సినిమా రివ్యూ : గాడ్ ఫాదర్ 
రేటింగ్ : 3.25/5
నటీనటులు : చిరంజీవి, నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సముద్రఖని, అనసూయ, 'బిగ్ బాస్' దివి, బ్రహ్మాజీ త‌దిత‌రులు
మాటలు : లక్ష్మీ భూపాల్
ఛాయాగ్రహణం : నీరవ్ షా 
సంగీతం: ఎస్. తమన్ 
సమర్పణ : శ్రీమతి సురేఖ కొణిదెల
నిర్మాతలు : ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహన్ రాజా
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2022


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather Movie). దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? మోహన్ లాల్ 'లూసిఫర్' కథలో ఎటువంటి మార్పులు చేశారు? నయనతార (Nayanthara), సత్యదేవ్, సల్మాన్ ఖాన్ క్యారెక్టర్లు ఏ విధంగా ఉన్నాయి? మెగాస్టార్ ఖాతాలో మరో విజయం చేరిందా? లేదా? (Chiranjeevi Godfather Review)   


కథ (Godfather Movie Story) : ముఖ్యమంత్రి పీకేఆర్ ఆకస్మిక మరణంతో ఆయన అల్లుడు జయదేవ్ (సత్యదేవ్) సీఎం కావాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. సీఎం  కాకముందు డబ్బు కోసం డ్రగ్ మాఫియాతో డీల్ సెట్ చేసుకుంటాడు. డ్రగ్స్ అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతి ఇస్తానని చెబుతాడు. జయదేవ్ ప్రయత్నాలకు బ్రహ్మ (చిరంజీవి) అడ్డుపడతాడు. అతడు అంటే పీకేఆర్ పెద్ద కుమార్తె, జయదేవ్ భార్య సత్య ప్రియ (నయనతార) కు ఎందుకు పడదు? వాళ్లిద్దరి మధ్య గొడవ ఏంటి? జయదేవ్ చేతుల్లోకి పీకేఆర్ పార్టీ, ముఖ్యమంత్రి పదవి, రాష్ట్రం వెళ్లకుండా బ్రహ్మ ఏం చేశాడు? ఇంటర్ పోల్ వెతుకుతున్న ఇంటర్నేషనల్ డాన్ అబ్రహం ఖురేషి ఎవరు? చివరకు, ఏమైంది? అనేది సినిమా.


విశ్లేషణ (Godfather Telugu Movie Review) : 'గాడ్ ఫాదర్' చూడటానికి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులలో రెండు రకాలు ఉంటారు. ఒకటి... ఆల్రెడీ 'లూసిఫర్' చూసిన వాళ్ళు. రెండు... ఆ సినిమా చూడని వాళ్ళు. 


'లూసిఫర్' చూసిన వాళ్ళకు కథ, కథలో మలుపులు, పాత్రలు కొంత వరకు తెలుసు. కొంత వరకు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందటే... 'లూసిఫర్'లో కొన్ని క్యారెక్టర్లను 'గాడ్ ఫాదర్'లో తీసేశారు. కొత్త క్యారెక్టర్లు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా హీరో క్యారెక్టర్ పుట్టుకలో ఓ మార్పు చేశారు. మలయాళ సినిమాలో కథ, సన్నివేశాలను కాపీ పేస్ట్ చేయకుండా... చాలా మార్పులు చేశారు. ముఖ్యమైన అంశాల్లో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. హీరో క్యారెక్టరైజేషన్‌ను మాసీగా మార్చారు. అయితే, కథలో ఆత్మను ఏమాత్రం చెడగొట్టకుండా ఆ మార్పులు చేసినందుకు దర్శకుడు మోహన్ రాజా, రచయితలు, నిర్మాతలను మెచ్చుకోవాలి. అయితే... కొన్ని సీన్లు, డైలాగుల విషయంలో ఉన్నది ఉన్నట్టు ఫాలో అయిపోయారు. 


'లూసిఫర్' చూడని వాళ్ళకు 'గాడ్ ఫాదర్' నచ్చుతుంది. అందులో నో డౌట్! ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మెగాస్టార్ మాస్ మేనరిజమ్స్, ఆ ఆరా కంటిన్యూ అయ్యింది. పాటల కంటే తమన్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. చిరంజీవి సన్నివేశాలను ఆయన ఇచ్చిన రీ రికార్డింగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. పాటలు మాత్రం సోసోగా ఉన్నాయి. 'నజభజ జజర' ఫైట్ రీ రికార్డింగ్‌లో ఉపయోగించారు. క్లైమాక్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది. అప్పటి వరకు చూపించిన హీరోయిజానికి ఆ క్లైమాక్స్ వీక్ అనిపిస్తుంది. 
 
చిరంజీవి, నయనతార మధ్య ఎమోషనల్ సీన్ తీసిన విధానం బావుంది. మలయాళ సినిమాతో పోలిస్తే బాగా తీశారని చెప్పవచ్చు. సునీల్ పాత్రలో చేసిన మార్పులు బావున్నాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బావుంది. లక్ష్మీ భూపాల్ రాసిన డైలాగులు మెగా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో డైలాగులు ప్రస్తుత రాజకీయాలకు అన్వయించే విధంగా ఉన్నాయి.
 
నటీనటులు ఎలా చేశారు? : చిరంజీవికి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సూట్ అయ్యింది. మాసీగా, ఎట్ ద సేమ్ టైమ్ క్లాసీగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో సెటిల్డ్‌గా చేశారు. అయితే... వాటిలోనూ హీరోయిజం ఉంది. ఉదాహరణకు... హీరో పరిచయ సన్నివేశం! సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చిరంజీవి సోదరిగా ఆ పాత్రకు నయనతార హుందాతనం తీసుకొచ్చారు. క్యారెక్టర్ పరంగా సత్యదేవ్ అద్భుతంగా నటించారు. మరోసారి ఆయనకు వాయిస్ ప్లస్ అయ్యింది. చిరంజీవితో కాంబినేషన్ సన్నివేశాల్లో సత్యదేవ్ చక్కటి నటన కనబరిచారు. మెగాస్టార్ ముందు నటనతో నిలబడటం మామూలు విషయం కాదు. సినిమా ప్రారంభంలో చిరంజీవికి ధీటైన విలన్ సత్యదేవ్ ఏంటి? అనుకున్నా... చివరకు వచ్చేసరికి ఆ డౌట్ రాదు. మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, తాన్యా రవిచంద్రన్, అనసూయ, భరత్ రెడ్డి, సముద్రఖని, గెటప్ శీను తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.


లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇంటర్వెల్ ముందు తళుక్కుమని మెరిసి, మళ్ళీ పతాక సన్నివేశాల్లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాసేపు సందడి చేశారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ బావుంటుంది. 


Also Read : 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : మెగాస్టార్ మాస్ ఫీస్ట్ 'గాడ్ ఫాదర్'. మెగాభిమానులు కోరుకునే డైలాగ్స్, ఫైట్స్, మాస్ మూమెంట్స్‌తో మోహన్ రాజా సినిమా తీశారు. చిరంజీవి కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు ఆయన శాటిస్‌ఫై చేస్తారు. మెగాస్టార్ మరోసారి తనదైన శైలి నటనతో, డైలాగ్ డెలివరీతో ఎంట‌ర్‌టైన్ చేస్తారు. 'లూసిఫర్' చూసిన వాళ్ళకు... కథలో, క్యారెక్టర్ల ప్రవర్తనలో చేసిన మార్పులు కొంత స‌ర్‌ప్రైజ్‌ చేస్తాయి. రీమేక్‌లో భలే మార్పులు చేశారని అనిపిస్తుంది. 'లూసిఫర్' కథను ఫాలో అయితే తీసిన సినిమా అయితే... 'గాడ్ ఫాదర్' హీరో ఇమేజ్ బేస్ చేసుకుని తీసిన కమర్షియల్ సినిమా. ముఖ్యంగా కొన్ని డైలాగులు థియేటర్లలో పేలతాయి. 


Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?