ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో తెలుగు సినిమాలు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కన్నడ సినిమా 'కెజియఫ్ 2' కూడా అంతే! హిందీలో అటువంటి సినిమాలు వచ్చి కొన్ని రోజులు అవుతోంది. పైగా, ఈ మధ్య ఫ్లాపులు ఎక్కువ అయ్యాయి. పరాజయాల పరంపరకు బ్రేకులు వేస్తూ... 'బ్రహ్మాస్త్ర' భారీ విజయం సాధిస్తుందని హిందీ సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు నెరవేర్చేలా సినిమా ఉందా? ఈ రోజు భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైన సినిమా ఎలా ఉంది?  


కథ (Brahmastra Story) : సకల అస్త్రాలకు దేవత 'బ్రహ్మాస్త్ర'. కొంత మంది వ్యక్తుల బృందం కాపాడుతుంటుంది. అయితే... బ్రహ్మాస్త్ర మూడు ముక్కలు అవుతుంది. అందులో ఒకటి సైంటిస్ట్ మోహన్ భార్గవ్ (షారూఖ్ ఖాన్) దగ్గర, మరొకటి ఆర్టిస్ట్ అనీష్ శెట్టి (అక్కినేని నాగార్జున) దగ్గర ఉంటుంది. మూడోది ఎక్కడ ఉందో తెలియదు. ఈ 'బ్రహ్మాస్త్ర'ను వశం చేసుకోవాలని దేవ్‌కు చెందిన మనుషులు (మౌనీ రాయ్‌తో పాటు మరో ఇద్దరు) ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో వానర అస్త్రం అయిన మోహన్ భార్గవ్‌ను, నంది అస్త్రం అయిన అనీష్ శెట్టి మరణిస్తారు. దేవ్ మనుషులను ఒక డీజే శివ (ర‌ణ్‌బీర్‌ కపూర్) ఎలా అడ్డుకున్నాడు? అతని ప్రేయసి ఇషా (ఆలియా భట్) ఏ విధంగా సహాయం చేసింది? తాను అగ్ని అస్త్రం అని తెలుసుకోవడంతో పాటు తన శక్తిని శివ గుర్తించడంలో గురు (అమితాబ్ బచ్చన్) పాత్ర ఏమిటి? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Brahmastra Review) : దైవ శక్తి, దుష్ట శక్తి మధ్య యుద్ధంలో విజయం అన్ని వేళలా దైవ శక్తిదే అవుతుంది. 'బ్రహ్మాస్త్ర'కు మాత్రమే కాదు... మైథలాజికల్ సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ప్రతి ఒక్కరికీ ఆ సంగతి తెలుసు. అయితే... దుష్ట శక్తిపై దైవ శక్తి ఎలా విజయం సాధించిందో తెలుసుకోవాలనే ఆసక్తి వాళ్ళను థియేటర్లకు రప్పిస్తుంది. 'బ్రహ్మాస్త్ర'లో  ప్రారంభం నుంచి ముగింపు వరకూ అటువంటి ఆసక్తి  కలిగించే సన్నివేశాలు ఎన్ని ఉన్నాయి? అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి.


దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంపిక చేసుకున్న కథాంశం బావుంది. కానీ, దానిని చిక్కటి కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో ఫెయిల్ అయ్యారు. ఒక్క వీఎఫ్ఎక్స్ విషయంలో తప్ప... మిగతా విషయాల్లో ఆయన శ్రద్ధ వహించినట్లు అనిపించదు. ఆ వీఎఫ్ఎక్స్‌లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని పక్కన పెడితే... 'బ్రహ్మాస్త్ర' గురించి వివరించి ఆసక్తి కలిగించిన దర్శకుడు, ఆ తర్వాత ప్రేమ కథపై ఫోకస్ చేసి సినిమాను సైడ్ ట్రాక్ పట్టించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఇదే తంతు. 


సృష్టిలో ప్రేమను మించిన బ్రహ్మాస్త్రం లేదని చివర్లో అమితాబ్ బచ్చన్ చేత ఒక మాట చెప్పించారు. క్లైమాక్స్ అయ్యాక ఆ ఒక్క డైలాగ్ కోసం సినిమా తీశారేమో అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా బ్రహ్మాస్త్ర గురించి సీరియస్‌నెస్‌ కనిపించదు. ర‌ణ్‌బీర్‌ అగ్ని అస్త్రం అని చెబుతారు. అయితే... తానొక అగ్ని అని తెలుసుకునే సన్నివేశాల్లో గానీ, ఆ తర్వాత అతడిపై తీసిన సన్నివేశాల్లో గానీ ఎక్కడా ఫైర్ ఉండదు. ఏదో వెళుతుందంటే... వెళుతుందంతే అన్నట్లు ఉంటుంది. 


'బ్రహ్మాస్త్ర'కు మ్యూజిక్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఇటువంటి సినిమాలకు 'అఖండ' తరహాలో నేపథ్య సంగీతం ఉంటే... థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి. హీరో డీజే అని చెప్పి పబ్‌లో వినిపించే రీమిక్స్ తరహా సంగీతాన్ని దైవ శక్తి, దుష్ట శక్తి మధ్య పోరాట సన్నివేశాల్లో వినిపిస్తే ఎలా? హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ గీతాలు బావున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మెలోడీలు అవి. అయితే... 'దేవోం దేవోం' బదులు ఆ స్థానంలో ఫిరోషియస్ డివోషనల్ సాంగ్ అవసరం. ఈ సినిమాను తెలుగు సంగీత దర్శకుల చేతిలో పెడితే మరోస్థాయిలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. అయితే... లవ్ సీన్స్ చాలా వాటికి కత్తెర వేయాల్సిన అవసరం ఉంది.


ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ప్రేమ సన్నివేశాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంది. సినిమా స్టార్టింగులో షారూఖ్ ఖాన్ అదరగొట్టారు. ఆయన వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలు అవుతుంది. అయితే... ఆ ఆసక్తి సన్నగిల్లేలా చాలా సేపు ప్రేమకథతో సినిమాను నడిపించారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇంటర్వెల్ తర్వాత అయినా దైవ శక్తి, దుష్ట శక్తి మధ్య పోరుతో సినిమాను రసవత్తరంగా మారుస్తారని అనుకుంటే... అదీ చేయలేదు. మళ్ళీ ప్రేమకథపై కాన్సంట్రేట్ చేసి ప్రేక్షకులకు డిజప్పాయింట్ చేశారు. అనీష్ శెట్టి పాత్రలో కింగ్ నాగార్జున నటన బావుంది. కనిపించింది కాసేపే అయినప్పటికీ... ప్రభావం చూపించారు. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు.


Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?


బ్రహ్మాస్త్రం మూడు ముక్కలు అవ్వగా... మూడూ వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి. సినిమా కూడా మూడు ముక్కలు అయ్యింది. స్టార్టింగులో షారూఖ్ ఎపిసోడ్, ఆ తర్వాత నాగార్జున ఎపిసోడ్, చివరగా క్లైమాక్స్! ఈ మూడు ముక్కల మధ్యలో ప్రేమ కథ ఏమంత ఆసక్తి కలిగించదు. అసలు, హీరోతో హీరోయిన్ ఎందుకు ప్రేమలో పడింది? ఎందుకు అతడి కోసం ప్రాణాలకు తెగించి కొన్ని సాహసాలు చేసింది? అనేది ఆలోచిస్తే... రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలకూ అంతు చిక్కని ఫార్ములా ఇది.


రేటింగ్ : 2.5 /5 
బ్రహ్మాస్త్ర : పేరులో ఉన్న బ్రహ్మాండం సినిమాలో లేదు.



Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?