'బాహుబలి' విడుదలైనప్పుడు హిందీలో భారీ విజయం సాధిస్తుందని అక్కడి దర్శక నిర్మాతలు ఎవరూ ఊహించి ఉండరు. 'బాహుబలి 2' విడుదల సమయానికి రెండో పార్ట్ మీద హిందీలోనూ అంచనాలు ఉన్నాయి. అయితే, బాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనం మీద కూర్చుని ఉంటుందని కనీసం కలలో కూడా ఎవరూ అనుకుని ఉండరు. ఆ కలను నిజం చేశారు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్.
'బాహుబలి 2' రికార్డులు బద్దలుకొట్టిన 'పఠాన్'
'బాహుబలి 2' హిందీలో భారీ విజయం సాధించడమే కాదు, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా చరిత్రకు ఎక్కింది. 'బాహుబలి 2' హిందీ వెర్షన్ రూ. 510 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ 'పఠాన్' సినిమా బద్దలు కొట్టింది.
'పఠాన్' @ 528 కోట్లు అండ్ కౌంటింగ్!
ప్రస్తుతానికి 'పఠాన్' సినిమా రూ. 528 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతోంది. సినిమాకు ఇంకా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మాత్రమే కాదు... ఫస్ట్ డే, ఫస్ట్ వీక్, ఫస్ట్ మంత్ - ఇలా 'బాహుబలి ' క్రియేట్ చేసిన చాలా రికార్డులను 'పఠాన్' తుడిచి పెట్టేసింది.
'బాహుబలి 2'ను బీట్ చేయడానికి ఏడేళ్ళు!
ఒక వైపు కలెక్షన్స్ పరంగా 'బాహుబలి 2' కంటే 'పఠాన్' పైన ఉన్నప్పటికీ... మరో వైపు ఓ విషయంలో వెనుకబడింది. 'బాహుబలి 2' కంటే 'పఠాన్' చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు సంఖ్య తక్కువ. 'బాహుబలి 2' విడుదలైనప్పటి టికెట్ రేట్లతో పోలిస్తే... 'పఠాన్' విడుదలైనప్పుడు ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి. అందువల్ల, వసూళ్లు వచ్చాయి. ఇంకో అంశం ఏమిటంటే... ఒక సౌత్ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు బీట్ చేయడానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు ఏళ్ళు పట్టింది.
బాలీవుడ్ కాలర్ ఎగరేసిన షారుఖ్!
కలెక్షన్స్ పరంగా కావచ్చు... ఇండస్ట్రీ పరంగా కావచ్చు... 'పఠాన్' సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీ (బాలీవుడ్) కాలర్ ఎగరేశారు షారుఖ్ ఖాన్. ఫ్లాపుల్లో ఉన్న ఆయన బయట పడటమే కాదు... హిందీ ఇండస్ట్రీకి భారీ హిట్ ఇచ్చారు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న హిందీ దర్శక, నిర్మాతలకు ఎటువంటి సినిమా కావాలనేది చేసి చూపించారు.
Also Read : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?
'పఠాన్', 'బాహుబలి' తర్వాత ఎవరంటే?
షారుఖ్, ప్రభాస్ ఒకటి, రెండు స్థానాల్లో ఉంటే... ఆ తర్వాత కన్నడ సెన్సేషన్ యశ్ హీరోగా నటించిన 'కె.జి.యఫ్ : చాఫ్టర్ 2' ఉంది. ఆ సినిమా రూ. 434 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ 'దంగల్' (రూ. 387.38 కోట్లు), రణ్బీర్ కపూర్ 'సంజు' (రూ. 342 కోట్లు), ఆమిర్ ఖాన్ 'పీకే' (రూ. 340 కోట్లు), సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' (రూ. 339 కోట్లు), 'భజరంగీ భాయిజాన్' (రూ. 320 కోట్లు), హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' (రూ. 317 కోట్లు), దీపికా పదుకోన్ 'పద్మావత్' (రూ. 302 కోట్లు) కలెక్ట్ చేశాయి. ఈ కలెక్షన్స్ హిందీలోవి మాత్రమే.