సినిమా రివ్యూ : 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్
రేటింగ్ : 1.5/5
నటీనటులు : అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్ట్, అమిత్ బెల్, అవతార్ గిల్ తదితరులు
రచన : మహేష్ భట్, సుహ్రితా దాస్
సంగీతం : పునీత్ దీక్షిత్
నిర్మాతలు : విక్రమ్ భట్, డాక్టర్ రాజ్ కిషోర్ ఖవారే, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్
నిర్మాణ సంస్థలు : విక్రమ్ భట్ ప్రొడక్షన్, హౌస్‌ఫుల్ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
తెలుగులో పంపిణీ :  లక్ష్మి గణపతి ఫిలిమ్స్
దర్శకత్వం : కృష్ణ భట్
విడుదల తేదీ: జూన్ 23, 2023


హార్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘1920 సిరీస్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2008లో వచ్చిన మొదటి ‘1920’ సినిమా నుంచి 2018లో వచ్చిన నాలుగో సినిమా ‘1921’ వరకు నాలుగు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించాయి. దీంతో ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ పేరిట ఐదో సినిమాను తెరకెక్కించారు. తెలుగు వారికి కూడా పరిచయం ఉన్న అవికా గోర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. హిందీలో తీయడంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేశారు. టీజర్, ట్రైలర్ కూడా ఆ జానర్‌ను ఇష్టపడేవారిని ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువంటూ అవికా గోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కూడా ఈ సినిమా ప్రమోషన్లలోనే. మరి సినిమా ఎలా ఉంది?


కథ: మేఘన (అవికా గోర్) తండ్రి ధీరజ్ (రణ్‌ధీర్ రాయ్) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. దానికి మేఘన తల్లి రాధిక (బర్కా బిష్ట్) కారణమని ఉత్తరం రాసి పెడతాడు. దీంతో తల్లిపై పగ తీర్చుకోవాలని మేఘన నిర్ణయించుకుంటుంది. ప్రేమించిన వ్యక్తి అర్జున్‌ని (దనిష్ పండోర్) కూడా వదులుకోవడానికి సిద్ధం అవుతుంది. శంతను (రాహుల్ దేవ్) అనే పెద్ద ధనవంతుడిని రాధిక పెళ్లి చేసుకుందని, వారికి అదితి (కేతకి కులకర్ణి) అనే కూతురు ఉందని తెలుసుకుంటుంది. తల్లిపై పగ తీర్చుకోవడానికి చనిపోయిన తండ్రి సాయం కోరుతుంది. ధీరజ్ కూడా పగనే కోరుకుంటాడు. మరి మేఘన పగ తీరిందా? అనేది తెలియాలంటే ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ చూడాల్సిందే.


విశ్లేషణ: తెలుగులో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముడుకోవడం అనే సామెత ఒకటి ఉంది. ఆ సామెత ఈ సినిమాకు చక్కగా వర్తిస్తుంది. ‘1920 సిరీస్’లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే వరస్ట్ సినిమా. మూడు, నాలుగు భాగాలు కూడా విజయం సాధించలేదు కానీ ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ అంత వరస్ట్ అయితే కావు. ప్రొడక్షన్ వాల్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమాలో సెట్ల కంటే పాటల కోసం వేసే సెట్లే కాస్త రియలిస్టిక్‌గా ఉంటాయి.


మేఘన తండ్రి ధీరజ్ మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. భర్త చనిపోయి భార్యపై పగ తీర్చుకోవాలనుకునే హార్రర్ సినిమాలు ఎలా ముగుస్తాయో ఊహించడం అస్సలే మాత్రం కష్టం కాదు. తర్వాతి సన్నివేశంలో ఏం జరుగుతుందో ఊహించడం సంగతి పక్కన పెడితే, జంప్ స్కేర్ సీన్లు ఎప్పుడు వస్తాయో చెప్పగలిగేంత బలంగా స్క్రీన్ ప్లే రాశారు. దీంతో హార్రర్ ఎలిమెంట్స్ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో అస్సలు మనల్ని ఇన్వాల్వ్ అవ్వనివ్వవు.


ఇప్పటివరకు స్క్రీన్ మీద చాలా పద్ధతిగా కనిపించిన అవికా గోర్ ఇందులో పూర్తిగా రెచ్చిపోయింది. లెక్క లేనని లిప్ లాకులతో పాటు ఘాటైన బెడ్రూం సీన్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాకు సంగీతం పెద్ద మైనస్ పాయింట్. ఒక్క పాట కూడా వినబుల్‌గా ఉండదు. హార్రర్ సినిమాకు అవసరమైన నేపథ్య సంగీతం కూడా అందించడంలో మ్యూజిక్ డైరెక్టర్ పునీత్ దీక్షిత్ విఫలం అయ్యాడు. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే కావడం పెద్ద ప్లస్ పాయింట్.


ఇక నటీనటుల విషయానికి వస్తే... మేఘన పాత్రలో అవికా గోర్ కనిపించింది. మొత్తం సినిమాలో నటించే స్కోప్ ఉన్న పాత్ర ఏదైనా ఉందా అంటే అది అవికా గోర్‌ది మాత్రమే. రాహుల్ దేవ్‌ సహజంగా మంచి నటుడే అయినా సినిమా అంతా సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం అవుతాడు. అదితి పాత్రలో నటించిన కేతకి కులకర్ణి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటుంది. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’లో హార్రర్ లేదు, హార్ట్‌ను టచ్ చేసే ఎమోషన్ కూడా లేదు. కాబట్టి థియేటర్‌ కంటే ఓటీటీలో చూసుకోవడం బెటర్.