గరికపాటి, చిరంజీవి వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ రచ్చలోకి సినీ నటుడు బ్రహ్మాజీ, సినీ నిర్మాత శ్రీనివాస కుమార్ అడుగు పెట్టారు. “అన్నయ్యని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. చిరంజీవి సుఖీభవ” అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. అటు “అహంకారానికి కూడా మమకారమే సమాధానం ఇచ్చే వ్యక్తి వ్యక్తిత్వం మెగాస్టార్ గారికే సొంతం” అంటూ శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు.
‘అలయ్ బలయ్’ వేదికగానే ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు చిరంజీవి, గరికపాటి. కానీ, సోషల్ మీడియా వేదికగా కొంత మంది చిరంజీవిని సమర్దిస్తూ, మరికొంత మంది గరికపాటిని సమర్ధిస్తూ చర్చోప చర్చలు నడుపుతున్నారు. చిరంజీవిపై కొందరు, గరికపాటిపై మరికొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.
తొలుత ఈ వివాదంపై చిరంజీవి సోదరుడు నాాగబాబు ట్విట్టర్ వేదిక విమర్శలకు దిగారు. “ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అని వ్యంగ్యాస్త్రం సంధించాడు. ఈ కామెంట్ పై బ్రహ్మణ సంఘాలు రంగంలోకి దిగాయి. నాగబాబు వ్యాఖ్యలకు ఆలిండియా బ్రహ్మణ ఫేడరేషన్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. “సమాజంతో నటనా, వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందారనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే” అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు మెగాస్టార్ అభిమానులు.. గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి హైదరాబాద్ లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో గరికపాటి నరసింహరావు ప్రసంగిస్తుండగా.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లు చిరంజీవితో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వారిని కాదనలేక చిరు ఫోటోలు దిగారు. దీంతో గరికపాటి, చిరంజీవిపై కాస్త అసవహనం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు ఫోటోలు దిగడం ఆపకపోతే.. తాను ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని చెప్పారు. వెంటనే చిరంజీవి ఫోటోలు దిగడం ఆపేసి వచ్చి.. తన సీట్లో కూర్చున్నారు.
గరికపాటి ప్రసంగం అయ్యాక చిరంజీవి జరిగిన ఘటన పట్ల చింతించారు. గరికపాటి ప్రవచనాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. పద్మ అవార్డు వచ్చిన సందర్భంలోనూ తాను శుభాకాంక్షలు చెప్పానని గుర్తు చేశారు. వీలుంటే గరికపాటిని తన ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పారు. ఆయన విరవణ పట్ల గరికపాటి సంతోషం వ్యక్తం చేశారు. అక్కడితో వివాదం ముగిసింది. కానీ, చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా గరికపాటిపై విమర్శలు చేయడంతో మళ్లీ వివాదం చెలరేగింది. ప్రస్తుతం గరికపాటి, చిరంజీవి వర్గాలుగా ఏర్పడి సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
మరోవైపు గరికపాటి చిరంజీవికి ఇచ్చిన మర్యాద, ఎక్కడో వున్న వ్యక్తి చిరంజీవి దగ్గరికి వచ్చి. చిరునవ్వుతో పలకరించడం, ఆశీర్వదించడం వదిలేసి.. అసందర్భ విషయాలను విశేషంగా ప్రచారం చేస్తున్న నెటిజన్లపై మరికొంత మంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగిసిపోయిన వివాదాన్ని కావాలని రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు.
Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?
Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది