మూవీ: డీప్ వాటర్ (Deep Water)
రేటింగ్: A (18+) 
దర్శకుడు: అడ్రియన్ లైన్ 
తారాగణం: బెన్ అఫ్లెక్(Ben Affleck), అనా డి అర్మాస్(Ana de Armas), ట్రేసీ లెట్స్, లిల్ రెల్ హౌరీ, డాష్ మిహోక్, ఫిన్ విట్రాక్, క్రిస్టెన్ కొన్నోలీ, జాకబ్ ఎలోర్డి, రాచెల్ బ్లాన్‌చార్డ్ తదితరులు.
జానర్: ఎరోటిక్ థ్రిల్లర్
రిలీజ్: ఓటీటీ (Amazon Prime Video)
రన్ టైమ్: 115 నిమిషాలు


Deep Water | ఓ భర్త తన భార్యను ఎంతగానో ప్రేమిస్తాడు. కానీ, అతడి భార్య ఇతర పురుషుల నుంచి కూడా ప్రేమను కోరుకుంటుంది. ఈ విషయంలో భార్యను కంట్రోల్ చేయలేని ఆ భర్త ఏం చేశాడనేది Deep Water చిత్రం కథాశం. 1957లో బెన్ అఫ్లెక్, అనా డి అర్మాస్ ప్యాట్రిసియా హైస్మిత్ రాసిన సైకలాజికల్ థ్రిల్లర్ నవల ఆధారంగా ‘డీప్ వాటర్(Deep Water)’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించి అడ్రియన్ లైన్, చాలా సున్నితమైన లైన్‌ను తీసుకుని తెరపై ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, గతంలో దర్శకత్వం వహించిన 9½ వారాలు (1986), ఫాటల్ అట్రాక్షన్ (1987), ఇన్‌డీసెంట్ ప్రపోజల్ (1993) వంటి రసవత్తరమైన రొమాంటిక్ చిత్రాలను అందించిన అడ్రియన్ లైన్ 2002లో విడుదలైన ‘అన్‌ఫెయిత్‌ఫుల్’ తర్వాత మళ్లీ ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆయన ‘డీప్ వాటర్’ అనే ఏరోటిక్ థ్రిల్లర్‌తో ముందుకొచ్చాడు. ‘డీప్ వాటర్’(Deep Water) చిత్రం ఎలా ఉంది. ప్రేక్షకులకు నచ్చుతుందా? 


కథ: లూసియానాలోని లిటిల్ వెస్లీ అనే చిన్న పట్టణంలో నివసిస్తున్న విక్ వాన్ అలెన్ (Ben Affleck), మెలిండా వాన్(Ana de Armas) దంపతులకు ఒక కుమార్తె ఉంటుంది. ఇద్దరు ప్రేమగా కలిసి ఉండరు. కానీ, విడాకులు తీసుకోవడం ఇష్టం లేక ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. మెలిండా ఆ ఇంటిని విడిచిపెట్టకుండా ఉండేందుకు భర్త విక్.. ఎంతమంది ప్రేమికులనైనా ఇంటికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇస్తాడు. దీంతో మెలిండా ఆ పట్టణానికి కొత్తగా వచ్చిన జోయెల్ (బ్రెండన్ సి. మిల్లర్) అనే యువకుడితో రొమాన్స్‌కు సిద్ధమవుతుంది. దీంతో విక్.. అతడిని అదే పార్టీలో కలిసి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆమెతో స్నేహంగా ఉన్న మార్టిన్ అనే వ్యక్తి తానే హత్య చేశానని చెబుతాడు. దీంతో అతడు ఆ పట్టణం వదిలి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మెలిండా ఓ పియానో ప్లేయర్‌ చార్లీ (జాకబ్ ఎలోర్డి)తో స్నేహం చేస్తుంది. అతడిని ఓ రోజు పార్టీకి పిలుస్తుంది. స్విమ్మింగ్‌పూల్‌లో అంతా మద్యం సేవిస్తున్న సమయంలో వర్షం వస్తుంది. పియానో ప్లేయర్, విక్ మాత్రమే స్విమ్మింగ్‌పూల్ వద్ద ఉంటారు. కొన్ని నిమిషాల తర్వాత చార్లీ స్విమ్మింగ్‌‌పూల్‌లో చనిపోయి తేలుతాడు. దీంతో మెలిండా.. తన భర్త విక్‌ అతడిని హత్య చేశాడని చెబుతుంది. పోలీసుల విచారణలో అతడు మద్యం ఎక్కువై ఈత కొట్టలేక స్విమ్మింగ్‌పూల్‌లో మునిగిపోయి చనిపోయినట్లు విక్ స్నేహితులు తెలిపారు. కానీ, డాన్ విల్సన్(ట్రేసీ లెట్స్) అతడిని ఈ కేసులో ఇరికించాలని చూస్తాడు. దీంతో అతడికి వార్నింగ్ ఇస్తాడు విక్. ఆ ఘటన తర్వాత మెలిండా టోనీ (ఫిన్ విట్రాక్) అనే వ్యక్తితో స్నేహం చేస్తుంది. ఆ తర్వాత అసలు కథ తెరపైకి వస్తుంది. మరి టోనీ కూడా అందరిలా హత్యకు గురవ్వుతాడా? మెలిండాతో స్నేహం చేసినవారంతా ఏమైపోయారు? వారివి సహజ మరణాల? హత్యల? విక్ వారిని నిజంగానే హత్య చేస్తాడా? మెలిండాలో మార్పు తీసుకురాగలడా? 


Also Read: 'జేమ్స్‌' రివ్యూ: పవర్ స్టార్ ఆఖరి సినిమా ఎలా ఉంది?


విశ్లేషణ: నవలలో పేర్కొన్నట్లుగా వారిద్దరూ పరస్పర అంగీకరంతోనే ఒకే ఇంట్లో కలిసి ఉంటారనే స్పష్టత ఇవ్వలేదు. అది ప్రేక్షకుల ఆలోచనకే వదిలేశాడు. మెలిండా తన కూతురిని పట్టించుకోదు. కేవలం విక్ మాత్రమే ఆమె బాగోగులు చూస్తుంటాడు. మెలిండా మాత్రం తన కోర్కెలను అదుపులో పెట్టుకోలేక ఎప్పుడూ కొత్త స్నేహితులను వెదికే పనిలోనే ఉంటుంది. ఆమె చూపులు, ఆహార్యం కూడా మగాళ్లకు పిచ్చిక్కిస్తుంది. ఆమె వేరొకరి భార్య అని తెలిసి కూడా.. ఆ ఇంటికి వెళ్లి భర్త ఉండగానే రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది విక్‌కు అసూయ కలిగిస్తుంది. కానీ, మెలిండాకు అడ్డు చెప్పడు. చిత్రంలో మెలిండా తన బాయ్‌ఫ్రెండ్స్‌తో శరీరకంగా కలిసే సన్నివేశాలేవీ చూపించలేదు. వారితో గడిపిన క్షణాల గురించి మెలిండా చెప్పడానికి సిద్ధమైన విక్ తనకు చెప్పద్దని చెబుతాడు. దీంతో ఆమె వారితో సంబంధం పెట్టుకుందా లేదా అనే స్పష్టత ఉండదు. కేవలం విక్ భావోద్వేగాలను చూపించే ప్రయత్నం మాత్రమే చేశాడు. ఈ చిత్రాన్ని మరింత థ్రిల్లింగ్‌గా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు చాలా లైట్‌గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. కథ చాలా స్లోగా నడుస్తుంది. అయితే, మెలిండా వాన్(అనా డి అర్మాస్) తన నటనతో ఆకట్టుకుంటుంది. విక్ వాన్ అలెన్ (బెన్ అఫ్లెక్) ఒకే మూడ్‌లో కనిపిస్తాడు. తన సమయం మొత్తం భార్యపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తాడు. ఈ చిత్రం పెద్దలకు మాత్రమే. చివరిగా ‘డీప్ వాటర్’.. టైటిల్‌లో ఉన్నంత డీప్‌గా చిత్రం ఉండదు. పతాక సన్నివేశాల్లో చూపించినట్లే.. కథనం కూడా పైపైనే ఉంటుంది.