వెబ్ సిరీస్ రివ్యూ : ఫాల్ (FALL)
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్ తదితరులు
ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి
సంగీతం : అజేష్ అశోక్
నిర్మాతలు : దీపక్ ధర్, రాజేష్ చద్దా
రచన : కరుణ్‌దేల్ రాజేష్, సిద్ధార్థ్ రామస్వామి
దర్శకత్వం : సిద్ధార్థ్ రామస్వామి
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022
ఓటీటీ వేదిక : డిస్నీప్లస్ హాట్‌స్టార్
ఎపిసోడ్స్ సంఖ్య : ప్రస్తుతానికి 3 (ప్రతి శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ విడుదల కానుంది)


ఇటీవలే ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్‌తో పలకరించిన అంజలి మళ్లీ ‘ఫాల్’ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఝాన్సీ తరహాలోనే ఫాల్ కూడా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్‌ను ఇంట్రస్టింగ్‌గా కట్ చేశారు. మరి ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉందంటే?


కథ: కోటీశ్వరుల కుటుంబానికి చెందిన దివ్య (అంజలి) తల్లితో గొడవ పడి సపరేట్‌గా ఉంటుంది. ఒకరోజు సడెన్‌గా దివ్య తను ఉంటున్న భవనం మీద నుంచి కిందకి పడి కోమాలోకి వెళ్తుంది. కొన్ని నెలల పాటు కోమాలో ఉండిపోవడంతో దివ్య కుటుంబ సభ్యులు తనకు ఒక డ్రగ్ ఇచ్చి బాధ నుంచి బయట పడేయాలనుకుంటారు. కానీ దివ్య సడెన్‌గా కోమా నుంచి బయటకు వస్తుంది. కానీ తనకు ఏమీ గుర్తుండదు. దివ్య కథకు సమాంతరంగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘ఫాల్’ చూడాల్సిందే.


విశ్లేషణ: 2012లో విడుదల అయిన ‘వర్టీజ్ (Vertige)’ అనే కెనడా వెబ్ సిరీస్‌ను భారతీయ భాషల్లో ‘ఫాల్’గా రీమేక్ చేశారు. ప్రస్తుతానికి ‘ఫాల్’కు సంబంధించి మూడు ఎపిసోడ్లు మాత్రమే విడుదల అయ్యాయి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుందని హాట్‌స్టార్ తెలిపింది. డిసెంబర్ 9వ తేదీన విడుదల అయిన మొదటి మూడు ఎపిసోడ్లలో దర్శకుడు సిద్ధార్థ్ రామస్వామి కేవలం పాత్రల పరిచయం మాత్రమే పూర్తి స్థాయిలో చేశారు. దివ్య కోమాలోకి వెళ్లినప్పుడు తన చుట్టూ ఉన్న పాత్రలు ఎలా ప్రవర్తించాయి? దివ్య కోమాలో నుంచి బయటకు వచ్చాక ఆయా పాత్రల్లో వచ్చిన మార్పులు ఏంటి? అనే అంశం మీదనే ఈ మూడు ఎపిసోడ్లు నడిచాయి. అసలు కథ ఇప్పటి నుంచి ప్రారంభం కానుంది.


దీంతోపాటు కథలో ఇంతవరకు ఒక్క ట్విస్టు కూడా రివీల్ కాలేదు. ఒక మెట్రో ప్రాజెక్టు, దివ్య సూసైడ్ అటెంప్ట్ లేదా తనపై జరిగిన మర్డర్ అటెంప్ట్‌ల చుట్టూనే కథ తిరిగింది. ముందు ఎపిసోడ్లకు వెళ్లే కొద్దీ కథలో కొత్త లేయర్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఈ రెండిటి చుట్టూనే కథ తిరగనుందా? అనేది తెలియనుంది. ఇప్పటివరకు విడుదలైన మూడు ఎపిసోడ్ల నిడివి 34 నిమిషాల నుంచి 39 నిమిషాల మధ్యలో ఉంది. ఎపిసోడ్లు అయిపోతున్నప్పటికీ కథనం ముందుకు సాగిన ఫీలింగ్ అయితే రాదు. ఇందులో స్క్రీన్‌ప్లే హీరో సైకిల్‌కు సెంటర్ స్టాండ్ వేసి తొక్కినట్లే ఉంటుంది. ఆగకుండా కదులుతున్నట్లు ఉంటది కానీ ఉన్న చోట నుంచి అంగుళం కూడా ముందుకు పోదు.


ఈ సిరీస్‌కు అజేష్ అశోక్ అందించిన నేపథ్య సంగీతం ప్లస్ పాయింట్. సస్పెన్స్ సన్నివేశాల్లో ఆ మూడ్‌ను తన రీ-రికార్డింగ్‌తో క్రియేట్ చేయగలిగాడు. సిరీస్‌కు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ రామస్వామినే సినిమాటోగ్రాఫర్‌గా కూడా వ్యవహరించారు. విజువల్స్ మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. అనవసరమైన సన్నివేశాలకు కత్తెర వేసి ఎపిసోడ్ రన్ టైం 30 నిమిషాల్లోకి తెస్తే స్క్రీన్ ప్లే మరింత రేసీగా ఉండేది.


ఇక నటీనటుల విషయానికి వస్తే... అంజలికి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. అక్టోబర్‌లో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లోనే విడుదల అయిన ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్‌లో కూడా అంజలి గతం గుర్తు లేని పాత్రనే పోషించారు. తన పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్ అన్నయ్య రోహిత్ పాత్రలో ఎస్పీ చరణ్‌ను తీసుకోవడం కొంచెం కొత్తగా ఉంటుంది. గ్రే షేడ్స్ ఉన్న పాత్రను ఆయన చక్కగా పోషించారు. రోహిత్ భార్యగా నటించిన సోనియా అగర్వాల్ కూడా ఎమోషన్స్‌ను చక్కగా పండించారు. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారు దీనిపై లుక్కేయచ్చు. ఎలాగో ఓటీటీలోనే అందుబాటులో ఉంది కాబట్టి స్లో అయింది అనిపించిన చోట స్కిప్ బటన్ వాడితే సరిపోతుంది.


Also Read : 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?


Also Read : వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?