వెబ్ సిరీస్ రివ్యూ : అతిథి
రేటింగ్ : 2.5/5
నటీనటులు : వేణు తొట్టెంపూడి, అవంతిక, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను,  రవి వర్మ, భద్రమ్ తదితరులు
ఛాయాగ్రహణం : మనోజ్ కాటసాని
సంగీతం : కపిల్ కుమార్
నిర్మాత : ప్రవీణ్ సత్తారు
రచన, దర్శకత్వం : భరత్ వైజి
విడుదల తేదీ: సెప్టెంబర్ 19, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఎపిసోడ్స్ : 6


హీరోగా వేణు తొట్టెంపూడి (Venu Thottempudi)కి 'స్వయంవరం', 'చిరునవ్వుతో' స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారు. ఎందుకో ఆయనకు గ్యాప్ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఎన్టీఆర్ 'దమ్ము'తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు. గతేడాది 'రామారావు ఆన్ డ్యూటీ'లో నటించారు. 'అతిథి' వెబ్ సిరీస్ (Athidhi Web Series Hotstar)తో ఇప్పుడు ఓటీటీకి పరిచయమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ సిరీస్ ఇది! దర్శకుడు ప్రవీణ్ సత్తారు నిర్మించారు. 


కథ (Athidhi Web Series Story) : రవి (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) దంపతులు ఇద్దరే పెద్ద ఇంటిలో ఉంటారు. భార్య కాళ్ళు చచ్చుబడిపోవడంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు రవి. ఓ వర్షం కురిసిన రాత్రి ఆ ఇంటికి మాయ (అవంతిక) వస్తుంది. ఆ తర్వాత యూట్యూబర్ సవేరి (వెంకటేష్ కాకుమాను) కూడా వస్తాడు. రవి ఇంటికి సమీపంలోని దెయ్యాల మిట్టలో ఏ ఆడ దెయ్యం లేదని వీడియో చేయడానికి వచ్చిన సవేరికి దెయ్యం కనిపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రవి ఇంటికి వస్తాడు. వాళ్ళ వెనుక ప్రకాష్ (రవి వర్మ) వస్తాడు. 


మాయ తనను వెంటాడుతూ వచ్చిన దెయ్యం అని సవేరి భయపడతాడు. ఆమె దెయ్యం కాదని రవి చెబుతాడు. నిజంగా మాయ దెయ్యమా? లేదంటే అసలు దెయ్యం వేరొకరు ఉన్నారా? రవి భార్య సంధ్యను అసలు ఎవరైనా చూశారా? లేదా? ఆ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయనేది నిజమా? అబద్ధమా? - ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే 'అతిథి' వెబ్ సిరీస్ చూడాలి. 


విశ్లేషణ (Athidhi Web Series Review) : మనుషులను భయపెట్టే వాటిగా మెజారిటీ సిరీస్, సినిమాల్లో ఆత్మలు, దెయ్యాలను చూపించారు. 'ఆనందో బ్రహ్మ' డిఫరెంట్ అనుకోండి! అందులో మనుషులను చూసి దెయ్యాలు భయపడతాయి. బేసిగ్గా దెయ్యాలు అంటే బ్యాడ్ అన్నట్టు స్క్రీన్ మీద ప్రాజెక్ట్ అయ్యింది. బట్, ఫర్ ఏ ఛేంజ్... మంచి దెయ్యాలు కూడా ఉంటాయనే కాన్సెప్ట్‌తో తీసిన సిరీస్ 'అతిథి'. 


'అతిథి'లో దెయ్యం మంచిది అని చెప్పడం మినహా కథ, కథనాల గురించి ఎక్కువ రివీల్ చేయలేం. ఒకవేళ చేస్తే... కథ మొత్తం తెలిసే అవకాశం ఉంది. వెబ్ సిరీస్ చూడాలని ఆశపడే వాళ్ళకు స్పాయిలర్స్ ఇచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ చెడగొట్టినట్లు అవుతుంది. అలాగని... దర్శక, రచయిత భరత్ కొత్తగా ఏమీ తీయలేదు.


'అతిథి'ని దర్శకుడు భరత్ ఆసక్తికరంగా ప్రారంభించారు. మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ కథపై క్యూరియాసిటీ కలిగించాయి. తర్వాత ఆ క్యూరియాసిటీ కంటిన్యూ కాలేదు. అందుకు కారణం... మంచి దెయ్యం కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ కథనం, సన్నివేశాలు ఆసక్తిగా లేవు. థ్రిల్స్ అనేది అసలు లేవు. హారర్ సిరీస్, సినిమాల్లో లాజిక్కులు వెతక్కూడదని వేణుతో ఓ డైలాగ్ చెప్పించారు. మరీ ట్విస్టులు ఊహించేలా ఉంటే కష్టమే. మేజర్ ట్విస్ట్ రివీల్ అయ్యాక... తెలుగు, హిందీలో వచ్చిన కొన్ని సినిమాలు కూడా గుర్తుకు వస్తాయి. అసలు కథ కంటే మధ్యలో వచ్చిన రెండు కొసరు కథలు బావున్నాయ్!


కథనం పరంగా 'అతిథి'లో కొత్తదనం ఏమీ లేదు. కథగా చూసినా... మంచి దెయ్యం కాన్సెప్ట్, చివరిలో ఇచ్చిన సందేశం తప్ప ఏమీ లేదు. స్టార్టింగ్ సీన్స్, ఎపిసోడ్స్ బాగా డీల్ చేశారు భరత్. ప్రవీణ్ సత్తారు ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. వేణు హౌస్ సెట్ బావుంది. చివరిలో మహారాజు సన్నివేశాలకు వచ్చేసరికి రాజీ పడ్డారు. అక్కడ మరింత జాగ్రత్త  వహించాల్సింది. సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. 


నటీనటులు ఎలా చేశారంటే : వేణు తొట్టెంపూడి కామ్ & కంపోజ్డ్‌గా నటించారు. ఓ అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు... హీరో రవి పాత్రను దాటి! ఆయన యాక్టింగ్ సింపుల్‌గా ఉంది. ఆ పాత్రకు కావాల్సింది కూడా అదే! ముఖ్యంగా 'అతిథి'కి ఆయన రూపం ప్లస్ అయ్యింది. సంధ్య పాత్ర పరిధి మేరకు అదితి గౌతమ్ (Aditi Gautam) నటించారు. కొత్తగా ఏమీ చేయలేదు.  


మాయ పాత్రలో అవంతిక ఆకట్టుకున్నారు. అందంతో మాయ చేసే మహిళగా తొలి, మలి ఎపిసోడ్లలో కనిపించారు. ఆ తర్వాత అభినయంతోనూ మెప్పించారు. రవి వర్మకు ఇటువంటి క్యారెక్టర్ చేయడం కొత్త ఏమీ కాదు. వెంకటేష్ కాకుమానుకు కాస్త నిడివి ఎక్కువ ఉన్న క్యారెక్టర్ లభించింది. అందులో ఆయన ఓకే. భద్రమ్ పాత్రకు ఉన్న స్కోప్ తక్కువ. ఆయనకు నవ్వించే అవకాశం రాలేదు.  


Also Read : 'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?


చివరగా చెప్పేది ఏంటంటే : రెగ్యులర్ హారర్ సిరీస్‌లకు కాస్త డిఫరెంట్ 'అతిథి'. థ్రిల్స్ & హారర్ మూమెంట్స్ తక్కువ. కానీ, ఎంగేజ్ చేసే ఎపిసోడ్స్, సన్నివేశాలు ఉన్నాయి. నటీనటుల్లో వేణు తొట్టెంపూడి, అవంతిక, వెంకటేష్ కాకుమానుల  నటన, ఆ పాత్రలు గుర్తు ఉంటాయి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా స్టార్ట్ చేస్తే... నిదానంగా చూడవచ్చు.


Also Read 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial