సినిమా రివ్యూ : భగవంత్ కేసరి
రేటింగ్ : 2.75/5
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, జాన్ విజయ్, రాజ్ తిరందాసు తదితరులు
ఛాయాగ్రహణం : సి. రామ్ ప్రసాద్
సంగీతం : థమన్ ఎస్ఎస్
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్
రచన, దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023
Bhagavanth Kesari Movie Review in Telugu: ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సక్సెస్‌లతో బాలయ్య (Nandamuri Balakrishna) కెరీర్‌లోనే సూపర్ ఫాంలో ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒకరు. వీరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. దీనికి తోడు బాలకృష్ణ తన వయసుకు తగ్గ పాత్ర చేయడం, అనిల్ రావిపూడి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ప్రయత్నించడంతో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, ‘రోర్ ఆఫ్ కేసరి’ సాంగ్ విపరీతంగా సక్సెస్ అయింది. దీంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. దసరా సందర్బంగా గురువారం (అక్టోబర్ 19వ తేదీ) ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Bhagavanth Kesari Story): నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీ. చావు బతుకుల మధ్య ఉన్న భగవంత్ కేసరి తల్లి చివరి కోరికగా కొడుకుని చూడాలని కోరుకుంటుంది. దీంతో జైలు రూల్స్ బ్రేక్ చేసి భగవంత్ కేసరిని బయటకు తీసుకెళ్తాడు జైలర్ శ్రీకాంత్ (శరత్ కుమార్). ఈ కారణం వల్ల శ్రీకాంత్ సస్పెండ్ అవుతాడు. కానీ శ్రీకాంత్ వెళ్ళేముందు సత్ప్రవర్తన కారణంగా భగవంత్ కేసరిని రిలీజ్ చేస్తాడు. జైలు నుంచి విడుదల అయ్యాక శ్రీకాంత్ ఇంటికి వస్తాడు భగవంత్ కేసరి. అదే రోజు యాక్సిడెంట్ అయి శ్రీకాంత్ చనిపోతాడు. శ్రీకాంత్ కూతురు విజ్జీ పాప (శ్రీలీల) బాధ్యత భగవంత్ కేసరి తీసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయాలని భగవంత్ అనుకుంటాడు. కానీ విజ్జీకి అది ఇష్టం ఉండదు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి అనుకుంటుంది విజ్జీ. మరోవైపు దేశంలో ఉన్న పోర్టులు అన్నీ కలిపే ప్రాజెక్ట్ వి దక్కించుకోవాలని రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) కల. కొన్ని పరిస్థితుల కారణంగా రాహుల్ సంఘ్వి దారిలోకి విజ్జీ వస్తుంది. అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు? భగవంత్ కేసరికి, రాహుల్ సంఘ్వికి ఉన్న పాత వైరం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘భగవంత్ కేసరి’ చూడాల్సిందే.
విశ్లేషణ (Bhagavanth Kesari Review): నందమూరి బాలకృష్ణ సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్తున్నామంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి అనేది ఆడియన్స్‌కు ఒక ఐడియా ఉంటుంది. అలాగే అనిల్ రావిపూడి సినిమాల నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనే ఐడియా కూడా ఉంటుంది. ఆ ఐడియాని దాటి ఇద్దరూ కలిసి చేసిన ప్రయత్నమే ‘భగవంత్ కేసరి’. ముఖ్యంగా అనిల్ రావిపూడి బలం కామెడీ. కానీ తను ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ‘భగవంత్ కేసరి’లో 20 శాతం కామెడీ కూడా ఉండదు. ఎమోషన్, యాక్షన్ మీదనే ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ ఉంటుంది. అలాగే బాలకృష్ణ సినిమాల్లో ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఆడియన్స్‌కు అలవాటు అయిపోతాయి. కానీ భగవంత్ కేసరి పంచ్ డైలాగుల కంటే పంచులే ఎక్కువ వాడతాడు. ఇది సినిమాకు ఒక కొత్త ఫ్లేవర్‌ను తీసుకువచ్చింది.
‘భగవంత్ కేసరి’ కథ కొత్తదేమీ కాదు. విలన్ కారణంగా ఊరికి దూరమైన హీరో తన బతుకు తాను బతకడం, అతని జీవితంలోకి మళ్లీ విలన్ రావడం, హీరో తన ఆట కట్టించడం... స్థూలంగా చూసుకుంటే ఇదే కథ. కానీ ట్రీట్‌మెంట్, కథనం ‘భగవంత్ కేసరి’ని ఎంగేజింగ్‌గా మార్చాయి. సినిమాలో ప్రథమార్థం చాలా స్లోగా సాగుతుంది. కేవలం పాత్రల పరిచయానికే అనిల్ రావిపూడి 40 నిమిషాల సమయం తీసుకున్నాడు. అయితే ఒక పాట తప్ప మిగతావన్నీ ఈ 40 నిమిషాల్లోనే అయిపోతాయి. అది పెద్ద రిలీఫ్.
ఇంట్రడక్షన్ ఫైట్, ఆ తర్వాత శరత్ కుమార్, చిన్నప్పటి విజ్జీ పాప నేపథ్యంలో వచ్చే సీన్లు చాలా సమయం తీసుకున్నాయి. విజ్జీ, భగవంత్ కేసరిల మధ్య బలమైన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది అనిల్ రావిపూడి ఫీల్ అయ్యారు కానీ ఆ సీన్లు కాస్త లెంత్ తినేసినట్లు అనిపిస్తాయి. అర్జున్ రాంపాల్ పాత్ర పరిచయం చేసే సీన్లు మాత్రం వేగంగా సాగుతాయి. శ్రీలీల వెంట అర్జున్ రాంపాల్ మనుషులు పడటానికి కారణమైన సన్నివేశాన్ని చాలా కన్వీనియంట్‌గా రాసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ కథ వేగం పుంజుకునేది మాత్రం ఇక్కడి నుంచే. ఇంటర్వెల్‌కు కానీ హీరో, విలన్ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అప్పటివరకు విడివిడిగా సాగిన కథలు ఒకదానితో ఒకటి కలిసేది అక్కడే. బాలకృష్ణ మార్కు హైవోల్టేజ్ మాస్ యాక్షన్ సీన్‌తో ఇంటర్వల్ బోర్డు పడుతుంది.
బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ ఫ్లాష్‌బ్యాక్‌తో సెకండాఫ్ ప్రారంభం అవుతుంది. అనిల్ రావిపూడి ఇంటర్వ్యూల్లో చెప్పిన సర్‌ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఇక్కడే రివీల్ అవుతుంది. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, అనిల్ రావిపూడి మార్కు టైమింగ్‌తో ఆ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. కథ హైదరాబాద్‌కు షిఫ్ట్ అవ్వగానే హీరో, విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది కానీ, అది ఆగుతూ సాగుతూ ఉంటుంది. ఎమోషన్, యాక్షన్, ఎలివేషన్ల మధ్య స్క్రీన్‌ప్లే ట్రాకులు మారుతున్నా ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది.
ముఖ్యంగా సెకండాఫ్‌లో ‘కళ్లలో కళ్లు పెట్టి చూడు’ పాట నేపథ్యంలో వచ్చే బస్ యాక్షన్ సీన్ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ సీన్‌ను కామిక్‌గా చూపిస్తూ ఆడియన్స్‌తో విజిల్స్ కొట్టించారు అనిల్ రావిపూడి. స్కూల్ ఫంక్షన్‌లో బాలకృష్ణ స్పీచ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఇన్ఫర్మేషన్, అవేర్‌నెస్‌ను అందిస్తుంది. ప్రీక్లైమ్యాక్స్‌కు చేరుకునే సరికి కథ పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. ఇక క్లైమ్యాక్స్ మళ్లీ హైవోల్టేజ్‌నే. కానీ ఇక్కడ ఒక సర్‌ప్రైజ్ కూడా ఉంటుంది. ఆ సర్‌ప్రైజే సినిమాను రెగ్యులర్ బాలకృష్ణ సినిమాల నుంచి ఈ సినిమాను ప్రత్యేకంగా చూపిస్తుంది.
ఎస్ఎస్ థమన్ అందించిన పాటలు స్క్రీన్‌పై ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రీసెంట్ టైమ్స్‌లో థమన్ గత చిత్రాల కంటే బెటర్‌గా అనిపించినా... అవుట్ స్టాండింగ్ అవుట్‌పుట్ అయితే మాత్రం కాదు. సినిమా మాత్రం చాలా రిచ్‌గా ఉంది. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కు తగ్గట్లు సాగుతుంది. కొన్ని సీన్లలో లైటింగ్‌ను బాగా ఉపయోగించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Also Read :'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?
ఇక నటీనటుల విషయానికి వస్తే... బాలకృష్ణ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేయడం కొంచెం కొత్తగా ఉంటుంది. బాలయ్య మార్కు సీన్లు కూడా లౌడ్‌గా లేకుండా జాగ్రత్తపడ్డారు. ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యేది శ్రీలీలకే. ‘భగవంత్ కేసరి’ తర్వాత టాలీవుడ్ తనను మరింత కొత్తగా చూసే ఛాన్స్ ఉంది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. హీరోయిన్ ఉండాలి కాబట్టి కాజల్ అగర్వాల్ పాత్రను పెట్టినట్లు ఉంటుంది. తన పాత్రను తీసేసి చూసినా కథలో పెద్ద తేడా కనిపించదు. అర్జున్ రాంపాల్ విలనీ అంత కొత్తగా అనిపించదు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... బాలకృష్ణను కొత్తగా చూపిస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసిన అనిల్ రావిపూడి అందులో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఫ్యాన్స్‌కు మాత్రం బాగా నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వెళ్లి ఒక డిఫరెంట్ బాలయ్య మాస్ సినిమాను చూడవచ్చు.
Also Read : 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : స్వాతి బోల్డ్ సీన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial