సినిమా రివ్యూ : నేనే వస్తున్నా
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ధనుష్, ఎలీ అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, ప్రభు, యోగిబాబు, సెల్వరాఘవన్, షెల్లీ కిశోర్, శరవణ సుబ్బయ్య తదితరులు
కథ : సెల్వరాఘవన్, ధనుష్ 
ఛాయాగ్రహణం : ఓం ప్రకాశ్ 
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సమర్పణ : గీతా ఆర్ట్స్ (తెలుగులో)
నిర్మాత : కలైపులి ఎస్. థాను 
దర్శకత్వం : సెల్వరాఘవన్ 
విడుదల తేదీ: సెప్టెంబర్ 29, 2022


'నేనే వస్తున్నా' (Nene Vasthunna Movie) చిత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అన్నదమ్ములు సెల్వ రాఘవన్, ధనుష్ (Dhanush) కలయికలో పదకొండేళ్ల విరామం తర్వాత వస్తున్న చిత్రమిది. సెల్వ రాఘవన్‌తో కలిసి ధనుష్ కథ రాసిన చిత్రమిది. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? 


కథ (Nene Vasthunna Story) : ప్రభు (ధనుష్) ది హ్యాపీ ఫ్యామిలీ. అతడిని చూసి తోటి ఉద్యోగి గుణ (యోగిబాబు) అసూయ పడతాడు. మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య, దేవత లాంటి కుమార్తె ఉందని చెబుతాడు. అటువంటి ప్రభు ఫ్యామిలీలో పెను తుఫాను వస్తుంది. అమ్మాయిని దెయ్యం ఆవహిస్తుంది. తన తండ్రి కథిర్‌ను చంపితేనే అమ్మాయిని వదిలి పెడతానని దెయ్యం చెబుతుంది. ఆ కథిర్ ఎవరో కాదు... ప్రభు కవల సోదరుడు. కవలలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు? వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? కన్న కుమార్తె కోసం అన్నయ్యను ప్రభు చంపాడా? లేదా? అసలు, ఈ అన్నదమ్ముల కథేంటి? అనేది మిగతా సినిమా.  


విశ్లేషణ (Nene Vasthunna Telugu Movie Review) : కథపై నమ్మకంతో కొన్ని , కథనంపై నమ్మకంతో ఇంకొన్ని చిత్రాలు తెరకెక్కుతాయి. కథానాయకుడు, అతని క్యారెక్టరైజేషన్ మీద నమ్మకంతో కొన్ని సినిమాలు రూపొందుతాయి. ఆ కోవలోకి వచ్చే చిత్రమే 'నేనే వస్తున్నా'. ఇందులో హైలైట్ ఏదైనా ఉందంటే... ఇంటర్వెల్ తర్వాత వచ్చే క్యారెక్టర్, అందులో ధనుష్ నటన.


అన్నదమ్ములు ధనుష్, సెల్వ రాఘవన్ రాసుకున్న కథలో బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అంతకు మించి పాత్రల మధ్య సంఘర్షణ ఉంది. బాల్యం నుంచి తల్లి ప్రేమ, తండ్రి ఆదరణకు కరువైన ఓ చిన్నారి ఏ విధంగా మారాడు? ఏం చేశాడు? అనేది ఆసక్తి కలిగించే అంశమే. అయితే, ఆ ఆసక్తిని ప్రారంభం నుంచి ముగింపు వరకూ కొనసాగించడంలో దర్శకుడిగా సెల్వ రాఘవన్ సక్సెస్ కాలేదు. 
'నేనే వస్తున్నా' ఫస్టాఫ్‌లో మెలో డ్రామా ఎక్కువ. మధ్యలో కథపై ఆసక్తి కలిగించే అంశాలు వస్తున్నప్పటికీ... వావ్ మూమెంట్స్ తక్కువ. అయితే... దర్శకుడిగా సెల్వ రాఘవన్ కొన్ని విషయాల్లో ప్రతిభ చూపించారు. కొన్ని సీన్స్‌లో డీటైలింగ్ బావుంది. ఇంటర్వెల్‌కు ముందు ధనుష్ రెండో క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చి ఆసక్తి పెంచారు. కథిర్ పాత్ర పరిచయం కూడా బావుంది. అయితే, ఆ పాత్రలో సంఘర్షణను సరిగా ఆవిష్కరించలేదు. 


కథిర్‌గా ధనుష్ తెరపైకి వచ్చిన ప్రతిసారీ నటుడిగా ఇరగదీశాడు. సీన్, అందులో లాజిక్స్ మర్చిపోయేలా తన నటనతో మెస్మరైజ్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం, పాటలు కూడా కథిర్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బావుంది. కథకు అవసరమైన మూడ్, ఫీల్ తీసుకొచ్చేలా ఓం ప్రకాశ్ లైటింగ్, ఫ్రేమింగ్‌ ఉంటాయి. నిర్మాణ వ్యయం ఎక్కువ కాలేదని తెరపై సన్నివేశాలు చూస్తే తెలుస్తుంది. కథకు అవసరమైన మేరకు ఖర్చు చేశారు.


నటీనటులు ఎలా చేశారు? : ధనుష్ వన్ మ్యాన్ షో చేశారు. తండ్రి పాత్రలో చాలా చక్కటి భావోద్వేగాలు పలికించారు. ఆ పాత్ర, ఆ నటనలో స‌ర్‌ప్రైజ్‌ ఏమీ ఉండదు. కథిర్ పాత్రలో అయితే విశ్వరూపం చూపించారు. వేటగాడిగా, మనుషులను చంపే సన్నివేశాల్లో ధనుష్ నటన గగుర్పాటుకు గురి చేస్తుంది. హావభావాలు పలికించిన తీరు అంత త్వరగా మరువలేం. ధనుష్ తర్వాత స‌ర్‌ప్రైజ్‌ చేసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే... ఎలీ అవ్రామ్‌. మాటలు రాని మహిళగా కళ్ళతో హావభావాలు పలికించారు. హిందీ సినిమాల్లో మోడ్రన్ మహిళ క్యారెక్టర్లలో ఆమెను చూసిన ప్రేక్షకులకు, ఈ క్యారెక్టర్‌లో చూడటం కొత్తగా ఉంటుంది. యోగిబాబు కొన్ని సన్నివేశాల్లో నవ్వించే ప్రయత్నం చేశారు. ధనుష్ అమ్మాయిగా నటించిన చిన్నారి నటన బావుంది. ఇందుజా రవిచంద్రన్, సెల్వ రాఘవన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 


Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : నటుడిగా ధనుష్ మరోసారి మెరిశారు. అయితే... కథకుడిగా, దర్శకుడిగా సెల్వ రాఘవన్ ప్రభావం చూపించలేదు. కొన్ని సీన్స్ బాగా తీసినప్పటికీ... ఓవరాల్‌గా ఎంగేజ్ చేసింది తక్కువ. ధనుష్ కథిర్ క్యారెక్టర్ 'హై' ఇస్తుంది. కానీ, థియేటర్లలో ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టడానికి ఆ 'హై' ఒక్కటీ చాలదు. పతాక సన్నివేశాలను హడావిడిగా ముగించినట్టు అనిపిస్తుంది. థ్రిల్స్ తక్కువ, బోరింగ్ మూమెంట్స్ ఎక్కువ. 


Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?