సినిమా రివ్యూ: 'స్టాండప్ రాహుల్'
రేటింగ్: 2/5
నటీనటులు: రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ, 'వెన్నెల' కిషోర్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు  
సినిమాటోగ్రఫీ: శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్
సంగీతం: స్వీకార్ అగస్తీ సమర్పణ: సిద్ధూ ముద్ద 
నిర్మాతలు: నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి 
దర్శకత్వం: శాంటో మోహన్ వీరంకి 
విడుదల తేదీ: మార్చి 18, 2022


స్టాండప్ కామెడీ... ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు తక్కువ వచ్చాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' సినిమాలో పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్‌గా కనిపించారు. తమిళం నుంచి తెలుగుకు అనువాదమైన 'దేవ్' సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర స్టాండప్ కమెడియన్‌గా ఉంటుంది. తెలుగులో ఒక హీరో స్టాండప్ కమెడియన్ రోల్ చేయడం బహుశా 'స్టాండప్ రాహుల్' సినిమాతో మొదలైందని చెప్పవచ్చు. రాజ్ తరుణ్ హీరోగా, వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. నేడు థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉంది? స్టాండప్ కామెడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉందా? లేదా? 


కథ: స్టాండప్ కమెడియన్ కావాలనేది రాహుల్ (రాజ్ తరుణ్) కల. అయితే... తల్లిదండ్రులు విడిపోవడం, ఉద్యోగం చేయమని తల్లి చెప్పడంతో ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) కంపెనీలో చేరతాడు. అక్కడ స్కూల్ మేట్ శ్రేయా రావు (వర్షా బొల్లమ్మ) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. సహ జీవనం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏమైంది? రాహుల్ స్టాండప్ కామెడియన్ అయ్యాడా? లేదా? తల్లికి ఇష్టం లేని స్టాండప్ కామెడీని అతడు వదిలేశాడా? పట్టుకున్నాడా? రాహుల్ జీవితంలో శ్రేయా రావు పాత్ర ఏమిటి? వాళ్లిద్దరి లివ్ - ఇన్ రిలేషన్షిప్ గురించి ఇద్దరి ఇళ్ళల్లో తెలిసిందా? లేదా? శ్రేయా రావు పెళ్లి చేసుకుందామని అడిగితే రాహుల్ ఎందుకు నో చెప్పాడు? చివరికి, ఏమైంది? అనేది మిగతా కథ.


విశ్లేషణ: స్టాండప్ రాహుల్... స్టాండప్ కామెడీపై తీసిన సినిమాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. నిజం చెప్పాలంటే... సినిమాలో స్టాండప్ కామెడీకి మించిన మెటీరియల్ ఉంది. స్టాండప్ కామెడీ అనేది జస్ట్ ఒక లేయర్ మాత్రమే! సినిమాలో హీరో ఇష్టపడే ప్రొఫెషన్ అంతే! అసలు కథ వేరే ఉంది. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుంది? అనేది చూపిస్తూ... రూపొందిన చిత్రమిది. సినిమాలో ఎమోషన్ ఉంది. కానీ, కామెడీ లేదు. 
'ఏవరేజ్ జోకులకు చప్పట్లు కొట్టరు' అని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ మాట హీరోయిన్ వర్షా బొల్లమ్మతో చెప్పించిన దర్శకుడు శాంటో... సినిమాలో జోకులు ఏవరేజా? సుపరా? ఎక్ట్స్టాడినరీనా? అనేది క్రాస్ చెక్ చేసుకున్నట్టు లేదు. సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే... అది స్టాండప్ కామెడీ సీన్స్!


శాంటో ఎంపిక చేసుకున్న కథా నేపథ్యం బావుంది. స్టాండప్ కామెడీ తెలుగుకు కొత్త అని చెప్పాలి. కానీ, కథ కొత్తది కాదు. ఆల్రెడీ చూసినట్టు ఉంది. ఆ కథను తెరకెక్కించిన విధానంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అందువల్ల, కనెక్ట్ అవ్వడం కష్టం. కొన్నిసార్లు ఎమోషనల్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ అయితే మరీ రొటీన్. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో అటువంటి క్లైమాక్స్ చూశాం. సినిమా ఎలా ఉన్నా... సినిమాటోగ్రఫీ సూపర్. శ్రీకర్ అగస్తీ ఈ ప్రేమకథకు అవసరమైన పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


నటీనటుల విషయానికి వస్తే... రాజ్ తరుణ్ లుక్ పరంగా కొత్తగా కనిపించారు. లాస్ట్ సినిమాలతో పోలిస్తే... మార్పు కనిపించింది. నటుడిగా ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నారు. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఆయన టైమింగ్ కూడా నవ్వించలేదంటే... డైలాగులు, కామెడీ సన్నివేశాలు ఎంత వీక్ అనేది అర్థం చేసుకోవచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. వర్షా బొల్లమ్మ  కూడా ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో తీసిన సీన్స్, సాంగ్ లో ఫీల్ చూపించారు. అయితే... రాజ్ తరుణ్, వర్ష మధ్య లవ్ ట్రాక్ లో ఎమోషన్ మిస్ అయ్యింది. లవ్ సీన్స్‌లో వర్షను చూడటం కూడా ఇబ్బందిగా అనిపించింది.  ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు.


Also Read: 'సెల్యూట్' రివ్యూ: హైదరాబాద్‌లో సముద్రం ఎక్కడుంది బాస్?


కథా నేపథ్యం కొత్తగా ఉన్నప్పటికీ... రొటీన్ కథ, కామెడీ లేకపోవడంతో ప్రేక్షకుల సహనాన్ని 'స్టాండప్ రాహుల్' పరీక్షిస్తుంది. నవ్వుల సంగతి అటుంచి... 'కూర్చుంది చాలు. థియేటర్ నుంచి బయటకు వెళదామ'ని అనిపిస్తుంది. సినిమాలో కామెడీ లేదు, కొత్తదనం లేదు. వెళ్లాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యి ఉంటే సినిమా మరోలా ఉండేది.


Also Read: 'జేమ్స్‌' రివ్యూ: పవర్ స్టార్ ఆఖరి సినిమా ఎలా ఉంది?



Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?