సినిమా రివ్యూ : గోవిందా నామ్ మేరా (హిందీ)
రేటింగ్ : 2.75/5
నటీనటులు : విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ తదితరులు
ఛాయాగ్రహణం : విదూషి తివారి
సంగీతం : మీట్ బ్రోస్, తనీష్క్ బగ్చి, సచిన్-జిగర్, రోచక్ కోహ్లీ, బి ప్రాక్
నిర్మాతలు : కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శశాంక్ ఖైతాన్
విడుదల తేదీ: డిసెంబర్ 16, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
బాలీవుడ్‌లోని మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో విక్కీ కౌశల్ కూడా ఒకరు. 2020 తర్వాత తన సినిమా ఒక్కటి కూడా థియేటర్లో కూడా విడుదల కాలేదు. ‘సర్దార్ ఉదమ్ సింగ్’ కూడా ఓటీటీలోనే విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా ‘గోవిందా నామ్ మేరా’ కూడా నేరుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల అయింది. విక్కీ కౌశల్‌తో పాటు తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్‌గా మారుతున్న కియారా అద్వానీ కూడా ఈ సినిమాలో నటించారు. మరి సర్దార్ సక్సెస్‌ను విక్కీ కౌశల్ రిపీట్ చేశాడా?
కథ: గోవిందా (విక్కీ కౌశల్) బాలీవుడ్ సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పని చేస్తుంటాడు. కొరియోగ్రాఫర్ అవ్వాలనేది అతని కల. తన భార్య గౌరి (భూమి పెడ్నేకర్). వారిద్దరికీ అస్సలు పడదు. గోవిందా విడాకులు కావాలని అడిగితే కట్నంగా ఇచ్చిన రూ.2 కోట్లు వెనక్కి ఇవ్వాలని గౌరి డిమాండ్ చేస్తుంది. గోవిందాకి సుక్కు (కియారా అద్వానీ) అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అలాగే గౌరికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. గోవిందాకి సవతి తల్లి కుటుంబంతో ఆస్తి గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. డబ్బు కోసం గోవిందా, సుక్కు చేసిన మ్యూజిక్ వీడియో కూడా మిస్ ఫైర్ అవుతుంది. ఒకరోజు వీరిద్దరికీ పెద్దమొత్తంలో డ్రగ్స్ దొరుకుతాయి. అదే రోజు గౌరిని ఎవరో హత్య చేస్తారు. గౌరిని హత్య చేసింది ఎవరు? ఆ డ్రగ్స్‌ను గోవిందా, సుక్కు ఏం చేశారు? చివరికి ఏం అయింది తెలుసుకోవాలంటే గోవిందా నామ్ మేరా స్ట్రీమ్ చేయాల్సిందే!
విశ్లేషణ: సాధారణంగా క్రైమ్ కామెడీల్లో ఒకవైపు క్రైమ్ ఎలిమెంట్ ఉంటే, దాని చుట్టూ జరిగే సంఘటనల నుంచి కామెడీని క్రియేట్ చేస్తారు. కానీ ‘గోవిందా నామ్ మేరా’ దానికి పూర్తి విరుద్ధంగా సాగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో క్రైమ్, కామెడీ రెండూ వేర్వేరుగా జరుగుతాయి. కథ గోవిందా కష్టాల చుట్టూ తిరిగినంత సేపు కామెడీని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారి క్రైమ్ టర్న్ తీసుకున్నాక ఇంక సినిమాలో కామెడీ ఎక్కువగా కనిపించదు.
అయితే గోవిందా చుట్టూ తిరిగే కామెడీ సన్నివేశాలు ఎక్కువగా నవ్వించవు. కథ క్రైమ్ టర్న్ తీసుకోవడానికి గంటకు పైగానే సమయం పడుతుంది. అది సినిమాకు పెద్ద మైనస్. కానీ ఆ తర్వాత నుంచి కథనం పరుగులు పెడుతుంది. సరిగ్గా డీల్ చేస్తే అమాయకుడిలా కనిపించే అతి తెలివైన హీరో కాన్సెప్ట్ ఎప్పుడైనా సూపర్ హిట్టే. ఇందులో కూడా ఆ పార్ట్ బాగా రాసుకున్నారు. లేకపోతే ‘గోవిందా నామ్ మేరా’ కాస్తా గోవిందా గోవిందా అయ్యేది. చివరి అరగంట సినిమాకు ప్రాణం. సీట్ ఎడ్జ్ మీద కూర్చునే విధంగా ఈ పోర్షన్‌ను డీల్ చేయడం చాలా పెద్ద ప్లస్. సినిమాలో పెద్దగా గుర్తు పెట్టుకునే పాటలు లేవు. నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాలకు తగ్గట్లు ఉంటుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్ ఉండాల్సింది. మొదటి గంటలో ఈజీగా చాలా సీన్లు ఎడిట్ చేసి ఉండవచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... గోవిందా పాత్రలో విక్కీ కౌశల్ చెలరేగిపోయాడు. మొదటి గంటన్నర ఒక షేడ్‌లో, చివరి అరగంట ఇంకో షేడ్‌లో తన క్యారెక్టర్ ఉంటుంది. కియారా అద్వానీ స్క్రీన్‌పై అందంగా కనిపిస్తుంది. పాటల్లో తన గ్లామర్‌తో యూత్‌ను ఆకట్టుకుంటుంది. తన పాత్రలో నటనకు కూడా స్కోప్ ఉంది. భూమి పెడ్నేకర్‌ది లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్ర అయినప్పటికీ గయ్యాళి భార్య పాత్రకు న్యాయం చేసింది. గోవిందా లాయర్ పాత్రలో కనిపించిన అమే వాగ్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. తెలుగులో మనీ, మనీ మనీ చిత్రాల్లో రేణు పాత్రలో పలకరించిన రేణుక శశానే హీరో తల్లి పాత్రలో కనిపించారు. ఆవిడ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని ఒక సరదా చూసేయాలనుకుంటే ఈ గోవిందుడు మిమ్మల్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
Also Read : ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?
Also Read : 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?