సినిమా రివ్యూ : రంగ రంగ వైభవంగా
రేటింగ్ : 2/5
నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేశ్, ప్రభు, ప్రగతి, తులసి, సుబ్బరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, 'స్వామి రారా' సత్య, 'ఫిష్' వెంకట్ తదితరులు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ: బాపినీడు బి
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గిరీశాయ
విడుదల తేదీ: సెప్టెంబర్ 2, 2022
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) కథానాయకుడిగా నటించిన సినిమా 'రంగ రంగ వైభవంగా' (Ranga Ranga Vaibhavanga Movie). ఇందులో కేతికా శర్మ కథానాయిక. 'అర్జున్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వ విభాగంలో పని చేసిన గిరీశాయ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ రోజు విడుదల చేశారు. సినిమా ఎలా ఉంది?
కథ (Ranga Ranga Vaibhavanga Movie Story) : రిషి (పంజా వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) ఒకే రోజున ఒకే ఆస్పత్రిలో జన్మిస్తారు. వాళ్ళిద్దరివీ పక్క పక్క ఇళ్ళు. రిషి తండ్రి (సీనియర్ నరేష్), రాధా తండ్రి (ప్రభు) పిల్లలు పుట్టడం కంటే ముందు నుంచి స్నేహితులు. ఆ స్నేహమే పిల్లల మధ్య కూడా ఉంటుంది. అయితే... చిన్నతనంలో తాను వద్దని చెప్పినా స్కూల్‌లో ఒక అబ్బాయితో రాధ మాట్లాడటం రిషికి నచ్చదు. ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. దాంతో మాట్లాడుకోవడం మానేస్తారు. ఇద్దరికీ ఇగో అన్నమాట. స్కూల్ నుంచి మెడిసిన్ కాలేజీకి వచ్చినా మాట్లాడుకోరు. అయితే... ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రేమ. ఇగోని పక్కన పెట్టి ఇద్దరూ మాట్లాడుకునే సమయానికి రిషి అన్నయ్య, రాధ అక్క కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవలకు కారణం ఏమిటి? మళ్ళీ రెండు కుటుంబాలను రిషి, రాధ ఎలా కలిపారు? రాధ అన్నయ్య వంశీ (నవీన్ చంద్ర) రాజకీయ ప్రయాణానికి, ఈ కుటుంబాల మధ్య గొడవలకు ఏమైనా సంబంధం ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Ranga Ranga Vaibhavanga Review) : 'రంగ రంగ వైభవంగా'లో 'కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి?' అని ఓ పాట ఉంది. సినిమా ప్రారంభంలో వస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ గురించి ఆ పాటను రాశారా? కథ గురించి ముందే మనకు హింట్ ఇచ్చారా? అని సినిమా మొత్తం అయ్యాక సందేహం కలుగుతుంది. ఎందుకంటే... కథ, కథనం, సన్నివేశాలలో కొత్తదనం అసలు లేదు.
'రంగ రంగ వైభవంగా' సినిమా చూస్తుంటే... 'నిన్నే పెళ్ళాడతా', 'నువ్వు లేక నేను లేను', 'రామ రామ కృష్ణ కృష్ణ' ఇలా చాలా సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. పాత సినిమాల్లో ఒక్కో సన్నివేశాన్ని, ఒక్కో కీలక అంశాన్ని తీసుకొచ్చి ఈ సినిమా కథ రాసినట్లు ఉంటుంది. ఒక్కోసారి కథ పాతగా ఉన్నప్పటికీ... సన్నివేశాలను కొత్తగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు గిరీశాయ ఆ కొత్తదనం తీసుకు రావడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడు ఈజీగా ఊహించవచ్చు. హీరో హీరోయిన్ల మధ్య ఇగో సమస్యల వల్ల ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు కొంత బావుంటాయి. అయితే... వాళ్ళిద్దరినీ ఆ తర్వాత కలిపిన తీరు అంత కన్వీన్సింగ్‌గా అనిపించదు.
రొటీన్ కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కొంత వరకూ మేజిక్ చేసింది. 'ఉప్పెన' స్థాయిలో పాటలు లేనప్పటికీ... సన్నివేశాలకు తగ్గట్టు చక్కటి సంగీతం ఇచ్చారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. ప్రతి సన్నివేశాన్ని అందంగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడలేదు.
నటీనటులు ఎలా చేశారు? : వైష్ణవ్ తేజ్ లుక్స్ బావున్నాయి. స్టయిలింగ్ కూడా బావుంది. కొన్ని సన్నివేశాల్లో నటన కూడా బావుంది. అయితే... క్యారెక్టరైజేషన్, కథ పరంగా లోపాలు ఉండటంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్ నటన, మేనరిజం పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేస్తాయి. కేతికా శర్మ సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపించారు. 'రొమాంటిక్'లో డ్రస్సింగ్‌తో కంపేర్ చేస్తే... ఇందులో డ్రస్సింగ్ డిఫరెంట్‌గా ఉంది. అయితే... కొన్ని సన్నివేశాల్లో రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. నటన పరంగా ఎమోషనల్ సీన్స్‌లో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్‌లో మాత్రం వైష్ణవ్, కేతికా కెమిస్ట్రీ బావుంది. నవీన్ చంద్ర బాగా చేశారు. పాత్రకు న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరివీ రొటీన్ క్యారెక్టర్లే. ఉన్నంతలో రాజ్ కుమార్ కసిరెడ్డి కొంతలో కొంత నవ్వించారు.
Also Read : 'కోబ్రా' రివ్యూ : విక్రమ్ సినిమా ఎలా ఉంది? తెలుగులో హిట్ అవుతుందా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'రంగ రంగ వైభవంగా'... కొత్తగా ఏమీ లేదు. కథ పరంగా పాత సినిమాలు చూసిన ఫీలింగ్ ఉంటుంది. నటీనటులకు వస్తే... వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ మధ్య కెమిస్ట్రీ కుదిరింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు డీసెంట్‌గా ఉన్నాయి. అయితే... థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు మంచి అనుభూతి మాత్రం మిస్ అవుతుంది. అక్కడక్కడా బావున్నా పర్వాలేదు... ఎంజాయ్ చేస్తామని అనుకుంటే వెళ్ళవచ్చు.