డాక్యుమెంటరీ రివ్యూ : బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్
రేటింగ్ : 2.25/5
నటీనటులు : రాజ్ కుమార్ సింగ్, ఆల్విన్ పాల్ సబ్బాతి, షమా తాజ్ ఏఆర్, సౌమ్యా సింగ్, శ్రేయా ముత్తుకుమార్ తదితరులతో పాటు కేసు విచారించిన అధికారులు, న్యూస్ కవర్ చేసిన జర్నలిస్టులు
ప్రొడక్షన్ డిజైనర్ : వివేక్ రాచెల్ బంజా
ఛాయాగ్రహణం : రేమి దలై
సంగీతం : salvage audio collective
నిర్మాత : సృష్టి జైన్
రచన, దర్శకత్వం : అశ్విన్ రాయ్ శెట్టి
విడుదల తేదీ: డిసెంబర్ 16, 2022
ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఎన్ని ఎపిసోడ్స్ : మూడు (ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలు)
భారతదేశంలో జరిగిన నేరాలు, వాస్తవ ఘటనల ఆధారంగా 'ఇండియన్ ప్రెడేటర్' డాక్యుమెంటరీ సిరీస్ రూపొందుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రతి సీజన్‌లో ఒక్కో ఇండియన్ సీరియల్ కిల్లర్ గురించి చూపిస్తున్నారు. కేసు విచారించిన పోలీస్ ఆఫీసర్లు, న్యూస్ కవర్ చేసిన జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులను ఇంటర్వ్యూ చేయడం ఈ సిరీస్ స్పెషాలిటీ. ఈ వారం వీక్షకుల ముందుకు బెంగళూరులో టెర్రర్ క్రియేట్ చేసిన రేపిస్ట్ ఉమేష్ రెడ్డి (Umesh Reddy) కథను 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్' పేరుతో మూడు ఎపిసోడ్స్ మినీ సిరీస్‌గా విడుదల చేశారు. 'ఇండియన్ ప్రిడేటర్' సీజన్‌లో ఇది నాలుగోది.
కథ (Watch Beast of Bangalore: Indian Predator Story) : ఆరేళ్ళ వ్యవధిలో... 1996 నుంచి 2002 మధ్య కాలంలో కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరియా, బెంగళూరు నగరంలో ఉమేష్ రెడ్డి పలు అత్యాచారాలు చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత కొంత మంది మహిళలను చంపేశాడు. సీఆర్‌పీఎఫ్, డీఆర్‌డీ టైనీగా కొన్ని నేరాలు చేశాడు. అతడిని పోలీసులు ఎలా పట్టుకున్నాడు? వాళ్ళ కళ్ళు గప్పి ఉమేష్ రెడ్డి ఎలా తప్పించుకునేవాడు? చివరకు ఎక్కడ, ఎలా దొరికాడు? ఎవరు పట్టుకున్నారు? సుప్రీమ్ కోర్టు అతడికి విధించిన ఉరి శిక్షను జీవిత ఖైదుగా ఎందుకు మార్చింది? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మినీ డాక్యుమెంటరీ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ : కర్ణాటక రాష్ట్రంతో పాటు భారత దేశమంతా ఉమేష్ రెడ్డి కేసు సంచలనం సృష్టించింది. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ... అత్యాచారాలు చేసిన వార్తలు ప్రజలను భయానికి గురి చేశాయి. కొన్నాళ్ళు బెంగళూరులో మహిళలు బయటకు రావడానికి భయపడ్డారు. న్యూస్ ఛానళ్ళు పురుడు పోసుకున్న సమయంలో ఉమేష్ రెడ్డి కేసు హాట్ టాపిక్. అందువల్ల, వికీపీడియాలో అతడి గురించిన సమాచారం చాలా ఉంది. అందువల్ల, 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు' మినీ డాక్యుమెంటరీ సిరీస్‌పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఏముందీ సిరీస్‌లో అని చూస్తే...
వికీపీడియాలో ఉన్న సమాచారం కంటే కొంచెం అటు ఇటుగా 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్' సిరీస్ తీశారు. అప్పట్లో కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు, న్యూస్ కవర్ చేసిన జర్నలిస్టుల ఇంటర్వ్యూలు ఎక్కువ. ఒకరి తర్వాత మరొకరు స్క్రీన్ మీద మనకు కనపడతారు. క్రైమ్ డాక్యుమెంటేషన్ కంటే వాళ్ళు చెప్పేది ఎక్కువ ఉంటుంది. చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పిన ఫీలింగ్ ఉంటుంది. దాంతో కొన్నిచోట్ల బోర్ కొడుతుంది.
ఉమేష్ రెడ్డి చేసిన నేరాలు, అత్యాచారాలపై వెన్నులో వణుకు పుట్టేలా 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్'ను స్టార్ట్ చేశారు. మొదట్లో వచ్చే విజువల్స్ షాక్ ఇస్తాయి. నిజంగా ఇటువంటి నేరాలు ఎలా చేశాడు? అని ఆలోచించేలా సీన్స్ ఉన్నాయి. కాసేపటి తర్వాత ఆ క్యూరియాసిటీ కిల్ అవుతుంది. అసలు, ఉమేష్ రెడ్డి ఆ నేరాలు ఎందుకు చేశాడు? అతడు ఆ విధంగా మారడానికి గల కారణాలు ఏమిటి? అనేది చూపించే ప్రయత్నం చేయలేదు.
తండ్రి తాగుబోతు అని, రోజూ తల్లిని కొట్టేవాడని ఉమేష్ రెడ్డి గతం గురించి ఒక్క ముక్కలో క్లుప్తంగా ముగించారు. దాంతో అత్యాచారాలు, హత్యలు, నేరాలకు పాల్పడటానికి అతడిని ప్రేరేపించిన విషయాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేదు. దాంతో డాక్యుమెంటరీ చప్పగా టీవీ ఇంటర్వ్యూలు తరహాలో సాగింది. కాకపోతే పోలీసు వ్యవస్థ అప్పట్లో ఎలా ఉంది? టెక్నాలజీ అందుబాటులోకి రాకముందు పక్క జిల్లా, ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియని వైనాన్ని చక్కగా చూపించారు.
Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?
'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్'లో ట్విస్టులు ఏమీ లేవు. దర్శకుడు అశ్విన్ రాజ్ శెట్టి వికీపీడియాలో సమాచారాన్ని విజువల్ రూపంలో వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ బావుంది. ఏరియల్ షాట్స్ కొన్ని సన్నివేశాల్లో ఎఫెక్ట్ చూపించాయి. అయితే, ఉమేష్ రెడ్డి నేరస్తుడిగా ఎందుకు మారాడు? అనేది చూపించి ఉంటే డాక్యుమెంటరీకి అర్థం, పరమార్థం చేకూరేది. అతడు ఇంకా జైలులో ఉండటం వల్ల అతడి వెర్షన్ తీసుకోవడం కుదరలేదని డాక్యుమెంటరీ మేకర్స్ తెలిపారు.
ఉమేష్ రెడ్డి క్యారెక్టర్ ఆధారంగా కన్నడలో సినిమాలొచ్చాయి. 'దండుపాళ్యం'లో ఓ రేపిస్ట్ క్యారెక్టర్‌కు ఉమేష్ రెడ్డి స్ఫూర్తి అని అంటుంటారు. అటువంటి రేపిస్ట్ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఇంటర్వూలు చూడటం కోసం అయితే ఈ మినీ డాక్యుమెంటరీ సిరీస్ చూడొచ్చు. చట్టంలో లోసుగులను ఉపయోగించి నేరస్తులు ఎలా తప్పించుకున్నారు? అనేదానికి ఇదొక ఉదాహరణ. లేదంటే లైట్. ఉమేష్ రెడ్డి అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరు పరిచేటప్పుడు అతడిని చూడటానికి వచ్చిన జనాలు, జైలులో అతడి ఫోటో వంటి రియల్ విజువల్స్ లాస్ట్ ఎపిసోడ్‌లో ఉన్నాయి.
Also Read : గోవిందా నామ్ మేరా రివ్యూ: కియారా అద్వానీ కొత్త ఓటీటీ సినిమా ఎలా ఉంది?