సినిమా రివ్యూ : అవతార్ 2 (Avatar The Way Of Water)
రేటింగ్ : 3/5
నటీనటులు : శామ్ వర్తింగ్‌టన్, జో సల్దానా, సగోని వీవర్, జాక్ ఛాంపియన్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టిస్ తదితరులు
ఛాయాగ్రహణం : రస్సెల్ కార్పెంటర్
సంగీతం : సిమన్ ఫ్రాంగ్లేన్
సమర్పణ : మురళి లాలుకోట
నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జాన్ లాండో
దర్శకత్వం : జేమ్స్ కామెరూన్!
విడుదల తేదీ: డిసెంబర్ 16, 2022
'అవతార్' (Avatar 2 Movie)... అదొక సినిమా పేరు మాత్రమే కాదు, అంతకు మించి! అదొక అద్భుత ప్రపంచం! ఆ ఊహా ప్రపంచంలో ప్రపంచ ప్రేక్షకులు అందరూ విహరించారు. 'అవతార్' 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి సీక్వెల్ 'అవతార్ 2' పదమూడేళ్ళ తర్వాత... ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి! మరి, సినిమా ఎలా ఉంది (Avatar 2 Review)?
కథ (Avatar 2 Movie Story) : నావిగా మారిన జేక్ (శామ్ వర్తింగ్‌టన్), నావి యువరాణి నేయితిరి (జో సల్దానా) పెళ్లి చేసుకుని, పిల్లలతో సంతోషంగా పండోరా గ్రహం మీద జీవిస్తుంటారు. 'అవతార్' క్లైమాక్స్‌లో కల్నల్ మైల్స్ (స్టీఫెన్ లాంగ్) చనిపోయినట్టు చూపించారు. గుర్తుందా? ఇప్పుడు అతను నావిగా తిరిగి వస్తారు. జేక్ మీద పగతో అతడిని అంతం చేయాలని నావిలుగా మారిన కొంత మంది సైన్యంతో పండోరా గ్రహం మీద అడుగు పెడతాడు. కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం జేక్ అడవులు వదిలి దగ్గరలోని సముద్ర తీరానికి వెళతాడు. అక్కడ మరో తెగ (రీఫ్) ఉంటుంది. ఆ తెగ నాయకురాలు రొనాల్ (కేట్ విన్స్‌లెట్), ఆమె భర్త టోనోవరి (క్లిప్ కర్టిస్) ఎలాంటి సాయం చేశారు? జేక్‌ను చంపాలనే కల్నల్ లక్ష్యం నెరవేరిందా? లేదా? ఫ్యామిలీ కోసం జేక్ ఏం చేశాడు? ఈ కథలో టుల్‌కున్ (భారీ ఆకారంలోని చేప) పాత్ర ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ : వావ్... జస్ట్ వావ్... 'అవతార్' సినిమా చూస్తున్నప్పుడు సిల్వర్ స్క్రీన్ ముందున్న ప్రేక్షకుల మనసులో ఫీలింగ్ అదేనని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అప్పటి వరకు తెరపై చూడని ఓ అందమైన దృశ్య కావ్యాన్ని చూసిన అనుభూతి కలిగింది. కథ పరంగా కొత్తదనాన్ని తెరపై చూశారు. అందువల్లే, పదమూడేళ్ళ తర్వాత సీక్వెల్ వచ్చినా... ప్రేక్షకుల్లో అంత క్రేజ్ ఉంది. అంత అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టు సినిమా ఉందా? లేదా? అనే విషయంలోకి వెళితే...
'అవతార్ 2'లో కూడా విజువల్స్ బావున్నాయి. 'అవతార్' వచ్చిన పదమూడేళ్ళలో టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. అది విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో క్లారిటీగా కనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. మరి విజువల్స్ సంగతి పక్కన పెట్టి కథ, సినిమా విషయానికి వస్తే... నథింగ్ న్యూ! మనం కొత్తగా ఫీలయ్యేది ఏమీ ఉండదు.
'అవతార్'లో నావిగా మారిన మనిషి మరో గ్రహానికి వెళ్లడం, అక్కడ నావితో కలిసి ప్రేమలో పడటం, తమ ఉనికి కోసం పోరాటం చేయడం వంటివి కొత్తగా ఉన్నాయి. ఈసారి కథలో ఎటువంటి కొత్తదనం ఏదీ లేదు. జేమ్స్ కామెరూన్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ కలిసి 'అవతార్'ను ఒక సగటు రివెంజ్ ఫార్ములా కథగా మార్చేశారు. 'అవతార్'లో పోరాటం అడవుల్లో సాగితే... 'అవతార్ 2'లో పోరాటం సముద్రంలోకి వచ్చింది. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... సముద్ర గర్భంలో విజువల్స్ సూపర్ ఉన్నాయి. టుల్‌కున్ ఫిష్ సన్నివేశాలు బావుంటాయి. కథకు వస్తే... రెగ్యులర్ మన తెలుగు సినిమాల్లో చూసే సీన్స్ కొన్ని గుర్తుకు వస్తాయి. 'అవతార్' ఇచ్చిన హై, 'అవతార్ 2' ఇవ్వదు. టుల్‌కున్స్ వేట, అమృతం కోసం సాగించే పోరాటం ఏదీ ఆసక్తిగా ఉండదు.
Also Read : గోవిందా నామ్ మేరా రివ్యూ: కియారా అద్వానీ కొత్త ఓటీటీ సినిమా ఎలా ఉంది?
విజువల్స్, విజువల్ వండర్ అనిపించే సీన్స్... అంతకు మించి 'అవతార్ 2'లో ఏమీ లేదు. 'అవతార్'ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు వెళితే... డిజప్పాయింట్ అవుతారు. సినిమా డిజప్పాయింట్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్... ప్రేక్షకులకు నావి మనుషులు, పండోరా గ్రహం కొత్త కాదు. ఆల్రెడీ ఆ విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్ చేయడంతో మరింత వండర్ కోరుకోవడం! రెండు... కథగా చూస్తే సారీ బ్రో! నిడివి ఎక్కువ కావడం కొంత ఇబ్బంది పెడుతుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే విజువల్స్ ఎంజాయ్ చేసి రావచ్చు. యాక్షన్ సీన్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. విజువల్స్ అండ్ యాక్షన్ కోసం జేమ్స్ కామెరూన్‌కు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. సినిమాకు వెళ్ళాలని అనుకునేవాళ్ళు మూడున్నర గంటలు థియేటర్లలో ఉండటానికి రెడీ అవ్వండి. ఎంత జేమ్స్ కామెరూన్ అభిమాని అయినా సరే... ఆ రన్ టైమ్ భరించడం కొంచెం కష్టమే.
Also Read : 'జగమే మాయ' రివ్యూ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ధన్యా బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?