వెబ్ సిరీస్ రివ్యూ : వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని
రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఎస్.జె.సూర్య, సంజన, నాజర్, లైలా తదితరులు
ఛాయాగ్రహణం : శరవణన్ రామసామి
సంగీతం : సైమన్ కె.కింగ్
నిర్మాణ సంస్థ : అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆండ్రూ లూయిస్
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్ సంఖ్య : 8


ఎస్‌జే సూర్య హీరోగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని’. గతంలో విజయ్ ఆంటోని నటించిన ‘కిల్లర్’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఆండ్రూ లూయిస్ దీన్ని తెరకెక్కించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది?


కథ: తమతో పాటు షూటింగ్‌కు వచ్చిన హీరోయిన్ మమత శవం అయి కనిపించడంతో ఆ సినిమా యూనిట్ వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఒకవైపు దర్యాప్తు జరుగుతూ ఉండగానే మమత తాను బెంగళూరులో ఉన్నట్లు ఫోన్ చేస్తుంది. పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు అక్కడ దొరికింది స్థానికంగా హోటల్ నడిపే రూబీ (లైలా) కూతురు వెలోని (సంజన) శవం అని తెలుస్తుంది. ఈ కేసు ఎస్సై వివేక్ (ఎస్.జె.సూర్య) చేతికి చేరుతుంది. ముందుకు పోయేకొద్దీ వివేక్ కేసును మరింత పర్సనల్‌గా తీసుకోవడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం అయింది? వెలోని మరణానికి కారణం ఎవరు? తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.


విశ్లేషణ: సినిమాలు కానీ, సిరీస్ కానీ ఏదైనా సరే థ్రిల్లర్ కంటెంట్ తీయడంలో కొంత రిస్క్ ఉంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేయడంతో పాటు కన్విన్సింగ్‌గా ఉంటే అంతకు ముందు కథలో కానీ, కథనంలో కానీ ఏమైనా లోపాలు కనిపించినా పెద్ద నష్టం ఉండదు. కానీ కథనం ప్రెడిక్టబుల్ అయితే మాత్రం థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయడం కొంచెం కష్టమే. ‘వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని’లో దర్శకుడు ఆండ్రూ లూయిస్ రాసుకున్న కథ బాగుంది. లేయర్స్‌గా స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే ప్రారంభ ఎపిసోడ్లలో స్క్రీన్‌ప్లే చాలా ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. కథనంలో వచ్చే ట్విస్ట్‌లను గెస్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు.


తమిళంలో ‘వదంది’ అంటే పుకారు అని అర్థం. ఒక అమ్మాయి అనుమానాస్పద రీతిలో తన గురించి వచ్చిన పుకార్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక దశలో వెలోని చుట్టూ ఉన్న ప్రతి పాత్రపై అనుమానం కలుగుతుంది. స్క్రీన్‌ప్లే ప్రెడిక్టబుల్‌గా ఉన్నప్పటికీ నాలుగు ఎపిసోడ్ల తర్వాత కథనం వేగం పుంజుకుంటుంది. కథ ముగిసిందనుకున్న ప్రతి చోట కొత్త మలుపు తిరుగుతూ సాగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. టెక్నికల్‌గా కూడా ఈ సిరీస్ హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కించారు. సైమన్ కె.కింగ్ సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు సాగుతుంది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉండాల్సింది. ఎపిసోడ్ల రన్‌టైం కొంచెం తగ్గితే బాగుండేది. శరవణన్ రామసామి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఇక నటీనటుల విషయానికి వస్తే... వివేక్ పాత్రలో ఎస్.జె.సూర్య ఒదిగిపోయాడు. ఎస్.జె.సూర్య ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్, ఫ్యామిలీ మ్యాన్ ఇలా రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రను ఎస్.జె.సూర్య కోసం ఆండ్రూ లూయిస్ డిజైన్ చేశాడు. ఈ సిరీస్‌లో హీరో కంటే కీలక పాత్ర వెలోనిది. ఈ క్యారెక్టర్‌లో కనిపించిన సంజన 100 శాతం న్యాయం చేసింది. సంజన తల్లి పాత్రలో నటించిన లైలా కూడా ఆకట్టుకుంటుంది. నాజర్, ఇతర పాత్రలో కనిపించిన నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారిని ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది. ఈ వీకెండ్‌లో టైమ్ పాస్‌కు ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటే ‘వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని’ని ట్రై చేయవచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడటం కష్టమే. 


Also Read : 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల నటించిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సినిమా ఎలా ఉందంటే?


Also Read : 'తోడేలు' రివ్యూ : తెలుగులో సినిమా హిట్టా? ఫట్టా?