సినిమా రివ్యూ : బబ్లీ బౌన్సర్ 
రేటింగ్ : 1.5/5
నటీనటులు : తమన్నా, అభిషేక్ బజాజ్, ప్రియం సాహా, సౌరభ్ శుక్లా, సుప్రియా శుక్లా, సాహిల్ వైడ్ త‌దిత‌రులు
నేపథ్య సంగీతం : అనురాగ్ సైకియా   
సంగీతం: తనిష్క్ బగ్చి, కరణ్ మల్హోత్రా  
నిర్మాతలు : వినీత్ జైన్, అమృతా పాండే
దర్శకత్వం : మధుర్ భండార్కర్ 
విడుదల తేదీ: సెప్టెంబర్ 23, 2022


తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో రూపొందిన హిందీ సినిమా 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer Movie). మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి. లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో? సినిమా ఎలా ఉంటుందో? అని ఎదురు చూశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? 'చాందిని బార్', 'పేజ్ 3', 'ట్రాఫిక్ సిగ్నల్', 'ఫ్యాషన్', 'హీరోయిన్' తదితర సినిమాలు తీసిన మధుర్ బండార్కర్ ఈ సినిమాను ఎలా తీశారు? తమన్నా ఎలా నటించారు?


కథ (Babli Bouncer Story) : బబ్లీ (తమన్నా)ది ఢిల్లీకి సమీపంలోని పహిల్వాన్‌లకు ప్రసిద్ధి చెందిన ఫతేపూర్. ఆ ఊరిలోని కుర్రాళ్లు అందరూ ఢిల్లీ వెళ్లి బౌన్సర్లుగా పని చేస్తుంటారు. వాళ్ళల్లో ఓ అబ్బాయి కుకు (సాహిల్ వైడ్) బబ్లీని ప్రేమిస్తాడు. ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిసి తల్లిదండ్రులతో ఇంటికి వెళతారు. అప్పటికి రెండు మూడు సంబంధాలు చెడగొట్టిన బబ్లీ... కుకుతో పెళ్లికి ఓకే చెబుతుంది. కానీ, ఓ కండిషన్ పెడుతుంది. ఏడాది పాటు ఢిల్లీలో ఉద్యోగం చేస్తానంటుంది. కుకు పని చేసే నైట్ క్లబ్‌లో బబ్లీకి లేడీ బౌన్సర్ ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విరాజ్ (అభిషేక్ బజాజ్) ఎవరు? స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బబ్లీ గ్రామానికి వచ్చి ఆమెకు ఎందుకు సన్మానం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Babli Bouncer Movie Review) : 'బబ్లీ బౌన్సర్' ప్రమోషన్ కోసం ఆదివారం తమన్నా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లారు. ఇంట్లో ఉన్న అమ్మాయిల్లో ఎవరు తమకు లేడీ బౌన్సర్‌గా కావాలో ఎంపిక చేసుకోమని అబ్బాయిలకు నాగార్జున సూచించారు. వెంటనే 'why should boys have all the fun?' అన్నారు తమన్నా. ఎప్పుడూ ఆ అవకాశం అబ్బాయిలకు మాత్రమేనా? అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. బహుశా... 'బబ్లీ బౌన్సర్' సినిమా విషయంలోనూ ఎప్పుడూ అబ్బాయిలు మాత్రమే ఇటువంటి కథలు చేయాలా? అమ్మాయిలు చేయకూడదా? అని ఓకే చెప్పారేమో!?


హీరోయిన్ లేడీ బౌన్సర్ అనేది పక్కన పెడితే... కథ కొత్తది ఏమీ కాదు. ఆ కథను ముందుకు నడిపిన తీరు, సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేదు. సిటీ నుంచి పల్లెకు వచ్చిన అమ్మాయితో అబ్బాయి ప్రేమలో పడటం... అతడికి చదువు సంధ్యలు, మంచి ఉద్యోగం లేదని అమ్మాయి తిరస్కరించడం... పట్టుదలతో అబ్బాయి పేరు సాధించడం... ఇటువంటి కథలు ఇంతకు ముందు చూశాం కదా! ఆ కథను, కథలో పాత్రలను రివర్స్ చేస్తే... 'బబ్లీ బౌన్సర్'. ఇక్కడ అమ్మాయి ప్రేమలో పడుతుంది. అబ్బాయి తిరస్కరిస్తాడు. ఆ తర్వాత అమ్మాయి కష్టపడి తనను తాను మార్చుకుని అబ్బాయి మనసు దోచుకుంటుంది.


హీరోయిన్ బౌన్సర్ అంటే ఏం చేస్తుందో? అని ప్రేక్షకులలో ఉన్న ఆసక్తిని సినిమా ప్రారంభమైన కాసేపటికి మధుర్ భండార్కర్ చంపేశారు. తర్వాత సన్నివేశంలో ఏం జరుగుతుందో ఊహించడం ప్రేక్షకులకు పెద్ద కష్టమేమీ కాదు. ఎమోషన్స్, కామెడీ, క్యారెక్టరైజేషన్స్... ప్రతిదీ రొటీన్! కామెడీ అయితే అసలు వర్కవుట్ కాలేదు. 


ఒకవేళ హిందీ ప్రేక్షకులకు ఈ కథ కొత్తగా అనిపిస్తుందేమో? తెలుగు ప్రేక్షకులకు మాత్రం పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. పాటలు హిందీలో బావున్నాయి. తెలుగులో ఆకట్టుకోవడం కష్టమే. హిందీలో తమన్నా డబ్బింగ్ చెప్పారు. ఫతేపూర్ మాండలికంలో డైలాగులు పలికారు. తెలుగులో తమన్నా పాత్రకు పెట్టిన యాస కూడా బాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది.


బబ్లీ బౌన్సర్‌గా యాక్టింగ్ నుంచి డ్రసింగ్ వరకు... ఆఖరికి వాకింగ్ స్టైల్‌లో తమన్నా డిఫరెన్స్ చూపించారు. ఇంతకు ముందు సినిమాల్లో మిల్కీ బ్యూటీ ఈ సినిమాలో కనిపించలేదు. బస్ స్టాప్, క్లైమాక్స్ ఫైట్‌లో తమన్నా యాటిట్యూడ్ బావుంది. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమన్నా వన్ మ్యాన్ షో చేశారు. సాహిల్ వైడ్ రోల్, ఆయన నటన కూడా! సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా? లేదా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : హీరోయిన్ బౌన్సర్ అనేది రొటీన్ కథకు ఇచ్చిన కోటింగ్ మాత్రమే. బౌన్సర్ కాకుండా హోటల్‌లో వెయిటర్‌గా తమన్నా పాత్రను చూపించినా కథకు వచ్చే నష్టమేమీ లేదు. ఇందులో కామెడీ కంటే టీవీ రియాలిటీ షోల్లో వచ్చే స్కిట్స్ వందరెట్లు బెస్ట్. తమన్నా వన్ మ్యాన్ షో కూడా 'బబ్లీ బౌన్సర్'ను లిఫ్ట్ చేయలేకపోయింది. ఇది మధుర్ భండార్కర్ నుంచి ఆశించే సినిమా అయితే కాదు. ఎటువంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటం, తమన్నా నటన తప్ప సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏదీ లేదు. సినిమా అయ్యాక... 'లేడీ బౌన్సర్స్ కథ ఎక్కడుంది?' అని ఆలోచించుకోవాలి. 


Also Read : 'శాకిని డాకిని' రివ్యూ : రెజీనా, నివేదా థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?