సినిమా రివ్యూ : కోబ్రా
రేటింగ్ : 2.75/5
నటీనటులు : విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి, మియా జార్జ్, మీనాక్షీ గోవింద్ రాజన్, జాన్ విజయ్, 'రోబో' శంకర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : హరీష్ కన్నన్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత : ఎస్ఎస్ లలిత్ కుమార్
తెలుగులో విడుదల: ఎన్వీ ప్రసాద్ (ఎన్వీఆర్ సినిమా)
రచన, దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు
విడుదల తేదీ: ఆగస్టు 31, 2022
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), 'కెజియఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి (KGF 2 Heroine Srinidhi Shetty) జంటగా నటించిన సినిమా 'కోబ్రా'. తమిళంలో 'డీమాంటే కాలనీ', నయనతార 'ఇమైక నొడిగల్' (తెలుగులో 'అంజలి సీబీఐ ఆఫీసర్'గా విడుదలైంది) వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌లో విక్రమ్ గెటప్స్ ఆకట్టుకున్నాయి. 'అపరిచితుడు'కు మించి సినిమా ఉంటుందనే నమ్మకం కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Cobra Movie Story) : ఒరిస్సా ముఖ్యమంత్రి, స్కాట్లాండ్ యువరాజు, రష్యాలో ఒక మంత్రి... వివిధ దేశాల్లో ప్రముఖులు మరణిస్తారు. ఈ హత్యలకు, కోల్‌కతాలో సాధారణ లెక్కల మాస్టారు మది (విక్రమ్)కు సంబంధం ఉందని ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) అనుమానిస్తారు. ఈ కేసులో హెల్ప్ అవుతుందని ఓ లెక్కల స్టూడెంట్ జూడీ (మీనాక్షీ గోవింద్ రాజన్) కు తమ బృందంలో చోటు కల్పిస్తారు. జూడీ ఎవరో కాదు... మదిని ప్రేమిస్తున్న భావన (శ్రీనిధి శెట్టి) స్టూడెంట్. హత్యలకు గురైన ప్రతి ఒక్కరికీ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన రిషి (రోషన్ మాథ్యూ)తో సంబంధం ఉంటుంది. అతను ఎవరు? నిజంగా మది హత్యలు చేశాడా? లేదంటే కేవలం పోలీసుల అనుమానం మాత్రమేనా? చివరకు, ఏం తేలింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Cobra Review) : విక్రమ్ అంటే డిఫరెంట్ గెటప్‌లు, వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటారని పేరు వచ్చింది. గెటప్‌లు, కాన్సెప్ట్ బేస్డ్ కథల ఎంపిక చేసుకున్నా ఆశించిన విజయాలు రాలేదు. అయితే... విక్రమ్ నుంచి సరైన సినిమా వస్తుందని ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు 'కోబ్రా' ఫుల్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది.
'కోబ్రా' కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా. అయితే... ఆ కాన్సెప్ట్ కంటే విక్రమ్ నటన, రెహమాన్ సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది. 'కోబ్రా' ప్రారంభమే... కథలోకి వెళుతుంది. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కథ ముందుకు సాగే కొలదీ ఆసక్తిగా ఉంటుంది. అయితే... నిడివి మాత్రం ఇబ్బంది పెడుతుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఇబ్బంది పెడుతుంది. అప్పటివరకూ తెలివిగా కథను ముందుకు తీసుకు వెళ్లిన దర్శకుడు, కథ చివరకు వచ్చేసరికి రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు తీసుకొచ్చారు. లాజిక్స్, లెక్కలు వదిలేశారు. ఆ ఒక్క విషయం పంటి కింద రాయిలా తగులుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ కాంప్లెక్స్ ఉంది. ఇన్వెస్టిగేషన్ వరకూ ఆ విషయం ప్రేక్షకులకు తెలియదు. ఆ తర్వాత క్యారెక్టరైజేషన్ పరంగా కొన్ని లోపాలు కనిపిస్తాయి.
ఏఆర్ రెహమాన్ సంగీతం సూపర్బ్. 'అధీరా...' సాంగ్ కొన్నాళ్లు వినబడుతుంది. మిగతా పాటలు కూడా బావున్నాయి. నేపథ్య సంగీతం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుంచుకునేలా ఉంది. రెహమాన్ అందించిన సంగీతంలో ప్రత్యేకత ఏంటంటే... సౌండింగ్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్... ఎమోషనల్ సీన్స్‌లో నేటివిటీ ఫీలింగ్ ఉండేలా చూసుకున్నారు. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ హై లెవల్‌లో ఉంది. దిలీప్ సుబ్బరామన్ స్టంట్స్ బావున్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : విక్రమ్ నటనకు వంక పెట్టలేం. కథలో, పాత్రలో జీవించడం ఆయనకు అలవాటు. ఈ సినిమాలో కొన్ని గెటప్‌లలో కనిపిస్తారు. ఆ గెటప్‌ల కంటే విక్రమ్ నటన ఎక్కువ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ సీన్, క్లైమాక్స్ సీన్‌లో అద్భుతంగా నటించారు. నటుడిగా మరోసారి వైవిధ్యం చూపించారు. కొత్తగా కనిపిస్తారు. విక్రమ్‌లో నటుడు మరోసారి ఆకట్టుకుంటాడు. 'కెజియఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి నటన అందంగా ఉంది. ఇంటర్వెల్ ముందు సాంగ్‌లో ముద్దొస్తారు. నటిగా భావోద్వేగభరిత సన్నివేశాల్లో బాగా చేశారు. మృణాళిని రవి పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ఎమోషనల్‌గా సాగుతుంది. ఆమె నటన తేలిపోయింది. రోషన్ మాథ్యూ విలనిజం బావుంది. మియా జార్జ్, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, జాన్ విజయ్ తదితరులు ఆయా పాత్రలకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు సక్సెస్ అయ్యారు.
Also Read : 'కళాపురం' రివ్యూ : అందరూ కళాకారులే - సినిమా ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'కోబ్రా' చూశాక, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత... 'విక్రమ్ ఈజ్ బ్యాక్' అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. 'కోబ్రా'లో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే... వాటిని పక్కన పెట్టి సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
Also Read : ఓదెల రైల్వే స్టేషన్ రివ్యూ : శోభనం తర్వాత రోజు పెళ్లి కుమార్తెను చంపేస్తున్నది ఎవరు?