సినిమా రివ్యూ : చుప్ - రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి, పూజా భట్, శరణ్య త‌దిత‌రులతో పాటు అతిథి పాత్రలో అమితాబ్ బచ్చన్...
ఛాయాగ్రహణం : విశాల్ సిన్హా
నేపథ్య సంగీతం : అమన్ పంత్
సంగీతం: అమిత్ త్రివేది, స్నేహ ఖాన్‌వాల్కర్, ఎస్.డి. బర్మన్
నిర్మాతలు : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, జయంతిలాల్ గడా, అనిల్ నాయుడు, గౌరీ షిండే  
దర్శకత్వం : ఆర్. బాల్కీ  
విడుదల తేదీ: సెప్టెంబర్ 23, 2022


'చుప్' (Chup Movie)... హిందీ సినిమా! అయితే, దక్షిణాది ప్రేక్షకుల్లోనూ దీనిపై ఆసక్తి పెరిగింది. అందుకు కారణం... దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). 'సీతా రామం'తో ఈ మధ్యే ఆయన మధురమైన విజయం అందుకున్నారు. ఆయనతో పాటు ఆసక్తి కలిగించిన మరో అంశం... ట్రైలర్! రివ్యూ రైటర్స్ (క్రిటిక్స్) ను ఎవరో వరుసగా హత్యలు చేస్తుంటారు. క్రిటిక్స్ సీరియల్ కిల్లింగ్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. మరి, సినిమా ఎలా ఉంది (Chup Telugu Review )?


కథ (Chup Movie Story) : ఒకరి తర్వాత మరొకరు... ముంబైలో వరుస హత్యలు జరుగుతుంటాయి. హిందీ సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్‌ను టార్గెట్ చేసుకుని, రివ్యూను ఏ స్టైల్‌లో అయితే రాశారో, ఆ స్టైల్‌లో చంపేస్తుంటాడు ఒక సీరియల్ కిల్లర్. అతడిని పట్టుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ అరవింద్ (సన్నీ డియోల్) ప్రయత్నిస్తాడు. సీరియల్ కిల్లర్‌కు భయపడి, తక్కువ రేటింగ్ ఇస్తే చంపేస్తున్నాడని భావించి... పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. పాజిటివ్ ఇచ్చినా ఒకరిని చంపేస్తాడు. దాంతో క్రిటిక్స్ రివ్యూలు రాయడం మానేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్ నీలా మీనన్ (శ్రేయా ధన్వంతరి) తో అరవింద్ ఒక రివ్యూ రాయిస్తాడు. మొదట ధైర్యంగా ఉన్నప్పటికీ... రివ్యూ రాసిన తర్వాత నీలాలో భయం మొదలవుతుంది. పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఉన్నప్పటికీ... ఆందోళన చెందుతుంది. అప్పుడు ఆమె బాయ్‌ఫ్రెండ్, ఫ్లవరిస్ట్ డానీ (దుల్కర్ సల్మాన్) ఏం చేశాడు? నీలా, డానీ ప్రేమ కథ ఏంటి? పోలీసులు సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   


విశ్లేషణ (Chup Hindi Movie Review) : చుప్ కాన్సెప్ట్ బావుంది. సినిమాలకు స్టార్ రేటింగ్స్ ఇస్తూ రివ్యూలు రాసే వాళ్ళను చంపేసి... వాళ్ళ నుదుటిపై కిల్లర్ స్టార్స్ రేటింగ్ వేసే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్కొక్కరిని చంపిన తీరు ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తుంది. క్రికెట్ స్టేడియంలో మర్డర్ అయితే మరీ దారుణం. సినిమా చాలా థ్రిల్లింగ్ వేలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మర్డర్, ఆ తర్వాత మర్డర్స్ చూస్తే... థ్రిల్లింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఆ సస్పెన్స్, థ్రిల్లింగ్ కంటిన్యూ చేశారు దర్శకుడు ఆర్ బాల్కీ. ఆ తర్వాత కథ ట్రాక్ తప్పింది.


కథా నేపథ్యం బాగున్నప్పటికీ... సీరియల్ కిల్లర్ ఎవరు అనేది ఊహకు అందని విషయం ఏమీ కాదు. సినిమా స్టార్టింగ్ నుంచి ప్రేక్షకులను క్లూస్ అందుతూ ఉంటాయి. అయితే... ఆర్ బాల్కీ స్టోరీ ఐడియా విషయంలో మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. కానీ, ప్రత్యేకతను సినిమా అంతా చూపించలేకపోయారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సూపర్. అయితే... ఇంటర్వెల్ తర్వాత సీరియల్ కిల్లర్ ఎవరు? అనేది తెలిశాక కథనంలో వేగం తగ్గింది. రెగ్యులర్ రొటీన్ ఫార్ములాలో వెళ్ళింది. సగటు థ్రిల్లర్ సినిమాల తరహాలో సినిమా సాగింది. 


గురుదత్ మీద తనకు ఉన్న అభిమానం, గౌరవాన్ని ఈ సినిమాలో ఆర్ బాల్కీ చాటుకున్నారు. దుల్కర్, శ్రేయా మధ్య సన్నివేశాల్లో 'ప్యాసా'లో పాట వినిపిస్తుంటే...ఒక అందమైన అనుభూతి కలుగుతుంది. మ్యూజిక్ బావుంది. ఇంటర్వెల్ తర్వాత మళ్లీ క్లైమాక్స్ కథలోకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.


నటీనటులు ఎలా చేశారు? : దుల్కర్ సల్మాన్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. 'సీతా రామం' చిత్రానికి, ఈ 'చుప్'లో నటనకు అసలు సంబంధం లేదు. వ్యత్యాసం చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పలికించారు. ఒకవేళ దుల్కర్ నటన తేలిపోతే... సినిమా నిలబడేది కాదు. దుల్కర్ పాత్రలో మరొకరిని కూడా ఊహించుకోలేం. ఆయనకు జంటగా శ్రేయా ధన్వంతరి చక్కగా నటించారు. మినిమల్ మేకప్, సాధారణ దుస్తుల్లో సహజంగా నటించారు. దుల్కర్, శ్రేయా మధ్య కెమిస్ట్రీ బావుంది. వీళ్ళిద్దరికి సన్నీ డియోల్ నుంచి చక్కటి మద్దతు లభించింది. క్యారెక్టర్ పరంగా మంచి విషయం ఏంటంటే... ఆయనకు జోడీగా హీరోయిన్ ఎవరు లేదు. పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ అన్నట్టు మాత్రమే సన్నీని చూపించారు. మిగతా నటీనటులు అందరూ చక్కటి నటన కనబరిచారు. అతిథి పాత్రలో అమితాబ్ బచ్చన్ ఒక్క సన్నివేశంలో కనిపించారు.


Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : చుప్... ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాలా సినిమాలతో పోలిస్తే బెటర్. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఇరగదీశారు. ఆర్ బాల్కీ ఐడియాస్, నరేషన్, ఇతర ఆర్టిస్టులను ఆయన డామినేట్ చేశారు. దుల్కర్ కోసం ఒక్కసారి చూడాల్సిన సినిమా 'చుప్'. 


Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా? లేదా?