సినిమా రివ్యూ : టైగర్ నాగేశ్వరరావు
రేటింగ్ : 2.5/5
నటీనటులు : రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణూ దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, జిష్షు సేన్ గుప్తా, నాజర్, హరీష్ పేరడీ, అనుకీర్తి వ్యాస్, సుదేవ్ నాయర్, 'ఆడుకాలం' నరేన్, ప్రదీప్ రావత్ తదితరులు
మాటలు : శ్రీకాంత్ విస్సా
ఛాయాగ్రహణం : ఆర్. మది 
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్! 
నిర్మాత : అభిషేక్ అగర్వాల్!
రచన, దర్శకత్వం : వంశీ 
విడుదల తేదీ: అక్టోబర్ 20, 2023  


Tiger Nageswara Rao Review In Telugu : మాస్ మహారాజా రవితేజ హీరోగా లక్ష్మీ మంచు 'దొంగాట', రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' ఫేమ్ వంశీ దర్శకత్వం వహించిన సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఆంధ్ర రాబిన్ హుడ్ స్టూవర్టుపురం నాగేశ్వరరావు బయోపిక్ ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.  


కథ (Tiger Nageswara Rao Movie Story) : ఎవరినైనా కొట్టే ముందు, దేనినైనా కొట్టేసే ముందు చెప్పి మరీ చేయడం స్టూవర్టుపురం నాగేశ్వర రావు (రవితేజ)కు అలవాటు. ఎనిమిదేళ్ళ వయసులో తండ్రి తల నరకడం నుంచి మొదలు పెడితే... ఎమ్మెల్యే యలమంద (హరీష్ పేరడీ), సీఐ మౌళి (జిష్షు సేన్ గుప్తా) ప్రాణాలు తీసే వరకు నాగేశ్వర రావు జీవితంలో ఏం జరిగిందనేది సినిమా కథ. 


స్టూవర్టుపురం నేపథ్యం ఏమిటి? తండ్రి తలను నాగేశ్వర రావు ఎందుకు నరికాడు? అతను ప్రేమించిన ఉత్తరాది అమ్మాయి సారా (నుపుర్ సనన్) ఏమైంది? మరదలు మణి (గాయత్రి భరద్వాజ్)తో పెళ్లి వెనుక ఏం జరిగింది? దోచుకున్న డబ్బుతో నాగేశ్వరరావు ఏం చేశాడు? 'టైగర్'గా ఎలా మారాడు? ఏకంగా ప్రధానమంత్రి (ఇందిరా గాంధీ) ఆఫీసుకు వెళ్లి ఏం సవాల్ చేసిన వచ్చాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (Tiger Nageswara Rao Movie Review) : స్టూవర్టుపురం నాగేశ్వరరావు గజదొంగ అని ప్రజలకు తెలుసు. అతను దొంగతనం ఎలా చేసేవాడు? అతని వ్యక్తిగత జీవితం ఏమిటి? అనేది తెలియదు. అందుకని, అతని జీవితంపై సినిమా కావడంతో 'టైగర్ నాగేశ్వరరావు' మీద ఆసక్తి నెలకొంది. దాన్ని మరింత పెంచేలా సినిమా ప్రారంభమైంది. అయితే... అది చివరి వరకు కంటిన్యూ కాలేదు. 


'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Review)లో దర్శకుడు వంశీ చెప్పిన విషయాల్లో రెండు అంశాలు ప్రేక్షకులకు రిజిస్టర్ అవుతాయి. ఒకటి... దొంగతనం, దోచిన డబ్బు మీద కన్నేసిన శత్రువుల మీద ఊచకోత! రెండు... వ్యక్తిగత జీవితం! సినిమాలో ప్రారంభమే దొంగతనాలు చూపించారు. బాల్యంలో తండ్రి తల నరకడం గానీ, ట్రైన్ రాబరీ సీన్ గానీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే... అంత హై ఇచ్చిన తర్వాత వచ్చే ప్రేమకథ ఆసక్తిగా లేదు. ఆ కథ చెప్పడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అది కొంచెం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. హై స్పీడులో వెళుతున్న బుల్లెట్ ట్రైనుకు బ్రేకులు వేసినట్లు అయ్యింది. ఇంటర్వెల్ తర్వాత గజదొంగలో మంచి మనిషి మీద కథలో ఫోకస్ చేయడంతో వేగం మరింత తగ్గింది. నాగేశ్వరరావు జీవితంలో మరో కోణం చూపించడంతో కొన్ని సన్నివేశాలు రిపీట్ లో చూసినట్టు అనిపిస్తుంది. రవితేజకు, ఊరి ప్రజలకు మధ్య అనుబంధాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేదు. అందువల్ల, పతాక సన్నివేశాల్లో బలమైన సంఘర్షణ కనిపించలేదు. రవితేజ ఆశయాన్ని ప్రేక్షకులు ఫీలయ్యేలా క్లైమాక్స్ లేదు. 


ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి... సినిమాలో యాక్షన్ సీక్వెన్సులను బాగా డిజైన్ చేశారు. రవితేజ కూడా హుషారుగా చేశారు. అయితే... పుచ్చకాయలను నరికినట్లు ఫ్యాక్టరీలో మనుషుల తలలు నరికే సీక్వెన్స్ కొంచెం అతిగా ఉంటుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. ఎఫెక్టివ్ రీ రికార్డింగ్ ఉంటే బావుండేది. విజువల్ ఎఫెక్ట్స్ బాలేదు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ నాగేశ్వరరావు టైమ్ పీరియడ్ తెరపైకి తీసుకు రావడంలో హెల్ప్ అయ్యింది. 


నటీనటులు ఎలా చేశారంటే : ఆకలితో ఉన్న పులి వేటాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో... నాగేశ్వరరావు పాత్రలో రవితేజ నటన కూడా ఆ విధంగా ఉంది. రవితేజ పేరు చెబితే హుషారుకు మారుపేరు అన్నట్లు దర్శక రచయితలు ఆయన పాత్రలు డిజైన్ చేస్తున్నారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ కావడం, అందులో వైవిధమైన భావోద్వేగాలు ఉండటంతో కొత్త రవితేజ కనిపించారు. టెక్నాలజీ ఉపయోగించి కొన్ని సన్నివేశాల్లో టీనేజ్ రవితేజను చూపించారు. ఆ విజువల్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. 


హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ & వేశ్య పాత్రలో కనిపించిన అనుకీర్తి వ్యాస్ అందంగా కనిపించారు. తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. గ్లామర్ షో చేశారు. గాయత్రికి క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ చేసే అవకాశం లభించింది. ఆ ఛాన్సును ఆవిడ సద్వినియోగం చేసుకున్నారు. 


అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, నాజర్, 'ఆడుకాలం' నరేన్ వంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు సినిమాల్లో ఉన్నారు. ఆయా పాత్రలకు వాళ్ళ వల్ల వెయిట్ పెరిగింది. అంతే తప్ప... వాళ్ళకు సవాల్ విసిరే క్యారెక్టర్ కావు అవి. హేమలతగా రేణూ దేశాయ్ కనిపించారు. సీఐ మౌళిగా జిష్షు సేన్ గుప్తా, యలమంద పాత్రలో హరీష్ పేరడీ చక్కటి విలనిజం చూపించారు.  


Also Read : 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?


చివరగా చెప్పేది ఏంటంటే : తన నటనతో రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయం. కానీ, బాక్సాఫీస్ బరిలో వసూళ్ళనూ & ప్రేక్షకుల మనసులనూ సినిమా దోచుకోవడం కష్టమే. కథ, కథలో ఎమోషన్స్ బావున్నప్పటికీ... స్లో నేరేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది. రవితేజ వీరాభిమానులను సినిమా మెప్పిస్తుంది. 


PS : 'క్రాక్', 'ధమాకా' తప్పిస్తే... ఈ మధ్య కాలంలో రవితేజ సోలో హీరోగా నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలు అందుకోలేదు. ప్రేక్షకులను మెప్పించలేదు. 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడీ', 'రావణాసుర' సినిమాలతో పోలిస్తే 'టైగర్ నాగేశ్వరరావు' బెటర్ ఫిల్మ్! మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అయితే... టీజర్, ట్రైలర్ ద్వారా ఏర్పడిన అంచనాలను అందుకోవడంలో ఓ అడుగు వెనుక ఉంటుంది. 


Also Read : భగవంత్ కేసరి రివ్యూ: బాలకృష్ణ నయా అవతార్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి మళ్లీ హిట్టు కొట్టాడా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial