సినిమా రివ్యూ : రిచి గాడి పెళ్లి
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సత్య ఎస్.కె, నవీన్ నేని, ప్రణీతా పట్నాయక్, చందనా రాజ్, బన్నీ వాక్స్, ప్రవీణ్ రెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం : విజయ్ ఉలగనాథ్
నేపథ్య సంగీతం : బ్రిట్టో మైఖేల్
స్వరాలు : సత్యన్
రచన, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం : కె.ఎస్. హేమరాజ్
విడుదల తేదీ : మార్చి 3, 2023


సినిమాల్లో చిన్నవి అంటూ ఏమీ ఉండవు. భారీ తారాగణం, బడ్జెట్ లేకపోయినా సరే ప్రేక్షకులు మెచ్చిన ప్రతిదీ విజయవంతమైన చిత్రమే. ఇటీవల తెలుగులో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు పెరిగాయి. చిన్న కాన్సెప్ట్ పట్టుకుని (Concept oriented films in Telugu 2023) తీసిన సినిమాలు సైతం థియేటర్లలో ఆడుతున్నాయి. లేదంటే తర్వాత ఓటీటీల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. 'రిచి గాడి పెళ్లి' అంటూ ఈ శుక్రవారం ఓ చిన్న సినిమా వచ్చింది. అది ఎలా ఉంది?


కథ (Richie Gadi Pelli Movie Story) : రిచి (సత్య ఎస్.కె) పెళ్లి కుదురుతుంది. ఊటీలో డెస్టినేషన్ వెడ్డింగ్. పెళ్లికి స్నేహితులు అందర్నీ ఆహ్వానిస్తాడు. ఊటీలో సరదాగా 'టేబుల్ ఆఫ్ సీక్రెట్స్' అని ఓ గేమ్ ఆడతారు. ఎవరికి ఏ ఫోన్ వచ్చినా సరే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడాలని అనుకుంటారు. అప్పుడు రిషి గతంలో ప్రేమించిన అమ్మాయి నేత్ర (బన్నీ వాక్స్) విషయం బయట పడుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏయే విషయాలు దాచారు? అనేది కూడా బయట పడుతుంది. లౌడ్ స్పీకర్ పెట్టి ఫోనులు మాట్లాడటం వల్ల ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి? తర్వాత ఏమైంది? చివరకు, రిచి & నేత్ర కలిశారా? లేదా? రిచితో పెళ్లికి సిద్ధపడిన అమ్మాయి సిరి (చందనా రాజ్) పరిస్థితి ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ : ప్రతి మనిషికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. స్నేహితులు, కాబోయే భార్య, జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు... ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక్కటైనా రహస్యంగా ఉంచుతారు. అది బయట పడితే? ఈ కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉంది. 'రిచి గాడి పెళ్లి' సినిమాను మిగతా సినిమాల మధ్య అదే కొత్తగా నిలబెట్టింది. 


రైటర్ & డైరెక్టర్ కె.ఎస్. హేమరాజ్ ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. టెక్నికల్ పరంగా కూడా మంచి టీమ్ సెట్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ బావుంది. పాటలు బావున్నాయి. ముఖ్యంగా కైలాష్ ఖేర్ పాడిన 'ఏమిటిది మతి లేదా ప్రాణమా...' సాంగ్ ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనేలా ఉంది.  నేపథ్య సంగీతం కూడా బావుంది. కథ, మిగతా విషయాల్లో మంచి కేర్ తీసుకున్న కె.ఎస్. హేమరాజ్ నటీనటుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహిస్తే అవుట్ ఫుట్ మరింత బాగా వచ్చేది. కొత్త నటీనటుల కారణంగా కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలు ఆశించిన ప్రభావం చూపించలేదు. మానవ సంబంధాలను కొత్త కోణంలో, నిజాయితీగా చూపించిన చిత్రమిది. 


'రిచి గాడి పెళ్లి'లో మొదట అరగంట పాత్రల పరిచయానికి దర్శకుడు సమయం తీసుకున్నారు. అందువల్ల, ఆ సన్నివేశాలు బోర్ కొడతాయి. ఒక్కసారి ఊటీ వెళ్ళిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుంచి ఆసక్తి మొదలవుతుంది. ఈ మధ్య ఫోన్ ఎక్స్‌ఛేంజ్ కాన్సెప్ట్ నేపథ్యంలో 'లవ్ టుడే' వచ్చింది. ఇదీ ఆ తరహా చిత్రమే. బలమైన స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ వేల్యూస్ ఉండుంటే ఆ స్థాయికి వెళ్ళేది. నిర్మాణ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి.   


నటీనటులు ఎలా చేశారంటే? : సినిమాలో ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖాలు తక్కువ. నవీన్ నేని, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ ప్రణీతా పట్నాయక్ కొందరికి తెలిసి ఉంటుంది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కంటే కాన్సెప్ట్ చాలా సన్నివేశాల్లో హైలైట్ అయ్యింది. సిట్యువేషనల్ ఫన్ వర్కవుట్ అయ్యింది. ఎమోషనల్ సన్నివేశాల్లో సీజనల్ యాక్టర్స్ ఉంటే బావుండేది. సీరియల్ హీరోగా నవీన్ నేని నటన బావుంది. హీరో సత్య ఒకే. సోషల్ మీడియాలో పాపులర్ అయిన బన్నీ వాక్స్ ఓ కథానాయికగా కనిపించారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సతీష్ శెట్టి కామెడీ బావుంది.  


Also Read 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'రిచి గాడి పెళ్లి'లో కోర్ పాయింట్, కాన్సెప్ట్ డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కైలాష్ ఖేర్ పాడిన సాంగ్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. నటీనటులు కొత్త వాళ్ళు కావడంతో కొన్ని సన్నివేశాలు వర్కవుట్ కాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా కొన్ని మైనస్ లు ఉన్నాయి. అయితే, సినిమాటోగ్రఫీ బావుంది. పార్టులు పార్టులుగా సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఓటీటీలో అయితే పర్ఫెక్ట్ వాచ్.  


Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ