'సర్కారు వారి పాట' సినిమాతో సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే.
జక్కన్న - మహేష్ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. దాదాపు పుష్కర కాలం ముందు మొదలైన చర్చలు.. ఇన్నాళ్లకు ఫలిస్తున్నందుకు వారంతా ఖుషీ అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాత్కాలికంగా #SSMB29 పేరుతో పిలవబడుతున్న ఈ సినిమాకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. లేటెస్టుగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని, మహేష్ 4 ఏళ్లు ఈ ప్రాంచైజీకే పరిమితం కానున్ననారనే ఆసక్తికరమైన రూమర్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
బాహుబలి కథను 'ది బిగినింగ్' 'ది కన్క్లుజన్' అంటూ రెండు పార్ట్స్ గా తీసిన దర్శక ధీరుడు.. పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటారు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత రాజమౌళి రేంజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది. 'నాటు నాటు' ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన తరవాత, హాలీవుడ్ లోనూ జక్కన్న గురించి చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రాజమౌళి దృష్టంతా అంతర్జాతీయ మార్కెట్ ని పట్టుకోవడంపైనే ఉంది. RRR మూవీ గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు అందుకోవడంతో.. ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ లో అందరిని ఆకట్టుకునే ఒక పెద్ద చిత్రాన్ని అందించాలనుకుంటున్నారు.
ఇప్పటికే రాజమౌళి టీమ్ మహేష్ బాబు స్క్రిప్టు మీద వర్క్ మొదలు పెట్టేశారు. నివేదికల ప్రకారం, దీన్ని రెండు భాగాలుగా లేదా సీక్వెల్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఈ చిత్రానికి స్ఫూర్తినిచ్చిందని జక్కన్న తండ్రి, రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ గతంలో ధృవీకరించారు. ఇదొక అడ్వెంచర్ స్టోరీ అని, ఇది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని వెల్లడించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్స్ వస్తాయా అని విజయేంద్ర ప్రసాద్ ను అడగ్గా.. సీక్వెల్స్ ఉంటాయని.. వీటిల్లో కథ మారుతుందని, ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయని చెప్పినట్లు తెలుస్తొంది. ఇందులో రాజమౌళి గత చిత్రాల కంటే మరింత ఎఫెక్టివ్ హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.
SSMB29 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతిపెద్ద చిత్రాల్లో ఒకటిగా పేర్కొనబడుతోంది. ఇప్పటికే మహేష్ - రాజమౌళి కాంబోపై ఉన్న హైప్ కు తోడుగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా RRR సాధిస్తున్న ఘనత కూడా ప్లస్ కానుంది. మహేష్ బాబు కూడా జక్కన్నతో పనిచేయాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. నాలుగేళ్ల సమయాన్ని కేటాయించడానికి కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ తెలుగు సినిమాలే చేస్తూ వచ్చిన మహేష్.. రాజమౌళి మూవీతో పాన్ ఇండియా కాదు, ఏకంగా గ్లోబల్ స్టార్ గా అవతరించే అవకాశం ఉంది. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వివరాలు వెల్లడికానున్నాయి.