సినిమా రివ్యూ : స్కంద
రేటింగ్ : 2.75/5
నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, 'కాలకేయ' ప్రభాకర్, దగ్గుబాటి రాజా, అజయ్ పుర్కర్, ఇంద్రజ తదితరులు
మాటలు : ఎం. రత్నం 
ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే 
సంగీతం : ఎస్ తమన్
సమర్పణ : పవన్ కుమార్, జీ స్టూడియోస్  
నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి 
కథ, మాటలు, కథనం, దర్శకత్వం : బోయపాటి శ్రీను 
విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023


'అఖండ' బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా 'స్కంద' (Skanda Movie). రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్లలో యాక్షన్ & ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. మరి, సినిమా (Skanda Review) ఎలా ఉంది?


కథ (Skanda Story) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కర్) అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. ముహూర్తానికి కొద్ది క్షణాల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి (శరత్ లోహితస్వ) కుమారుడితో ఆమె లేచిపోయింది. స్నేహితులైన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. తన కుమార్తెను తీసుకు రావడానికి గునపం లాంటి కుర్రాడు (రామ్ పోతినేని)ని ఏపీ సీఎం పంపిస్తాడు. ఆ తన కుమారుడితో ఏపీ సీఎం కుమార్తె నిశ్చితార్థానికి తెలంగాణ సీఎం ఏర్పాటు చేస్తాడు. ఆ రోజే ఏపీ సీఎం కుమార్తెతో పాటు తెలంగాణ సీఎం కుమార్తె (శ్రీ లీల)ను కూడా రామ్ తనతో పాటు తీసుకువెళతారు. అసలు, అతను ఎవరు? జైలులో ఉన్న రుద్రగంటి రామకృష్ణరాజు (శ్రీకాంత్), రామ్ పోతినేని, ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (Skanda Review) : కమర్షియల్ చిత్రాల్లో కుటుంబ విలువలు, మంచి విషయాలు చెప్పడం బోయపాటి శ్రీను శైలి. వెండితెరపై భారీతనం ఉంటుంది. సగటు సినిమా ప్రేక్షకుడు కోరుకునే అంశాలు అన్నీ ఉంటాయి. 'భద్ర', 'సింహ', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు భారీ విజయాలు సాధించాయంటే... బోయపాటికి మాస్ పల్స్ తెలియడమే. 'స్కంద'లోనూ ఆ మాస్ ఉంటుంది.


'స్కంద' ప్రారంభమే ప్రేక్షకుడికి షాక్ ఇస్తుంది. క్లాష్ ఆఫ్ టైటాన్స్ అన్నట్లు స్క్రీన్ మీద పది నిమిషాలకు బోయపాటి శ్రీను భారీతనం కనబడుతుంది. రామ్ ఇంట్రో గానీ, ఆ తర్వాత సినిమాలో యాక్షన్ సీన్లు గానీ మాస్ జనాలను మెప్పిస్తాయి. ఆ యాక్షన్ దృశ్యాలకు తమన్ అందించిన నేపథ్య సంగీతం సైతం బావుంది. 'స్కంద' పతాక సన్నివేశాలకు ముందు వచ్చే ట్విస్ట్ మెప్పిస్తుంది. మాస్ యాక్షన్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.


సినిమాలో వెలితి... బోయపాటి గత సినిమాల్లో ఉన్నటువంటి బలమైన కథ, కథనాలు లేవు. లాజిక్స్ గురించి అసలు ఆలోచించవద్దు. ముఖ్యమంత్రి ఇంటికి హీరో ట్రాక్టర్ వేసుకుని ఎలా వెళ్ళాడు? యాక్షన్ సీన్లు అలా ఎలా తీశారు? వంటి ప్రశ్నలు అసలు అడగొద్దు. జస్ట్... స్క్రీన్ మీద బోయపాటి శ్రీను మేజిక్ ఎంజాయ్ చేయాలంతే! తెరపై రక్తం ఏరులై పారింది. తలలు తెగి పడ్డాయి. కొంత మంది ప్రేక్షకులకు అవి నచ్చకపోవచ్చు. తెరపై విధ్వంసాన్ని ఎంజాయ్ చేయలేకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు. గతంలో బోయపాటి సినిమాల్లో చూసిన యాక్షన్ తరహాలో సినిమా ఉంటుంది. 


రామ్ పోతినేని (Ram Pothineni)ని మాస్ హీరోగా ప్రజెంట్ చేయడంలో మాత్రం బోయపాటి శ్రీను సూపర్ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం కమర్షియల్ శైలిలో ఉంది. పాటలు ఆశించిన రీతిలో లేవు. సినిమాటోగ్రఫీ సూపర్. 


నటీనటులు ఎలా చేశారంటే : రామ్ పోతినేని ఇంతకు ముందు మాస్ క్యారెక్టర్లు చేశారు. 'ఇస్మార్ట్ శంకర్'లో ఒక కైండ్ ఆఫ్ మాస్ రోల్ చేశారు. 'స్కంద'లో నెక్స్ట్ లెవల్ అసలు! ఇంతకు ముందు ఎప్పుడూ రామ్ ఇంత మాస్ రోల్ చేయలేదని చెప్పాలి.


ఎదురుగా ఎంత బలవంతుడు ఉన్నప్పటికీ తలలు తీసే మొండోడిగా, తండ్రికి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు పణంగా పెట్టే యువకుడిగా... తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ, గౌరవం ఉన్న కుమారుడిగా... వైవిధ్యం చూపించారు. ఆయన తెలంగాణ యాసలో కూడా కొన్ని సీన్లు చేశారు. యాక్షన్ సీన్లలో అయితే విధ్వంసం చూపించారు. పులి వేటాడినట్లు శత్రు సంహారం చేశారు.


రామ్ పోతినేని జంటగా నటించిన శ్రీ లీల పాత్ర పరిమితమే. ఇద్దరి జోడి బావుంది. పాటల్లో డ్యాన్సులు ఇరగదీశారు. సయీ మంజ్రేకర్ పాత్ర నిడివి కూడా తక్కువే. అయితే... కథలో కీలక మలుపుల్లో ఆమె పాత్ర ఉంటుంది. అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. కొన్ని సన్నివేశాల్లో వాళ్ళ వల్ల ఆయా పాత్రలకు హుందాతనం వచ్చింది. 


Also Read : చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?


చివరగా చెప్పేది ఏంటంటే : మాస్ యాక్షన్ సినిమాల్లో దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్ సినిమాలు వేరు. యాక్షన్ సీక్వెన్సులు తీయడంలో ఆయనకు ఓ స్టైల్ ఉంటుంది. 'స్కంద'లోనూ ఆయన స్టైల్ యాక్షన్ ఉంది. కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్  ఆశించిన రీతిలో బలంగా లేవు. యాక్షన్ ఉన్నంత బలంగా ఎమోషన్స్ లేవు. రామ్ యాక్టింగ్, ఆ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. మామూలు యాక్షన్ కాదు... బీభత్సమైన మాస్ యాక్షన్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు పండగ! వాళ్ళకు మాత్రమే ఈ సినిమా!

PS : సినిమా చూశాక, 'స్కంద 2'కి ఇచ్చిన లీడ్ చూస్తే... మ్యాడ్ మాక్స్ తరహా యాక్షన్ ఫిల్మ్ గ్యారెంటీ అనే ఫీల్ కలిగించింది.


Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial