సినిమా రివ్యూ : లియో
రేటింగ్ : 2.5/5
నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస 
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు : ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి
తెలుగులో విడుదల : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023  


Thalapathy Vijay Leo Movie First Review : తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ 'లియో' మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆయనతో పాటు ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడమే అందుకు కారణం. LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో సినిమా కావడం మెయిన్ రీజన్! విడుదలకు ముందు భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రమిది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. 


కథ (LEO Movie Story) : పార్తీబన్ (విజయ్)కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న పట్టణంలో కాఫీ షాప్ ఉంది! భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో సంతోషంగా జీవిస్తున్నాడు. ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను కాపాడిన తర్వాత పార్తీబన్ ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఆ తర్వాత అసలైన కష్టాలు మొదలవుతాయి. అతడిని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. తన కొడుకు లియో దాస్ (విజయ్) మరణించాడని ఇన్నాళ్ళూ అనుకున్నానని, అయితే పార్తీబన్ పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాడని, నీ భర్త అసలు పేరు పార్తీబన్ అని సత్యతో  ఆంటోనీ చెబుతాడు. 


అసలు లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? చివరకు ఏమైంది? అనేది తెలియాలి అంటే సినిమా చూడాలి. 


విశ్లేషణ (LEO Telugu Movie Review) : లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో 'లియో' ఉంటుందా? లేదా? అనేలా కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇకపై ఆ సందేహాలు అవసరం లేదు. 'ఖైదీ'లో కానిస్టేబుల్ నెపోలియన్ 'లియో'లో ఉన్నారు. పతాక సన్నివేశాల్లో 'విక్రమ్' కమల్ హాసన్ నుంచి 'లియో'కి ఫోన్ వస్తుంది. 


LCUలోకి చాలా తెలివిగా విజయ్ సినిమాను కనెక్ట్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ రెండు విషయాలు చెప్పడం వల్ల కథకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇవి మెయిన్ ట్విస్టులు కూడా కాదు. అందువల్ల, ప్రేక్షకులు ఎటువంటి థ్రిల్ మిస్ కారు. సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే... 


యాక్షన్ సీన్లను స్టైలిష్ & కొత్తగా తీయడంతో పాటు రేసీ స్క్రీన్ ప్లేతో కథలను ముందుకు నడిపించడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు తెలుగులోనూ అభిమానులు ఏర్పడ్డారు. 'లియో'లో కూడా ఆయన స్టైల్ ఉంది. సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటవుట్, 'లియో' ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ బావున్నాయి. అయితే... లోకేష్ కనగరాజ్ స్టైల్ కొంత వరకు మాత్రమే ఉంది. సినిమా అంతటా కంటిన్యూ కాలేదు.


'లియో'ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా తీయాలని దర్శక నిర్మాతలు అనుకోలేదు. కథతో పాటుగా యాక్షన్ ఉండేలా ప్లాన్ చేశారు. యాక్షన్ డోస్ తక్కువ అయినప్పటికీ... ఇంటర్వెల్ ముందు వరకు చాలా ఆసక్తిగా సాగింది. ఓ క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్ వస్తున్నప్పటికీ... ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో కథ ముందుకు వెళ్ళింది. మధ్యలో వచ్చే ఫైట్స్ ప్రేక్షకులకు హై ఇస్తాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలైంది. పార్తీబన్, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? పాయింట్ మీద సెకండాఫ్ అంతా నడిచింది. దాంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బావున్నప్పటికీ... క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.  


టెక్నికల్ అంశాలకు వస్తే... మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. పతాక సన్నివేశాల్లో కెమెరా మూమెంట్స్ సూపర్బ్. ఆ ఒక్క సీక్వెన్స్ మాత్రమే కాదు... 'లియో' అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్ సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. 'విక్రమ్', 'జైలర్' తర్వాత ఆయనపై అంచనాలు భారీ ఉన్నాయి. 'లియో'తో వాటిని అందుకోవడం కొంచెం కష్టమే. అయితే... టిపికల్ & యునీక్ బీజీఎమ్ ఇచ్చారు. పాటల్లో తెలుగు సాహిత్యం బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.  


నటీనటులు ఎలా చేశారంటే : స్టార్‌డమ్, కమర్షియల్ అంశాలు వంటివి పక్కన పెట్టి మరీ విజయ్ చేసిన చిత్రమిది. 'తెరి' (తెలుగులో పోలీస్) సినిమాలోనూ చిన్న పాపకు తండ్రిగా కనిపించారు. కానీ, ఈ సినిమాలో తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికి తండ్రిగా నటించారు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. కానీ ఆ క్యారెక్టర్ గ్రాఫ్ కాదు. ఫ్లాష్‌ బ్యాక్  ఎపిసోడ్ హీరోయిజం ఎలివేట్ చేస్తే... ఆయన నుంచి అభిమానులు కోరుకునే కమర్షియల్ ఫైట్స్ ఇవ్వడంలో లోకేష్ కనగరాజ్ కూడా సక్సెస్ అయ్యారు.


త్రిష తల్లి పాత్రలో ఒదిగిపోయారు. విజయ్, త్రిష జోడీ... భార్యాభర్తలుగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంది. అన్నట్టు మాంచి ఎమోషనల్ సన్నివేశంలో లిప్ లాక్ ఉంది. ఇద్దరు పిల్లలు చక్కగా నటించారు. 


ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. అయితే... ఆ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్ కానీ, హీరోతో వాళ్ళ సన్నివేశాలు గానీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఉండవు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ అతిథిలా చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు. మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian)కు కథను మలుపు తిప్పే మంచి పాత్ర లభించింది. మిగతా వాళ్ళు ఓకే. 


Also Read : భగవంత్ కేసరి రివ్యూ: బాలకృష్ణ నయా అవతార్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి మళ్లీ హిట్టు కొట్టాడా?


చివరగా చెప్పేది ఏంటంటే : 'ఖైదీ', 'విక్రమ్'తో పాటు LCUను దృష్టిలో పెట్టుకుని వెళితే... అంచనాలు అందుకోవడంలో 'లియో' వెనకడుగు వేస్తుంది. LCUని పక్కన పెడితే... యాక్షన్ మూవీ ప్రేమికులకు నచ్చుతుంది. టిపికల్ లోకేష్ కనగరాజ్  యాక్షన్ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. విజయ్ అభిమానులను మెప్పించే అంశాలు ఉన్నాయి. 'విక్రమ్' తరహాలో మేజిక్ వర్కవుట్ అవ్వడం కష్టమే.


Also Read 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : స్వాతి బోల్డ్ సీన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial