సినిమా రివ్యూ : మార్క్ ఆంటోనీ
రేటింగ్ : 2.5/5
నటీనటులు : విశాల్, ఎస్.జె. సూర్య, రీతూ వర్మ, సునీల్, సెల్వ రాఘవన్, కార్తీ, అభినయ, రిడిన్ కింగ్ స్లే, వైజీ మహేంద్రన్ తదితరులు
ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజం
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత : ఎస్. వినోద్ కుమార్
రచయిత, దర్శకుడు : ఆధిక్ రవిచంద్రన్
విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2023


విశాల్ (Vishal), ఎస్.జె. సూర్య నటించిన టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ సినిమా 'మార్క్ ఆంటోనీ' (Mark Antony Movie). ఇటీవల ఈ జానర్ సినిమాలు తీసే దర్శక, రచయితలు పెరుగుతున్నారు. తమిళ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ రెట్రో నేపథ్యంలో 'మార్క్ ఆంటోనీ' తీశారు. ఇంతకు ముందు శింబుతో 'ఎఎఎ', ప్రభుదేవా హీరోగా 'భగీర' తీశారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. మరి, సినిమా  (Mark Antony Review) ఎలా ఉంది?


కథ (Mark Antony Story) : ఆంటోనీ (విశాల్), జాకీ మార్తాండ (ఎస్.జె. సూర్య) ప్రాణ స్నేహితులు, గ్యాంగ్‌స్టర్స్! ఆంటోనీ మరణించగా... ఆయన కుమారుడు మార్క్ (విశాల్)ను జాకీ కన్నకొడుకులా పెంచుతాడు. అయితే... తల్లికి ఇచ్చిన మాట కోసం మార్క్ కత్తులు, తుపాకులు పట్టకుండా మెకానిక్ అవుతాడు. తల్లిని చంపిన తండ్రి మీద పగ పెంచుకుంటాడు. టైమ్ ట్రావెల్ చేసి గతానికి ఫోన్ చేసి చరిత్రను తిరగ రాసే ఫోను మార్క్ చెంతకు వస్తుంది. ఆ ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడిన మార్క్ ఏం నిజం తెలుసుకున్నాడు? మరణించిన ఆంటోనీ మళ్ళీ ఎలా బతికాడు? బతికున్న జాకీ ఎలా చచ్చాడు? ఇద్దరూ మళ్ళీ మళ్ళీ ఎలా చచ్చి బతికారు? ఈ కథలో సిల్క్ స్మిత, ఏకాంబరం (సునీల్), రమ్య (రీతూ వర్మ), వేదవల్లి (అభినయ) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Mark Antony Review) : టైమ్ ట్రావెల్,సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో టిపికల్ స్క్రీన్ ప్లే, మెదడుకు పని కల్పించే సన్నివేశాలు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యి థియేటర్లకు వస్తున్నాయి. అయితే... 'మార్క్ ఆంటోనీ'లో అటువంటి సన్నివేశాలు ఏమీ లేవు. టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను కామెడీ కోసమే దర్శకుడు ఎక్కువ ఉపయోగించుకున్నారు.


'మార్క్ ఆంటోనీ' ప్రారంభమైన కాసేపటికి కథను, కథనాన్ని కామెడీ & ఎస్.జె. సూర్య టేకోవర్ చేసేశారు. ఆయన స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ సన్నివేశాల్లో ఫన్ వర్కవుట్ అయ్యింది. పంచ్ డైలాగ్స్ పేలాయి. ఇంటర్వెల్ వరకు విశాల్, ఎస్.జె. సూర్య కాంబినేషన్ సీన్స్ కూడా బావున్నాయి. కామెడీకి తోడు జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం తోడు కావడంతో ప్రేక్షకులు ఆంటోనీ ప్రపంచంలోకి వెళతారు. కొంత వరకు ట్రావెల్ చేస్తారు. సినిమా సరదాగా ముందుకు వెళుతుంది. విశ్రాంతి తర్వాత బండి చాలా భారంగా ముందుకు వెళుతుంది.


టైమ్ ట్రావెల్ జానర్ మూవీస్ అంటే రిపీట్ సీన్స్ ఉండటం సహజం! ఇంటర్వెల్ తర్వాత 'మార్క్ ఆంటోనీ'లో రిపీట్ సీన్స్ మరీ ఎక్కువ అయ్యాయి. కథ ఎంతకూ ముందుకు కదలదు. కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ తగ్గి... కన్‌ఫ్యూజన్ స్టేజి స్టార్ట్ అవుతుంది. చివరకు వచ్చేసరికి ముగింపు కోసం ఎదురు చూసేలా చేశారు. అసలు కథకు రీతూ వర్మతో ప్రేమకథలు అడ్డు తగిలాయి. 


జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం సినిమా ప్రారంభం నుంచి డామినేట్ చేసింది. రెట్రో థీమ్ రీ రికార్డింగ్ బాగా చేశారు. అయితే... చివరకు వచ్చేసరికి ఆ నేపథ్య సంగీతం కూడా రొటీన్ అనిపించింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. యాక్షన్ సీన్లు రొటీన్ అనిపించాయి.   


నటీనటులు ఎలా చేశారంటే : 'మార్క్ ఆంటోనీ' టైటిల్స్‌లో 'నట రాక్షసుడు' అని ఎస్.జె. సూర్యను పరిచయం చేశారు. స్క్రీన్ మీద ఆయనను చూస్తే నిజంగా నట రాక్షసుడు అనిపిస్తుంది. ఆయన బాడీలో ఒక గ్రేస్, రిథమ్ ఉన్నాయి. డాన్ జాకీగా, డాన్ కుమారుడు మార్తాండ్... రెండు పాత్రల్లో ఇరగదీశారు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో నవ్వించారు. నటుడిగానూ మెప్పిస్తారు. 


విశాల్ లుక్ ప్రతి సినిమాలోనూ ఒకేలా ఉంటుందని, ఆయన నటన ఒకే విధంగా ఉంటుందని కొందరు విమర్శలు చేస్తుంటారు. 'మార్క్ ఆంటోనీ'లో ఆ విశాల్ కనిపించలేదు. లుక్ మారింది. రెండు పాత్రల మధ్య వ్యత్యాసం చూపించారు. క్లైమాక్స్‌లో అయితే గుండుతో కనిపించారు. నటుడిగానూ ఆకట్టుకుంటారు. సునీల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయన రోల్ వచ్చి వెళుతూ ఉంటుంది. అభినయ మరోసారి అభినయంతో మెప్పించారు. 


టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త పాత్రలో సెల్వ రాఘవన్ గెటప్, ఆయన నటన ఓకే. పోస్టర్స్ మీద సిల్క్ స్మిత ఫోటో వేసి హీరోయిన్ రీతూ వర్మ ఫోటో మాయం చేసినప్పుడే అర్థం చేసుకోవాలి. సినిమాలో కథానాయిక పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం లేదని! మధ్య మధ్యలో మెరుపు తీగలా తళుక్కుమని మెరిసి మాయం అవుతూ ఉండే పాత్ర ఆమెది. వైజీ మహేంద్రన్ పాత్ర వెగటు పుట్టించింది. రీడిన్ కింగ్ స్లే క్యారెక్టర్ కామెడీ చేయడంలో ఫెయిల్ అయ్యింది. 


Also Read : ఛాంగురే బంగారు రాజా రివ్యూ: రవితేజ నిర్మించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?


చివరగా చెప్పేది ఏంటంటే : టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తీసిన ఫిల్మ్ 'మార్క్ ఆంటోనీ'. సరదాగా సాగే ఫస్టాఫ్... తెరపై ఏం చేస్తున్నామో తెలియకుండా కన్‌ఫ్యూజ్ చేసే సెకండాఫ్... కథను డామినేట్ చేసిన ఎస్.జె. సూర్య నటన... ఓ రోలర్ కోస్టర్ రైడింగ్ ఫీల్ ఇస్తుందీ సినిమా. నటుడిగా విశాల్ వైవిధ్యం ఒప్పించారు. కొంత వరకు కామెడీ నవ్విస్తుంది. కాసేపు నవ్వుకోవడానికి, ఎస్.జె. సూర్య నటన కోసం అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళండి. 


Also Read : 'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial