సినిమా రివ్యూ : చంద్రముఖి 2
రేటింగ్ : 2.5/5
నటీనటులు : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు
ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుబాస్కరన్
రచయిత, దర్శకుడు : పి.వాసు
విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023
రాఘవ లారెన్స్ (Raghava Lawrence), పి.వాసు (P.Vasu) కాంబినేషన్‌లో తెరకెక్కిన హార్రర్ కామెడీ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). 2004లో విడుదల అయి తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘చంద్రముఖి (Chandramukhi)’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించగా, సీక్వెల్‌లో హార్రర్ సినిమాల స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ కనిపించనున్నారు. ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ (Kangana Ranaut) టైటిల్ రోల్‌లో నటించారు. ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Chandramukhi 2 Story): రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. కానీ ఉన్నట్టుండి వారి కుటుంబానికి సమస్యలు చుట్టుముడతాయి. కుటుంబం మొత్తం వారి కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (2005లో మొదటి చంద్రముఖి సినిమా కథ జరిగిన ఇల్లు) ఉంటుంది. ఆ సంఘటన తర్వాత కైలాష్ (మొదటి చంద్రముఖిలో ప్రభు) కుటుంబం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంటి మొత్తానికి ఓనర్ గా బసవయ్య (వడివేలు) ఉంటాడు. రంగనాయకి కుటుంబాన్ని ఇంట్లో దక్షిణం వైపు వెళ్లవద్దని బసవయ్య వారిస్తాడు. కానీ కొందరు వినకుండా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో వేటయ్య రాజు/సెంగోటయ్య (ఇంకో రాఘవ లారెన్స్) పాత్ర ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ (Chandramukhi 2 Review): హార్రర్ జోనర్ సినిమాల్లో ‘చంద్రముఖి’ ఒక క్లాసిక్. ఒక హార్రర్ సినిమా సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం అనేది అదే మొదలు, అదే చివర కూడా. రజనీకాంత్ లాంటి మాస్ హీరో తన ఇమేజ్‌కి భిన్నమైన పాత్ర పోషించడం అప్పటి ‘చంద్రముఖి’ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్. ఒక సూపర్ స్టార్‌ని అలాంటి పాత్రలో చూడటం అప్పటికి చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ ‘చంద్రముఖి 2’లో ఆ ఫ్రెష్ నెస్ లోపించింది. ఎందుకంటే హార్రర్ కామెడీ సినిమాలకి రాఘవ లారెన్స్ పెట్టింది పేరు. ‘ముని’ దగ్గర నుంచి రాఘవ లారెన్స్‌కు వచ్చిన హిట్‌లన్నీ దాదాపు హార్రర్ కామెడీవే. అంతే కాకుండా రాఘవ లారెన్స్ హార్రర్ సినిమాలకి, ‘చంద్రముఖి’కి నక్కకి, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కానీ ‘చంద్రముఖి 2’ని రెండిటికీ మధ్యలో తీసే ప్రయత్నం చేశారు. అది కొంత వరకు వర్కవుట్ అయింది కూడా.
ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, పాత్రలు అన్నిటి విషయంలో ‘చంద్రముఖి’ని యాజిటీజ్‌గా ఫాలో అయ్యారు. మొదటి భాగంలో జ్యోతిక పాత్రను చంద్రముఖి ఆత్మ పీడిస్తున్నది అని తెలియడంలో కాస్త థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ వర్కవుట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో మొదటి సీన్ చూడగానే ఈసారి చంద్రముఖి ఎవరిని పడుతుందో ఈజీగా గెస్ చేసేయచ్చు. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, వెంటనే మహల్‌కు వచ్చేటప్పుడు పాట, ఈ కుటుంబం దగ్గర అవమానాలు ఎదుర్కోవడం, ప్యాలెస్ పక్కన ఉండే పేద వాడి ఇంట్లో ఉండే అమ్మాయిని హీరో ఇష్టపడటం, ఆ అమ్మాయి ప్యాలెస్‌లో తిరుగుతూ దెయ్యం పట్టినట్లు బిల్డప్ ఇవ్వడం ఇవన్నీ సేమ్ టు సేమ్ మొదటి ‘చంద్రముఖి’లానే ఉంటుంది. మొదటి భాగం స్క్రిప్టు పక్కన పెట్టుకుని పాత్రలను మాత్రమే రీప్లేస్ చేసినట్లు అది మన తప్పు కాదు. రచయత, దర్శకుల గొప్పతనం. స్క్రీన్ ప్లే పరంగా ఈ భాగంలో చేసిన మార్పులేమైనా ఉన్నాయా అంటే మొదటి భాగంలో ఉండే రాజు పాత్ర ఆత్మను తీసుకురావడం, చంద్రముఖి పట్టిన పాత్రను ఇంటర్వల్‌కు పరిచయం చేయడం, ఫ్లాష్‌బ్యాక్‌ను మార్చి నిడివి పెంచడం కేవలం ఇవి మాత్రమే.
సినిమా ప్రారంభంలో రాఘవ లారెన్స్ యాక్షన్ ఎపిసోడ్ కాస్త భయపెట్టినా తర్వాత మళ్లీ అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ప్రథమార్థంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. వడివేలు కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్‌లో రాఘవ లారెన్స్ దయ్యాల్లోని రకాల గురించి వడివేలుకు ఎక్స్‌ప్లెయిన్ చేసే సీన్ దాదాపు ఐదు నుంచి 10 నిమిషాల మధ్యలో ఉంటుంది. మల్లీశ్వరిలో వెంకటేష్, సునీల్‌కు కథ చెప్పే ఎపిసోడ్‌ను ఇది గుర్తు చేస్తుంది. కానీ ఈ సీన్ నవ్వించకపోగా విసిగిస్తుంది.
అలాగే మొదటి భాగంలో ఉన్న పెయింటర్, దొంగ స్వామీజీలుగా వచ్చే మనోబాల పాత్రలను ఇందులో కూడా రిపీట్ చేశారు. ఈ రెండు పాత్రలూ ఒకే సీన్‌లోనే వచ్చినా నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను ఇవ్వవు, నవ్వించవు, భయపెట్టవు. ఉన్నాయంటే ఉన్నాయంతే. ఇంటర్వెల్ వైపు సాగే కొద్దీ కథనంలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వర్కవుట్ అవుతుంది. అక్కడ వచ్చే ట్విస్ట్‌ని ముందే గెస్ చేయగలిగినా... ఆ పాత్రలోని నటి పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తారు.
సెకండాఫ్ ప్రారంభంలో మళ్లీ గ్రాఫ్ కిందకి వచ్చేస్తుంది. రాఘవ లారెన్స్, మహిమా నంబియార్‌ల లవ్ ట్రాక్, పాటలు విసిగిస్తాయి. మొదటి భాగంలో రజనీకాంత్, నయనతారల ట్రాక్ తరహాలో నడిపిద్దాం అనుకున్నా కానీ అది సరిగ్గా వర్కవుట్ అవ్వలేదు. ఎప్పుడైతే వేటయ్య రాజు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందో అక్కడ నుంచి మెల్లగా వేగం పుంజుకుంటుంది. ‘చంద్రముఖి’ మొదటి భాగంలో ఉండే ఫ్లాష్‌బ్యాక్‌కి కొత్త కోణం అద్ది చూపిద్దాం అనుకున్నారు. కానీ అది సినిమా లెంత్‌ను కూడా పెంచేసింది. ఫ్లాష్‌బ్యాక్‌లో పెద్దగా పస లేకపోయినా పర్లేదనిపించిందంటే దానికి రాఘవ లారెన్స్, కంగనా రనౌత్‌ల పెర్ఫార్మెన్స్ కారణం. క్లైమ్యాక్స్‌ను మళ్లీ మొదటి భాగం తరహాలోనే ముగించారు. చివర్లో ‘చంద్రముఖి 3’కి ఇచ్చిన లీడ్ మరీ సిల్లీగా అనిపిస్తుంది.
ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం.కీరవాణి బాగానే ఉన్నా... పాటలు కానీ, నేపథ్య సంగీతం కానీ తన స్థాయికి తగ్గట్లు లేవు. సెకండాఫ్‌లో కంగనా రనౌత్ ఇంట్రడక్షన్ సాంగ్ మెప్పిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వార్ సీన్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాహుబలిని గుర్తు చేస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... రాఘవ లారెన్స్‌కు ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. 2007లో వచ్చిన ‘ముని’ దగ్గర నుంచి లారెన్స్ ఇలాంటి పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. కానీ పీరియాడిక్ పోర్షన్‌లో వచ్చిన వేటయ్య రాజు/సెంగోటయ్య పాత్ర తనకు పూర్తిగా కొత్త. ఈ పాత్రలో తన నటన అద్బుతం అని చెప్పవచ్చు. కంగనా రనౌత్ కూడా చంద్రముఖి పాత్రలో అలరిస్తుంది. చంద్రముఖి ఆత్మ పట్టిన పాత్ర పోషించిన నటి మొదట్లో ఆకట్టుకున్నా... తర్వాత తన నటన అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. మిగతా పాత్రలందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్
ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘చంద్రముఖి’ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక సాధారణ హార్రర్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్‌తో వెళ్తే ‘చంద్రముఖి 2’ ఒకసారి చూడవచ్చు. మొదటి భాగం స్థాయిలో అంచనాలు పెట్టుకుంటే మాత్రం నిరాశ పడతారు. సీక్వెల్ అంటే మొదటి భాగాన్ని కొనసాగించాలి కానీ దాన్నే వేరే నటులతో తీయడం కాదు కదా అనే ఆలోచన కూడా వస్తుంది. ‘చంద్రముఖి 2’ హిట్ అయితే ‘చంద్రముఖి 3’ రజనీతో మళ్లీ చేస్తామని పి.వాసు చెప్పారు. మరి ఈ సినిమా చూశాక రజనీ ఆ సాహసం చేస్తారో లేదో చూడాలి మరి!
Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial