Pradeep Ranganathan's Return Of The Dragon Review In Telugu: తెలుగులోనూ 'లవ్ టుడే' సినిమా సంచలన విజయం సాధించింది. యువతలో ప్రదీప్ రంగనాథన్‌కు ఫాలోయింగ్ పెంచింది. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో ఈ రోజు ఆయన థియేటర్లలోకి వచ్చారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లు. 'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.


కథ (Return Of The Dragon 2025 Movie Story): డ్రాగన్ అలియాస్ డి రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. బీటెక్ తర్వాత ఆరేళ్ళు ఖాళీగా ఉంటాడు. దాంతో గర్ల్ ఫ్రెండ్ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. జీవితంలో ఎలాగైనా సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్ ద్వారా మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఒక పెద్దింటి అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి ఫిక్స్ అవుతుంది. అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ (మిస్కిన్)కి డ్రాగన్ విషయం తెలుస్తుంది.


డ్రాగన్ ఫేక్ సర్టిఫికేట్ గురించి కంపెనీలో, కాబోయే మామగారి ఇంట్లో చెప్పకుండా ఉండాలంటే మూడు నెలలు కాలేజీలో అన్నీ క్లాసులకు అటెండ్ అయ్యి పరీక్షలు రాసి 48 సప్లమెంటరీలు రాసి పాస్ అవ్వాలని చెబుతాడు ప్రిన్సిపాల్. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కాలేజీకి వెళ్ళిన రాఘవన్ ఏం చేశాడు? అక్కడికి కీర్తి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి ఏం చేసింది? మూడు నెలలు కాలేజీలో ఉన్నప్పుడు ఇంట్లో, ఆఫీసులో, పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయితో ఏం చెప్పాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Return Of The Dragon 2025 Review): 'లవ్ టుడే' తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ కావడానికి రీజన్ అందులో నావెల్టీ పాయింట్. లవర్స్ ఫోన్స్ మార్చుకోవడం అనేది ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు. దానికి తోడు ప్రదీప్ రంగనాథన్ నటన, దర్శకత్వం కూడా ట్రెండీగా ఉన్నాయి. దర్శకుడు అశ్వత్ మారిముత్తు తీసిన 'ఓరి దేవుడా' విజయానికి కారణం కూడా అందులో కొత్త పాయింట్. అయితే... వాళ్లిద్దరూ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'కు వచ్చేసరికి సేఫ్ గేమ్ ఆడారు. 


'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' కథలో గానీ, కథనంలో గానీ కొత్తదనం లేదు. పోనీ ప్రతి సీన్ కొత్తగా గానీ లేదా వినోదం పంచేలా తీశారా? అంటే... అదీ లేదు. కాలేజీ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల ప్యాటర్న్ ఫాలో అయ్యారు. సగం సినిమా వరకు రెగ్యులర్, రొటీన్ సీన్లతో నడిచింది. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే... సెకండాఫ్ కొంత ఎగ్జైట్ చేసింది. సన్నివేశాలు, మధ్యలో ట్విస్టులు కొంత బావున్నాయి.


ప్రేక్షకులకు తెలిసిన సన్నివేశాలతో, ఆల్రెడీ చూసిన కథలు కొన్నిటిని మిక్సీలో వేసి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అశ్వత్ మారిముత్తు. వినోదం కోసం రీల్స్, మీమ్స్ వంటి వాటిని నమ్ముకున్నారు. అయితే, కథనంలో వేగం ఉందా? లేదా? అనేది చూసుకోలేదు. దాంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కెమెరా వర్క్ ఓకే. లియోన్ జేమ్స్ సాంగ్స్, రీ రికార్డింగ్ కాలేజీ కథకు తగ్గట్టు ఉన్నాయి.


ప్రదీప్ రంగనాథన్ బాయ్ నెక్స్ట్ డోర్ లుక్స్ 'డ్రాగన్'లో రాఘవన్ పాత్రకు పెద్ద ప్లస్. నటుడిగానూ తన బెస్ట్ ఇచ్చారు. కాలేజీలో పొగరుబోతుగా తిరిగే సీన్లు చేయడం ఈజీ. కానీ, వాటిని రెగ్యులర్‌గా చేయకుండా స్వాగ్ చూపిస్తూ చేశారు ప్రదీప్ రంగనాథన్. అయితే, ఎమోషనల్ సీన్లలో అదరగొట్టారు. హీరోయిన్ కయాదు లోహర్ గ్లామరస్‌గా కనిపించారు. కథలో ఆమె పాత్రకు ప్రాముఖ్యం ఉంది. కానీ, నటిగా వేరియేషన్స్ గానీ, పెర్ఫార్మన్స్ గానీ చూపించే ఛాన్స్ ఆవిడకు దక్కలేదు. పాత్ర పరిధి మేరకు ఉన్నంతలో చక్కగా చేశారు. కాలేజీలో హీరో ప్రేమించిన అమ్మాయిగా అనుపమా పరమేశ్వరన్ నటించారు. కయాదుతో కంపేర్ చేస్తే స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ. కానీ, ఆ పాత్రకు తగ్గట్టు నటించారు.


Also Read'జాబిలమ్మ నీకు అంత కోపమా' రివ్యూ: ధనుష్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ - హిట్టా? ఫట్టా?


దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కెఎస్ రవికుమార్ కీలక పాత్రలు చేశారు. ముగ్గురిలో మిస్కిన్ ఎక్కువ గుర్తుంటారు. ఆయన క్యారెక్టర్ అటువంటిది. హీరో స్నేహితులుగా నటించిన వారిలో 'రివ్యూ' లక్ష్మణ్ తెలుగు ప్రేక్షకులకు తెల్సిన ఫేస్. హీరో తండ్రిగా జార్జ్ మరియన్ నటన మనసుకు హత్తుకునేలా ఉంది. స్నేహ అతిథి పాత్రలో మెరిశారు.


'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'... కథ కొత్తది కాదు. ఎమోషన్స్ కూడా కొత్త కాదు. కానీ, ప్రదీప్ రంగనాథన్ తన నటనతో పలు సన్నివేశాలను నిలబెట్టారు. రొటీన్ ఫస్టాఫ్ పాస్ అయ్యేలా ఉందంటే ఆయనే కారణం. సినిమాలో నిడివి ఎక్కువ అయ్యింది. కానీ, ప్రేక్షకులను థియేటర్ల నుంచి బయటకు పంపించేటప్పుడు మంచి సందేశం ఇచ్చారు. ఎమోషనల్ క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌గా ఉంది. ప్రదీప్ రంగనాథన్ కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే డిజప్పాయింట్ అవ్వకుండా రావచ్చు. లేదంటే కష్టం.


Also Read: సమ్మేళనం రివ్యూ: విలన్ లేని ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ఒకే అమ్మాయిని బెస్ట్ ఫ్రెండ్స్‌ లవ్ చేస్తే... ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?