సినిమా రివ్యూ: 'మిషన్ ఇంపాజిబుల్'
రేటింగ్: 2/5
నటీనటులు:  తాప్సీ పన్ను, హార్ష్ రోషన్, భాను ప్రకాషన్, జయతీర్థ మొలుగు , రవీంద్ర విజయ్, హరీష్ పేరడి, సుహాస్, సందీప్ రాజ్, హర్షవర్ధన్ తదితరులు
మాటలు: స్వరూప్ ఆర్.ఎస్.జె, మనో రంజితం దివ్య
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగెర
సంగీతం: మార్క్ కె. రాబిన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి  
దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జె
విడుదల తేదీ: ఏప్రిల్ 1, 2022


'మిషన్ ఇంపాజిబుల్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినిమా గురించి గొప్పగా చెప్పారు. పైగా, ఇందులో తాప్సీ పన్ను (Taapsee Pannu) ఓ పాత్ర చేయడం... 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ ఆర్.ఎస్.జె (Swaroop RSJ) తీసిన మలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కలిగింది. మరి, సినిమా ఎలా ఉంది? (Mishan Impossible Movie Review) సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఏం ఉన్నాయి?


కథ: రఘుపతి (హార్ష్ రోషన్), రాఘవ (భాను ప్రకాష్), రాజారామ్ (జయతీర్థ మొలుగు) స్నేహితులు. ముగ్గురిదీ తిరుపతి దగ్గరలోని వడమాల పేట. దర్శకుడు కావాలనేది రఘుపతి కల. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో కోటి రూపాయలు గెలవాలనేది రాఘవ లక్ష్యం. మలింగ అంత ఫాస్ట్ బౌలర్ అవ్వాలని రాజారామ్ ఆశ పడతాడు. ముగ్గురూ ఎంత అమాయకులు అంటే... దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే పోలీసులు రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారని తెలిసి, దావూద్‌ను పట్టుకోవడం కోసం ముంబై బయలు దేరతారు. కానీ, బెంగళూరులో చేరతారు. అక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ శైలజ (తాప్సీ పన్ను)కు వీళ్ళు ఎలా కలిశారు? ఆ తర్వాత ఏమైంది? మంగళూరులో చైల్డ్ ట్రాఫికింగ్ కేసుకు, ఈ పిల్లలకు సంబంధం ఏమిటి? ముగ్గురు పిల్లలు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: ప్రేక్షకులకు ముందుగా ఒక విషయం చెప్పాలి! 'మిషన్ ఇంపాజిబుల్' తాప్సీ పన్ను చిత్రమా? చిన్న పిల్లల చిత్రమా? అంటే ప్రధాన పాత్రల్లో నటించిన ముగ్గురు చిన్నారుల చిత్రమే! ఇంటర్వెల్ ముందు వరకూ తాప్సీది అతిథి పాత్రలా ఉంటుంది. అఫ్‌కోర్స్‌, ఆ తర్వాత కూడా తక్కువసేపే కనిపించారు. కానీ, ఆమె పాత్ర ప్రభావం ఎక్కువ ఉంది. హర్షవర్ధన్, సుహాస్, సందీప్ రాజ్, హరీష్ పేరడి సైతం అతిథి పాత్రల్లో కనిపించారు. రెండు మూడు సన్నివేశాలకు పరిమితం అయ్యారు. కథంతా చిన్న పిల్లల చుట్టూ తిరుగుతుంది. సినిమాకు అసలైన హీరోలు వాళ్ళే. ఇక, సినిమా ఎలా ఉందనే విషయానికి వెళితే...


'మిషన్ ఇంపాజిబుల్' ఒక క్రైమ్ కామెడీ సినిమా! ఫస్టాఫ్‌లో క్రైమ్ కంటే కామెడీ ఎక్కువ డామినేట్ చేసింది. సెకండాఫ్‌లో కామెడీని క్రైమ్ డామినేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే... డిఫరెంట్ అట్టెంప్ట్ అనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో తెలియని వెలితి ఉంటుంది. క్రైమ్, కామెడీ... రెండిటినీ బ్యాలన్స్ చేయడంలో లెక్క తప్పింది. స్క్రీన్ ప్లే సరిగా కుదరలేదు. అందువల్ల, ప్రేక్షకుడు కథతో పాటు ప్రయాణం చేయడం, ఫీల్ కావడం కష్టం.


తాప్సీ సన్నివేశంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందోనని ఆడియన్స్‌లో ఆసక్తి కలుగుతుంది. అయితే... అక్కడ నుంచి పిల్లల దగ్గరకు సినిమా వెళుతుంది. ముగ్గురు చిన్నారులను పరిచయం చేయడానికి దర్శకుడు స్వరూప్ కొంత సమయం తీసుకున్నారు. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 'జాతి రత్నాలు' చిన్నారులు అయితే ఎలా ఉంటుంది? అన్నట్టు అమాయకత్వంతో కూడిన సన్నివేశాలతో దర్శకుడు నవ్వించారు. కొంత సేపటి తర్వాత ఆ వినోదం పక్కన పెట్టి... కథలోకి వెళితే బావుంటుందని అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు ఆట మొదలవుతుంది. రవీంద్ర విజయ్ ఫ్లాష్‌బ్యాక్ సీరియ‌స్‌గా సాగుతుంది. తెరపైకి చైల్డ్ ట్రాఫికింగ్ క్రైమ్ వస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులు గుర్తు రావడంతో ఎమోషనల్ సాంగ్ వస్తుంది. కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కానీ, పిల్లలతో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా ఆట కట్టించినట్టు చూపించడం కొంత ఓవర్ అనిపిస్తుంది.


సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని ఎంత సరిపెట్టుకుందామని అనుకున్నా... లాజిక్ లేని సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు... పిల్లలు మిస్ అవ్వడంతో తొలుత కంగారు పడిన తల్లిదండులు ఆ తర్వాత ఏం చేశారో చూపించలేదు. పిల్లలతో మిషన్ ఏంటని ప్రేక్షకులకు డౌట్ వస్తుందని అనుకున్నారేమో? అందుకు సమాధానం అన్నట్టుగా తాప్సీ పన్ను ఇంట్రడక్షన్ సీన్‌లో క్లారిటీ ఇచ్చారు. కథా నేపథ్యం కొత్తగా ఉన్నప్పటికీ... 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో పోలిస్తే, స్వరూప్ కథనం, దర్శకత్వం ఆశించిన స్థాయిలో లేవు. మార్క్ కె. రాబిన్ పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.



Also Read: 'స్టాండప్ రాహుల్' రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా నిలబడిందా? కిందకు పడిందా?



ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ పన్ను చక్కగా నటించారు. ఆల్రెడీ హిందీ సినిమాలు 'బేబీ', 'పింక్', 'థ‌ప్ప‌డ్‌' వంటి సీరియస్ & పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తాప్సీ పన్ను చేశారు. ఈ సినిమాలో పాత్రను ఈజీగా చేసేశారు. తాప్సీ పన్ను చేయడం వల్ల ఆ పాత్రతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. హార్ష్, భాను ప్రకాష్, జయతీర్థ... ముగ్గురు బాల నటులు బాగా చేశారు. హరీష్ పేరడి ఆకట్టుకుంటారు. మిగతా నటీనటుల పాత్ర పరిథి తక్కువే. ఉన్నంతలో సుహాస్, సందీప్ రాజ్ బాగా చేశారు. చివరగా, ఒక్క ముక్కలో చెప్పాలంటే... అటు కామెడీకి, ఇటు క్రైమ్‌కు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయిన చిత్రమిది. ఇది పిల్లల సినిమాను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మాత్రమే. సుకుమార్, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, రాజమౌళి వంటి అగ్ర దర్శకుల సినిమాల శైలిని పిల్లలతో చెప్పించిన సీన్ బావుంది.


Also Read: ‘డీప్ వాటర్’ రివ్యూ - భార్య అఫైర్స్‌కు భర్త ఊహించని ట్రీట్మెంట్, పెద్దలకు మాత్రమే!