సినిమా రివ్యూ : సామజవరగమన
రేటింగ్ : 3/5
నటీనటులు : శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్ విజయకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్,  సుదర్శన్, 'వెన్నెల' కిశోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు, దేవి ప్రసాద్, ప్రియా తదితరులు
కథ : భాను భోగవరపు 
మాటలు : నందు సవిరిగాన
సహ నిర్మాత : బాలాజీ గుత్తా
ఛాయాగ్రహణం : రామ్ రెడ్డి
సంగీతం : గోపీసుందర్
సమర్పణ : అనిల్ సుంకర
నిర్మాత : రాజేష్ దండ
కథనం, దర్శకత్వం : రామ్ అబ్బరాజు
విడుదల తేదీ: జూన్ 29, 2023


యువ కథానాయకులలో శ్రీ విష్ణు (Sree Vishnu)ది చాలా ప్రత్యేకమైన శైలి. ఆయన పాదరసం లాంటి నటుడు. భావోద్వేగభరిత పాత్రలు చేయగలరు. కామెడీతో బాగా నవ్వించగలరు. శ్రీ విష్ణు వినోదాత్మక చిత్రాలు చూస్తే... మెజారిటీ శాతం విజయాలే. మరి, 'సామజవరగమన' సినిమా (Samajavaragamana Movie) ఎలా ఉంది? 'వివాహ భోజనంబు' చిత్రంతో నవ్వించిన రచయిత, దర్శక ద్వయం భాను భోగవరపు, రామ్ అబ్బరాజు ఈసారి ఏం చేశారు? 


కథ (Samajavaragamana Movie Story) : బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీప్లెక్స్ టికెట్ కౌంటర్ ఉద్యోగి. వాళ్ళ ఫ్యామిలీది మిడిల్ క్లాస్ లైఫ్! బాబాయ్, మేనత్తలు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు. బాలు తాతయ్య కోటీశ్వరుడు. పిల్లలకు ఆస్తి చెందాలంటే డిగ్రీ సర్టిఫికేట్ అందుకోవాలని కండిషన్ పెడతారు. దాంతో కొడుకు ఉద్యోగం చేస్తుంటే... తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ పరీక్షలు రాస్తుంటాడు. 30 ఏళ్ళు అయినా పాస్ కాడు. తండ్రికి సప్లీ పరీక్షల్లో పరిచయమైన సరయు (రెబా మోనికా జాన్)తో ప్రేమలో పడతాడు బాలు. 


ప్రేమ పేరుతో తనకు దగ్గర కావాలని చూసే అమ్మాయిలతో రాఖీ కట్టించుకునే బాలు... సరయుతో ఎలా ప్రేమలో పడ్డాడు? ప్రేమించిన సరయు తనకు భార్యగా ఇంటికి వస్తుందని బాలు ఆశిస్తే... బావ పెళ్లి కారణంగా చెల్లి అవుతుందని తెలిసి ఏం చేశాడు? సరయు కుటుంబ నేపథ్యం ఏమిటి? చివరకు ఏమైంది? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? లేదా? అనేది సినిమా.  


విశ్లేషణ (Samajavaragamana Movie Review ) : సినిమాల్లో కొన్ని మెదడుకు పని చెబుతూ ఉంటాయి. రెండు నిమిషాలు తల పక్కకి తిప్పినా సరే సీన్ అర్థం కాదు. కొన్ని హాయినిస్తూ, నవ్విస్తూ ముందుకు వెళతాయి. రెండో రకానికి చెందిన సినిమా 'సామజవరగమన'. ఐదు నిమిషాలు బయటకు వెళ్లి రావడం వల్ల కథేమీ ముందుకు కదలదు. కానీ, కామెడీ మిస్ అవుతారు! మధ్యలో బయటకు వెళ్లి, మళ్లీ థియేటర్లలో అడుగు పెడుతుంటే... ఆడియన్స్ ఎందుకు నవ్వుతున్నారు? అని ఆలోచిస్తాం!


'సామజవరగమన' కథలో పెద్ద విషయం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే... ప్రేమించిన అమ్మాయి చెల్లెలు వరుస అవుతుందని తెలిసి హీరో ఏం చేశాడు? అనేది కాన్సెప్ట్! కానీ, కామెడీ ఫుల్లుగా ఉంది. అబ్బాయిని అమ్మాయి ఎందుకు ప్రేమించింది? అని చెప్పడానికి మంచి కారణం రాసుకున్నారు దర్శక, రచయితలు! అయితే, అబ్బాయి ప్రేమలో పడటం, మిగతా కథలో అంత బలం ఉండదు. ప్రతిదీ సినిమాటిక్‌గా ఉంటుంది. ముఖ్యంగా... హీరో హీరోయిన్లు వరుసకు అన్నా చెలెళ్ళు కారని మనం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. చివరకు, ఆ సమస్యకు ముగింపు ఎలా ఇస్తారో ముందు చెప్పొచ్చు.


కథ కంటే కామెడీపై దర్శక, రచయితలు ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు. మెజారిటీ సన్నివేశాల్లో ఫన్ వర్కవుట్ అయ్యింది. ఇన్నాళ్ళూ చదవడం లేదని కొడుకులను తిట్టే తండ్రులను చూశాం. ఇప్పుడు తండ్రిని కొడుకు తిడుతుంటే... ఆ సీన్స్ కాస్త కొత్తగా నవ్విస్తాయి. శ్రీవిష్ణు, నరేష్ టైమింగ్ కేక. కులశేఖర్ పాత్రలో 'వెన్నెల' కిశోర్ సైతం కొన్నిచోట్ల నవ్వించారు. అమ్మాయిల రాఖీ గురించి శ్రీవిష్ణు చెప్పే మోనోలాగ్, 'జెర్సీ' ట్రైన్ సీన్ స్పూఫ్, కులశేఖర్ పాత్ర సీన్స్ మర్చిపోవడం కష్టం! కులశేఖర్ కామెడీ యూట్యూబ్‌లో సాత్విక్ చేసే 'మన కులపోడే' వీడియోలను గుర్తు చేస్తుంది.  


కథను, కథనాన్ని, లాజిక్కులను మర్చిపోయి తెరపై వచ్చే సన్నివేశాలను చూసి నవ్వేలా సినిమా తీయడంలో రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. కామన్ & మిడిల్ క్లాస్ ఆడియన్ రిలేట్ అయ్యే సీన్స్ ఉన్నాయి. ఉదాహరణకు... మల్టీప్లెక్స్‌లో పాప్ కార్న్ రేట్స్ మీద వేసిన సెటైర్! అలాగే, ఏషియన్ వర్సెస్ పీవీఆర్ జోక్! డైలాగ్స్ ట్రెండీగా ఉన్నాయి. అయితే... కొన్ని డబుల్ మీనింగ్స్ తరహా డైలాగులు పంటి కింద రాయిలా తగులుతాయి. మొత్తం మీద ఇటువంటి క్లీన్ కామెడీ ఫిల్మ్ తీయడం కత్తి మీద సాము అని చెప్పాలి. 'జాతి రత్నాలు' తరహాలో 'సామజవరగమన' నవ్విస్తుందని చెప్పవచ్చు.


'సామజవరగమన'లో ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం... రెండూ బావున్నాయి. గోపీ సుందర్ అందించిన బాణీలు జస్ట్ ఓకే. అయితే... పాటల్ని అందంగా, కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. అనిల్ సుంకర, రాజేష్ దండ రాజీ పడలేదు.


నటీనటులు ఎలా చేశారు? : బాలు పాత్రలో శ్రీవిష్ణు జీవించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్. అలవాటైన జానర్ కావడం వల్ల ఏమో... ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. శ్రీ విష్ణు, నరేష్ మధ్య కెమిస్ట్రీ బావుంది. వాళ్ళిద్దరి కలయికలో సన్నివేశాలు ఎక్కువ నవ్విస్తాయి.   


హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John)కు తెలుగులో ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ 'సామజవరగమన'. కమర్షియల్ కథానాయికకు కావాల్సిన ఫీచర్స్ ఆమెలో ఉన్నాయి. రెబా మోనికా జాన్ నవ్వు బావుంది. అలాగే, నటన కూడా! హీరో శ్రీవిష్ణు, మోనికా జాన్ జోడీ చూడముచ్చటగా ఉంది. రాజీవ్ కనకాల మరోసారి ఎమోషనల్ పాత్రలో కనిపించారు. కథలో ఆయన పాత్ర కీలకమైనది. కానీ, నటుడిగా ఆయన్ను ఏమీ కష్టపెట్టలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, 'వెన్నెల' కిశోర్, సుదర్శన్... ముగ్గురూ నవ్వించారు. ఇతర ప్రధాన తారాగణం పాత్రల పరిధి మేరకు చేశారు.   


Also Read : 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ తొలి అడుగు హిట్టేనా?


చివరగా చెప్పేది ఏంటంటే? : రెండున్నర గంటలు హాయిగా నవ్వించే సినిమా 'సామజవరగమన'. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ కావచ్చు. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిది. హీరో శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ గ్యారెంటీ!


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే   


 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial