ఆడియన్స్‌కు సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. మరి ధమాకా ఆ అంచనాలను అందుకుందా?


కథ: స్వామి (రవితేజ) మిడిల్ క్లాస్‌కు చెందిన వ్యక్తి. ఉద్యోగం పోవడంతో నెల రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే చెల్లి (మౌనిక) పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చెల్లెలి ఫ్రెండ్ పావనిని (శ్రీలీల) చూడగానే ఇష్టపడతాడు. ఇక మరోవైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) ఏకైక కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ). పావనిని ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయాలనేది తన తండ్రి (రావు రమేష్) ఆశ. ఇద్దరినీ చూసి కన్‌ఫ్యూజ్ అయిన పావని ఒకరిని ఎంచుకోవడానికి ఇద్దరితో కొన్నాళ్లు ట్రావెల్ చేయాలనుకుంటుంది. మరోవైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ చేజిక్కించుకోవాలని జేపీ (జయరాం) ప్రయత్నిస్తుంటాడు. పావని ఎవరిని ఇష్టపడింది? జేపీ ప్రయత్నాలను ఆనంద్ చక్రవర్తి అడ్డుకున్నాడా లేడా అన్నది తెలియాలంటే ధమాకా చూడాల్సిందే.


విశ్లేషణ: రవితేజ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్. వీటిని మ్యాచ్ చేసే కథను రవితేజ చేసి చాలా కాలం అయింది. గతేడాది వచ్చి బ్లాక్‌బస్టర్ కొట్టిన క్రాక్‌లో కూడా రవితేజ సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించాడు. ఈ సినిమాలో మళ్లీ ఆ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌ను త్రినాథరావు నక్కిన తీసుకువచ్చాడు. రవితేజ ఇంట్రడక్షన్ సీన్ చూడగానే సినిమా ఏ మీటర్‌లో వెళ్తుందో అర్థం అయిపోతుంది. సినిమా మొత్తం రవితేజ వన్ మ్యాన్ షోగా సాగుతుంది. మిగతా పాత్రలన్నీ రవితేజ యాక్షన్‌కు రియాక్షన్ ఇవ్వడానికే పరిమితం అయ్యాయి. రావు రమేష్, హైపర్ ఆదిల మధ్య ప్రత్యేకంగా రాసుకున్న ట్రాక్ నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ షాకిస్తుంది. అయితే ఇంటర్వల్ తర్వాత వచ్చే సన్నివేశంతో సినిమా ఎలా ముగుస్తుందో తెలిసిపోతుంది.


కొత్త తరహా సినిమాను కోరుకుని ధమాకాకు వస్తే మాత్రం కచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు. మెయిన్ కథ నుంచి చాలా సార్లు సినిమా పక్కదోవ పడుతుంది. చాలా సినిమాల స్పూఫ్‌లు కూడా ఇందులో కనిపిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు ఇంద్ర స్పూఫ్ కాగా, ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఒక సీన్ అల వైకుంఠపురంలో సినిమాలో ఉన్న ఒక సూపర్ హిట్ సీన్‌ను తలపిస్తుంది. కానీ ఇవి రెండూ స్క్రీన్ మీద వర్కవుట్ అవుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత చాలా ప్రిడిక్టబుల్‌గా సాగే సెకండాఫ్ సినిమాకు పెద్ద మైనస్.


భీమ్స్ సెసిరోలియో అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ‘జింతాక్’ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంది.  ఇక నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన డైలాగ్స్ అక్కడక్కడ నవ్విస్తాయి.


ఇక నటీనటుల విషయానికి వస్తే... రవితేజకు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. కెరీర్ మొదటి నుంచి ఇలాంటి ఎనర్జిటిక్ పాత్రలు ఎన్నో చేశాడు. ఇందులో కూడా తన ఎనర్జీతో ఆకట్టుకుంటాడు. శ్రీలీల ఈ సినిమాలో తన ఎనర్జీతో సర్‌ప్రైజ్ చేస్తుంది. ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్‌ల్లో రవితేజతో పోటీ పడింది. వీరి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర పడింది రావు రమేష్, హైపర్ ఆదిలకే. వీరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాల్లో పంచ్‌లు కొన్ని బాగా పేలతాయి. సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, జయరాం వీరందరికీ రెగ్యులర్ పాత్రలే పడ్డాయి.


ఓవరాల్‌గా చెప్పాలంటే... లాజిక్స్, కథ పక్కన పెట్టి ఒక మాస్ సినిమా ఎంజాయ్ చేయాలనుకునేవారికి ధమాకా పర్‌ఫెక్ట్ చాయిస్. రవితేజ అభిమానులను అయితే విపరీతంగా ఆకట్టుకుంటుంది.


Also Read : 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్' రివ్యూ - నెట్‌ఫ్లిక్స్‌లో బెంగళూరు కామపిశాచి ఉమేష్ రెడ్డి డాక్యుమెంటరీ


Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?