సినిమా రివ్యూ: 'శర్మాజీ న‌మ్‌కీన్‌' (హిందీ)
రేటింగ్: 3/5
నటీనటులు: రిషి కపూర్, పరేష్ రావల్, జుహీ చావ్లా, సుహైల్ నయ్యర్, ఇషా తల్వార్, సతీష్ కౌశిక్ తదితరులుసినిమాటోగ్రఫీ: పీయూష్ పి
సంగీతం: స్నేహ ఖాన్‌వ‌ల్క‌ర్‌  
నిర్మాతలు: ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే 
దర్శకత్వం: హితేష్ భాటియా
విడుదల తేదీ: మార్చి 31, 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)


'శర్మాజీ న‌మ్‌కీన్‌'... రిషి కపూర్ (Rishi Kapoor) నటించిన చివరి సినిమా. అయితే... చిత్రీకరణ అంతా పూర్తి కాకముందే ఆయన మరణించారు. దాంతో ఆయన పాత్రకు సంబంధించిన మిగతా సన్నివేశాలను పరేష్ రావల్ పూర్తి చేశారు. పరేష్ రావల్ (Paresh Rawal) రాక ముందు గ్రాఫిక్స్ ద్వారా రిషి కపూర్ సన్నివేశాలు పూర్తి చేస్తే ఎలా ఉంటుంది? తాను ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని ఆ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించినట్టు ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) తెలిపారు. చివరకు, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన 'శర్మాజీ న‌మ్‌కీన్‌' (Sharmaji Namkeen Review) ఎలా ఉంది?


కథ: బ్రిజ్ గోపాల్ శర్మ (రిషి కపూర్ / పరేష్ రావల్)కు 58 ఏళ్ళు. ఇష్టం లేకున్నా వయసు రీత్యా ఉద్యోగం నుంచి రిటైర్ కావాల్సి వస్తుంది. ఖాళీగా ఉండటం శర్మకు ఇష్టం ఉండదు. ఏదో ఒక పని చేయడానికి పెద్ద కుమారుడు రింకు (సుహైల్ నయ్యర్) అంగీకరించడు. స్నేహితుడి సలహాతో కిట్టీ పార్టీలకు వంట చేయడం కోసం వెళతారు శర్మ. ఆల్రెడీ ఆయనకు వంట చేయడం అలవాటే. ఉద్యోగ రీత్యా వివిధ నగరాలు తిరగడం, అక్కడ ఫుడ్ నచ్చకపోవడంతో వంట నేర్చుకుంటారు. భార్య మరణం తర్వాత పిల్లలకు వండి పెట్టడం అలవాటు అయ్యింది. కిట్టీ పార్టీల్లో మహిళలకు (జుహీ చావ్లా & కో) శర్మాజీ వంటలు విపరీతంగా నచ్చుతాయి. తనతో ఎన్జీవోకి వెళుతున్నాని చెప్పి... బయట వంటలు చేస్తున్న విషయం ఒక రోజు రింకు దృష్టికి వస్తుంది. ఇంట్లో గొడవ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ: 'శర్మాజీ న‌మ్‌కీన్‌'ను సినిమాగా కంటే దివంగత రిషి కపూర్‌కు నివాళిగా కపూర్ ఫ్యామిలీ, మెజారిటీ హిందీ ప్రేక్షకులు చూస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగా 'చింటూ' అని పిలుచుకునే రిషి కపూర్ చివరి సినిమా కావడంతో వాళ్ళకు ఇదొక ఎమోషనల్ మూమెంట్. అయితే... 'నువ్వు ఈ మట్టిలో కలిసిపోయే రోజు ఒకటి వస్తుంది. నీ లెగసీని నీ మాటలే నిర్ణయిస్తాయి' అని పరేష్ రావల్ ఓ డైలాగ్ చెబుతారు. శర్మాజీ పాత్రలో ఆయన ఆ డైలాగ్ చెప్పినా... రిషి కపూర్ మట్టిలో కలిసిన రోజు వచ్చి వెళ్ళిందనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. పరేష్ ఆ డైలాగ్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే... రిషి కపూర్ వీరాభిమానులు కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం.


'శర్మాజీ న‌మ్‌కీన్‌' సినిమాకు వస్తే... పైకి ఇదొక కుటుంబ కథగా కనిపించినా, ప్రతి కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఏదో ఒక సమయంలో వస్తుంది. తండ్రి కుమారుల మధ్య సినిమాలో రిషి కపూర్, సుహైల్ నయ్యర్ మధ్య ఏర్పడిన సంఘర్షణ ఏర్పడుతుంది. 'ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ వ్యాపారానికి కాదు', 'అమితాబ్ బచ్చన్ ఏడు పదుల వయసులో నటిస్తున్నారు' - ఈ డైలాగుల్లో ఎంతో డెప్త్ ఉంది. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కొంత మంది పని చేస్తుంటే... రిటైర్ అయిన వ్యక్తి 'కృష్ణ రామ' అంటూ ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? అని సున్నితంగా ప్రశ్నించిన చిత్రమిది. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత డబ్బు కంటే మనసుకు నచ్చిన పని చేయాలనుకుంటే చేయవచ్చని చెప్పే చిత్రమిది. కలల్ని సాకారం చేసుకోవడానికి వయసుతో పని లేదని చెప్పే చిత్రమిది.


నిజానికి, 'శర్మాజీ న‌మ్‌కీన్‌' సినిమాలో చాలా  విషయాలు చెప్పే అవకాశం ఉంది. తండ్రీ కుమారుల మధ్య సంఘర్షణను లోతుగా చూపించే వీలు ఉంది. కానీ, కొన్ని మాటలు - సన్నివేశాలకు పరిమితం చేశారు. సింపుల్ స్టోరీతో 'శర్మాజీ న‌మ్‌కీన్‌' తీశారు. సినిమా ప్రారంభంలో కథ ఎటు వెళుతుందో క్లారిటీ ఉండదు. అరగంట తర్వాత గానీ అసలు పాయింట్ స్టార్ట్ కాదు. కుమారుడికి ఏదో ఒక రోజు నిజం తెలుస్తుందని వీక్షకుడు సులభంగా ఊహిస్తాడు. అక్కడి వరకూ ఆసక్తిగా కథను నడపడంలో దర్శకుడు నిదానంగా వెళ్ళాడు. రిషి కపూర్ కాసేపు, పరేష్ రావల్ కాసేపు కనిపించడం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. నిజానికి, పరేష్ రావల్ అద్భుతంగా నటించారు. కానీ, రిషి కపూర్‌ను చూసిన కళ్లతో మళ్లీ ఆయన్ను చూడటం ఇబ్బందే. రిషి కపూర్ పాత్రలో జీవించారు. శర్మాజీకి ప్రాణం పోశారు.  కనిపించిన ప్రతిసారీ మనసు దోచుకుంటారు. జుహీ చావ్లా, శర్మాజీ పెద్ద కుమారుడిగా రింకు పాత్రలో నటించిన సుహైల్ నయ్యర్, సతీష్ కౌశిక్ అద్భుతంగా నటించారు. సుహైల్ నయ్యర్ జోడీగా ఇషా తల్వార్ కనిపించారు.



తండ్రి బయటకు వెళ్ళి వంట చేయడం కుమారుడికి ఇష్టం ఉండదు. ఒక మహిళ వ్యాపారం చేయడం భర్తకు, అత్తగారికి ఇష్టం ఉండదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ప్రతి ఒక్కరి మనసులో ఒక్కో అభిప్రాయం ఉంటుంది. మనకు నచ్చినట్టు ఉండాలా? సమాజం కోసం నచ్చినట్టు ఉండాలా? అంటే... మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో? అది చేయాలని చెప్పే సినిమా 'శర్మాజీ న‌మ్‌కీన్‌'. ప్రతి పాత్రకూ ఓ కథ ఉంటుంది. ఒకసారి కిట్టీ పార్టీలో 'భర్తలు దేనికీ అనుమతి తీసుకోరు. మనం మాత్రం ప్రపంచం అనుమతి తీసుకోవాలి' అని చెప్పే డైలాగ్ ఇప్పటికీ సమాజంలో కొంత మంది మహిళల పరిస్థితికి అద్దం పడుతుంది. సాధారణ సన్నివేశాల్లో ఇటువంటి మాటలు సినిమా స్థాయిని పెంచాయి. సినిమాలో సున్నితమైన సన్నివేశాలు కొన్ని మనసును తాకుతాయి. చివరిగా చెప్పాలంటే... రిషి కపూర్ కోసమైనా 'శర్మాజీ న‌మ్‌కీన్‌'ను ఒకసారి చూడాల్సిందే.



Also Read: 'స్టాండప్ రాహుల్' రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా నిలబడిందా? కిందకు పడిందా?