సినిమా రివ్యూ : గుడ్ బై 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, రష్మికా మందన్నా, పావైల్ గులాటీ, ఎలీ అవ్రామ్‌, ఆశిష్ విద్యార్ధి త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : సుధాకర్ రెడ్డి యక్కంటి 
సంగీతం: అమిత్ త్రివేది
నిర్మాతలు : ఏక్తా కపూర్, శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బెహల్ 
రచన, దర్శకత్వం : వికాస్ బెహల్
విడుదల తేదీ: అక్టోబర్ 7, 2022


తెలుగులో రష్మికా మందన్నా (Rashmika Mandanna) స్టార్ హీరోయిన్. తమిళ సినిమాలూ చేస్తున్నారు. ఇప్పుడు హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆమె నటించిన తొలి హిందీ సినిమా 'గుడ్ బై' (GoodBye Movie). ఇందులో ఆమెకు తండ్రిగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), తల్లి పాత్రలో నీనా గుప్తా నటించారు. నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది (GoodBye Review)?   


కథ (GoodBye Movie Story) : గాయత్రి (నీనా గుప్తా) హార్ట్ ఎటాక్ రావడంతో కన్ను మూస్తుంది. ఆమె భర్త హరీష్ (అమితాబ్ బచ్చన్) ఈ విషయం చెప్పాలని కుమార్తె తారా (రష్మిక)కు ఫోన్ చేస్తాడు. ఆమె లాయర్. కేసు గెలిచిన ఆనందంలో రాత్రంతా పార్టీ చేసుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయదు. రెండో రోజు లిఫ్ట్ చేశాక... ముంబై నుంచి చండీగఢ్ బయలుదేరుతుంది. హరీష్, గాయత్రి దంపతుల కుమారుడు నకుల్ (అభిషేక్ ఖాన్) ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. అసలు కలవదు. మరో కుమారుడు, కోడలు అమెరికా నుంచి వస్తారు. ఇంకో కుమారుడు దుబాయ్ నుంచి వస్తారు. గాయత్రి మరణం నుంచి అంత్యక్రియలు జరిగే వరకు ఏం జరిగింది? కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? చివరకు, ఎవరెవరు ఏ విధంగా మారారు? అనేది సినిమా.
 
విశ్లేషణ (GoodBye Review In Telugu) : సాయి ధరమ్ తేజ్, మారుతి చేసిన 'ప్రతి రోజూ పండగే' చూశారా? 'గుడ్ బై' చూస్తుంటే... మధ్య మధ్యలో ఆ సినిమా గుర్తుకు వస్తుంది. అవును... ఇది నిజం! ఎందుకంటే... కథా నేపథ్యం ఒక్కటే. అయితే... కథ, క్యారెక్టర్ల పరంగా కొంత వ్యత్యాసం ఉంది. కొన్ని సన్నివేశాల్లో సారూప్యతలు కనిపిస్తాయి. ముఖ్యంగా పెద్ద కుమారుడి క్యారెక్టరైజేషన్ విషయంలో! 'ప్రతి రోజూ పండగే'లో సత్యరాజ్ మరణించలేదు. 'గుడ్ బై'లో నీనా గుప్తా మరణించారు. ఈ కంపేరిజన్ పక్కన పెట్టి హిందీ సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళితే... 


'గుడ్ బై' సినిమాలో చెప్పింది కథ కాదు... జీవిత సత్యం! మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషి మరణించిన తర్వాత మిగతా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది రెండున్నర గంటల్లో క్లుప్తంగా చూపించారు. ఈ తరం యువతీయువకులు బంధాలు, బంధుత్వాల విషయంలో ఎలా ఉంటున్నారనేది చూపించారు. ఫ్లైట్ ఆలస్యం అయ్యిందని బటర్ చికెన్, నాన్స్ ఆర్డర్ చేసుకున్న కుమారుడితో బీర్ కూడా ఆర్డర్ చేసుకోమని తండ్రి కోప్పడటం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  


చివరి చూపు చూడటానికి వచ్చిన కాలనీలో మహిళలు, వాట్సాప్ గ్రూప్ పేరు ఏం పెడితే బావుంటుందని డిస్కస్ చేసుకోవడం దగ్గర నుంచి శ్మశాన వాటిక దగ్గర సెల్ఫీలు దిగడం వరకు... కొన్ని సన్నివేశాలను మన సమాజంలో ఎక్కడో ఒక చోట చూసినట్టు ఉంటాయి. అంత్యక్రియలు పూర్తైన రాత్రి భార్యతో ఏకాంతంలో ఉన్న కుమారుడితో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన మాటలు వింటే... 'యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు' అంటూ 'ప్రతి రోజూ పండగే'లో భద్రంతో రావు రమేశ్ అన్న మాటలు తెలుగు ప్రేక్షకులకు గుర్తు రావచ్చు.  


'గుడ్ బై' ఫ‌స్టాఫ్‌లో ఎమోషన్స్ అండ్ హ్యూమర్‌ను దర్శకుడు వికాస్ బహల్ బాగా హ్యాండిల్ చేశారు. ఓ క్షణం నవ్విస్తే... మరుక్షణం కంటతడి పెట్టించారు. శ్మశాన వాటికకు వెళ్ళడానికి అమెరికన్ కోడలు బ్లాక్ డ్రస్ వేసుకుని రావడం వంటి సన్నివేశాలు నవ్వించాయి. సెకండాఫ్‌లో కథ అక్కడక్కడే తిరుగుతుంది. దానికి తోడు ముగింపు ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సన్నివేశాల్లో డ్రామా ఎక్కువైంది. ఎమోషన్స్, హ్యూమర్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.  


రైటింగ్ పరంగా దర్శకుడు వికాస్ బెహల్ చేసిన తప్పులు కొన్నిటిని తమ నటనతో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, రష్మిక, పావైల్ గులాటీ, సునీల్ గ్రోవర్ తదితరులు కవర్ చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో అమితాబ్ అద్భుత అభినయం కనబరిచారు. రష్మిక రెగ్యులర్ హీరోయిన్ రోల్‌లో కాకుండా ఆర్టిస్టుగా కనిపించారు. తండ్రితో గొడవ పడే సన్నివేశాల్లోనూ, ఆ తర్వాత తండ్రికి దగ్గరైన సన్నివేశాల్లోనూ ఆమె నటన బావుంది. మోడ్రన్ అమ్మాయిగా చక్కగా చేశారు.    'గుడ్ బై' సినిమాలో సన్నివేశాలు ఎలా ఉన్నప్పటికీ... అమిత్ త్రివేది సంగీతం మన మనసుల్ని తాకుతుంది. కథను, కథలో ఆత్మను ఆయన అర్థం చేసుకున్నంతగా, మిగతా ఎవరూ అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. సుధాకర్ యక్కంటి సినిమాటోగ్రఫీ కూడా! టెక్నికల్‌గా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది.  


Also Read : 'స్వాతి ముత్యం' రివ్యూ : మండపంలో పెళ్లి ఆగితే అంత వినోదమా? బెల్లంకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'గుడ్ బై'లో మనసుకు తాకే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వినోదం కూడా ఉంది. అయితే... థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో వెలితి వెంటాడుతుంది. అప్పటి వరకు సంప్రదాయాలను పాటించడానికి సందేహించినా పిల్లల్లో ఒక్కసారి మార్పు రావడం ఆశ్చర్యంగా ఉంటుంది. కథను మరింత ఎఫెక్టివ్‌గా చెప్పాల్సిందేమోనని అనిపిస్తుంది. 'ప్రతి రోజూ పండగే' చూసిన తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించేది ఏమీ ఉండదు. అమితాబ్, రష్మిక, నీనా గుప్తాల నటన తప్ప! అందువల్ల, థియేటర్లకు వెళ్లాలనుకునే ప్రేక్షకులు ఒకసారి ఆలోచించుకోండి.  


Also Read : 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?