సినిమా రివ్యూ : స్పై
రేటింగ్ : 1.75/5
నటీనటులు : నిఖిల్, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం, ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్, మకరంద్ దేశ్‌ పాండే, జిష్షు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవి వర్మ తదితరులు
రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి
ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
స్వరాలు : విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
సంగీతం : శ్రీచరణ్ పాకాల
కథ, నిర్మాత : కె. రాజశేఖర్ రెడ్డి
కూర్పు, దర్శకత్వం : గ్యారీ బీహెచ్
విడుదల తేదీ: జూన్ 29, 2023


నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)కు 'కార్తికేయ 2' విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత 'స్పై' (SPY Movie)తో మళ్ళీ పాన్ ఇండియా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ప్రచార చిత్రాల్లో సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన సినిమాపై ఆసక్తి కలిగించాయి. ఈ సినిమాతో పలు హిట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన ఎలా చేశారు? సినిమా (SPY Review Telugu) ఎలా ఉంది? 


కథ (SPY Movie Story) : జై అలియాస్ విజయ్ (నిఖిల్ సిద్ధార్థ) 'రా' ఏజెంట్. అతని అన్నయ్య సుభాష్ (ఆర్యన్ రాజేష్) సైతం 'రా' ఏజెంటే. అయితే... ఇప్పుడు ఆయన లేరు. ఇండియాకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న ఖాదిర్ ఖాన్ (నితిన్ మెహతా)ను సుభాష్ చంపుతాడు. ఆ తర్వాత సుభాష్‌ను ఎవరో చంపేస్తారు. తన అన్నయ్యను ఎవరు చంపారో తెలుసుకోవాలని జై ప్రయత్నిస్తూ ఉంటాడు. జై, కమల్ (అభినవ్ గోమఠం) శ్రీలంకలో ఓ మిషన్ పని మీద ఉండగా... ఇండియా ప్రధాని (సచిన్ ఖేడేకర్)కు ఓ వీడియో వస్తుంది. అందులో ఖాదిర్ ఖాన్ ఉంటాడు. ఖాదిర్ ను సుభాష్ చంపడం శాస్త్రి వీడియోలో చూస్తాడు. 


మరణించిన ఖాదిర్ మళ్ళీ ఎలా బతికాడు? ఇండియా ఎలా వచ్చాడు? సరిగ్గా అదే సమయంలో 'రా' హెడ్ ఆఫీసులో భగవాన్ జీ (సుభాష్ చంద్రబోస్) ఫైల్స్ మిస్ కావడం వెనుక ఎవరు ఉన్నారు? ఖాదిర్ ను మళ్ళీ 'రా' పట్టుకోగలిగిందా? జైను 'రా' నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? ఖాదిర్ & భగవాన్ జీ ఫైల్స్ అన్వేషణలో సాయం చేసిన వైష్ణవి (ఐశ్వర్య మీనన్), జై మధ్య గతంలో ఏం జరిగింది? 'రా'లో జై సీనియర్ అర్జున్ (రానా దగ్గుబాటి), పాకిస్థాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అబ్దుల్ రెహమాన్ (జిష్షు సేన్ గుప్తా) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (SPY Movie Review) : తెలుగులో, ఇతర భాషల్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు చూశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు... ఏ దశలోనూ 'స్పై' ఓ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడికి కలగదు. ఆ స్థాయిలో సినిమా తెరకెక్కించారు. సీన్లు సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే మరీ ఘోరం! యాక్షన్ థ్రిల్లర్ మాట పక్కన పెడితే... 'రా' నేపథ్యంలో తీసిన సినిమాగా ఎక్కడా కనిపించదు. అదీ 'స్పై' ప్రత్యేకత! 


రెగ్యులర్, రొటీన్ యాక్షన్ సినిమాల్లో అయినా సన్నివేశాలు కొంచెం స్పీడు స్పీడుగా ముందుకు వెళతాయి ఏమో!? 'స్పై'లో అటువంటి సన్నివేశం ఒక్కటి కూడా లేదు. యాక్షన్ సీన్లు సైతం నిదానంగా ముందుకు వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అఫ్ కోర్స్... ఉన్నంతలో ఆ యాక్షన్ కొంత బెటర్! చావు కంటే గుడ్డి మెల్ల అంటారు కదా! అలా అన్నమాట!


'స్పై' కథలో సస్పెన్స్ & సెంటిమెంట్, లవ్ & యాక్షన్, మరీ ముఖ్యంగా కామెడీ... ఒక్కటేమిటి? అన్నీ ఉన్నాయి. లేనిది ఏమిటని ఆలోచిస్తే? ఉత్కంఠ కలిగించే కథనం, ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలు! నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే... అంత మంచిది! నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుడిని డైవర్ట్ అయ్యేలా చేస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆ గ్రాఫిక్స్ వల్లనో, మరొకటో... కెమెరా వర్క్ బాలేదు. పాటలు కథకు అడ్డు తగిలాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు.


'స్పై' ప్రారంభమైన కాసేపటి... ఇది 'రా' నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అనే సంగతి మర్చిపోయి హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలను, వాళ్ళిద్దరి పాటను ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ తానొక ఎన్ఐఏ ఏజెంట్ అని చెప్పే వరకు మళ్ళీ గుర్తు రాదు. హానీ ట్రాపింగ్ డైలాగ్ వింటే ప్రేక్షకులు ఫ్యూజులు ఎగిరిపోతాయి. కథలో లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ & డైరెక్షన్... రెండు విభాగాల్లోనూ గ్యారీ బీహెచ్ ప్రభావం చూపించలేదు.


నటీనటులు ఎలా చేశారు? : కథ, కథనాలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే... జై పాత్రకు న్యాయం చేయడానికి నిఖిల్ శాయశక్తులా ప్రయత్నించారు. కొన్ని సీన్లలో ఆయన నటన బావుంది. సినిమాను భుజాల మీద మోయడానికి ట్రై చేశారు. కానీ, బలహీనమైన కథ, కథనాల ముందు నిఖిల్ నటన చిన్నబోయింది. 


హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. లుక్స్ జస్ట్ ఓకే. సాన్యా ఠాకూర్ కీలకమైన సరస్వతి పాత్ర చేశారు. మకరంద్ దేశ్ పాండే క్లీన్ షేవ్ తో కొత్త లుక్ లో కనిపించారు. ప్రధానిగా సచిన్ ఖేడేకర్ చేసింది ఏమీ లేదు.   


హీరోతో పాటు సినిమా అంతా ట్రావెల్ చేసే కమల్ పాత్రలో అభినవ్ గోమఠం కనిపించారు. సన్నివేశంతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల ఆయన కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. కొన్నిచోట్ల, అసలు ఆ సన్నివేశంలో ఆ డైలాగ్ అవసరమా? అని మనకు కామెడీగా అనిపిస్తుంది. జిష్షు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు రెగ్యులర్ రోల్స్ చేశారు. రానా దగ్గుబాటి కనిపించేది ఒక్క సన్నివేశమే అయినా... నటన, డైలాగ్ డెలివరీతో చిన్న హై ఇస్తారు. ఆర్యన్ రాజేష్, తనికెళ్ళ భరణి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి రెండు మూడు సన్నివేశాలకు పరిమితం అయ్యారు. 


Also Read 'సామజవరగమన' రివ్యూ : కామెడీతో కొట్టిన శ్రీ విష్ణు... సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'స్పై'లో భారీ తారాగణం ఉంది. ఒకట్రెండు సీన్లకు పేరున్న ఆర్టిస్టులను తీసుకున్నారు. అయితే... సినిమాలో ఆ భారీతనం లేదు. కథ, కథనంలో అసలు ఉత్కంఠ లేదు. నిజం ఏమిటనేది పక్కన పెడితే... సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పే సీన్లు కాస్త బెటర్. సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ఆయన పేరు వాడుకున్నట్లు అనిపించింది. దేశభక్తిలో భగవాన్ జీ సక్సెస్ అయితే... నిఖిల్ 'స్పై' మిషన్ ఫెయిల్ అయ్యింది. డిజప్పాయింట్ చేసే రొటీన్ స్పై థ్రిల్లర్ ఇది.  


Also Read : 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ రివ్యూ: అవికా గోర్ హార్రర్ సినిమా ఎలా ఉంది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial